జీఎస్‌టీపై ‘మెర్సల్’ విమర్శలు: బీజేపీ ఆగ్రహం

  • 21 అక్టోబర్ 2017
తమిళ నటుడు విజయ్
చిత్రం శీర్షిక ’మెర్సల్‘ సినిమాలో నటుడు విజయ్ నోట వినిపించే డైలాగ్ మీద బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది

''సింగపూర్‌లో కేవలం 7 శాతం జీఎస్‌టీ మాత్రమే వసూలు చేస్తారు. అయినా అక్కడ ప్రజలకు వైద్య సేవలు ఉచితంగా అందిస్తారు. కానీ ఇక్కడ 28 శాతం జీఎస్‌టీ వసూలు చేస్తున్నారు. అయినా వైద్య సేవలు ఉచితంగా అందించరు'' - ఇదేదో రాజకీయ పార్టీ ప్రముఖుల నుంచి వచ్చిన విమర్శ కాదు. 'మెర్సల్' అనే తమిళ సినిమాలో హీరో విజయ్ నోట వినిపించే డైలాగ్.

ఈ డైలాగ్ మీద బీజేపీ తమిళనాడు అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ (కాంగ్రెస్ నాయకుడి కుమార్తె) అభ్యంతరం వ్యక్తం చేశారు. ''మీరు చట్ట ప్రకారం నడుచుకోకుండానే సినిమాలు తీస్తారు. మళ్లీ మీరు చట్టం గురించి, పన్ను గురించి, ప్రభుత్వం గురించి మాట్లాడతారు'' అని ఆమె ధ్వజమెత్తారు. నటులు తమ సంపాదన ఎంతో నిజాయితీగా వెల్లడించరని, నిజాయతీగా పన్ను చెల్లించరని అంటూ ఆమె ఎదురుదాడి చేశారు.

Image copyright TWITTER
చిత్రం శీర్షిక ’మెర్సల్‘ సినిమాలో ప్రభుత్వాన్ని విమర్శించే దృశ్యాలను తొలగించాలని తమిళిసై డిమాండ్ చేశారు

''అటువంటి వాళ్లు రోజుకు 24 గంటలు పనిచేస్తున్న ప్రధానమంత్రి అమలు చేసే ప్రాజెక్టులను తప్పుపట్టజాలరు'' అని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సినిమాలో ప్రభుత్వాన్ని విమర్శించే దృశ్యాలను తొలగించాలని తమిళిసై డిమాండ్ చేశారు.

''జీఎస్‌టీ గురించి మీకేం తెలుసు?'' అని హీరో విజయ్ అభిమానులను ఆమె ప్రశ్నించారు. వారు తప్పుడు కార్యక్రమాలకు మద్దతివ్వరాదని కూడా ఆమె పిలుపునిచ్చారు. ఇటువంటి ఆలోచనలను వ్యాపింపచేయడం ఖండనార్హమన్నారు.

Image copyright Getty Images

సినిమాలోని మరొక హాస్య సన్నివేశం కూడా బీజేపీకి కోపం తెప్పించింది. విదేశంలో ఒక దొంగ ఒక వ్యక్తి నుంచి పర్సు దొంగలిస్తున్నపుడు.. ''నేను ఇండియన్‌ని. అక్కడ డిజిటల్ మనీ మాత్రమే ఉంది. అందుకే నా దగ్గర డబ్బులు లేవు'' అని బాధితుడు చెప్తున్న సీన్ అది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)