ఎడిటర్స్ కామెంట్: అమరావతి రంగుల కల నిజమవుతుందా?

  • జి.ఎస్. రామ్మోహన్
  • ఎడిటర్, బీబీసీ తెలుగు
అమరావతి

ఫొటో సోర్స్, facebook

రాజధాని ఎందుకంతగా ప్రతిరోజూ వార్తల్లో నలిగేంత పెద్ద విషయమూ వివాదాస్పద విషయమూ అయిపోయింది? చంద్రబాబు ఎందుకు పదే పదే పెద్ద పెద్ద ఫొటోషాప్ నగరాలను చూపిస్తున్నారు? దీని వెనుక ఏముంది? శంకుస్థాపన జరిగి రెండేళ్లు పూర్తయి మూడో ఏట అడుగుపెడుతున్నాం కదా, నిర్మాణపు పురోగతి ఎంత? రాజకీయంగా పాలనా పరంగా అది ఏ మలుపులు తీసుకోబోతున్నది? అనేవి చర్చించుకోవడానికి చరిత్రలోకి కాస్త వెనక్కు నడవాల్సి ఉంటుంది.

రాష్ర్ట విభజన తర్వాత ఆంధ్ర ప్రాంతం వారు భావించిన అతి పెద్ద క్లేశం హైదరాబాద్ అనే భారీ నగరాన్ని 'కోల్పోవడం'. పాలనా పరమైన పరిభాషలో మాట్లాడేవారికయితే ఆ రెవిన్యూ కోల్పోవడం.

భాష ప్రాతిపదికమీద ఏర్పడిన తొలి రాష్ర్టం నైజాంతో కలిసి విశాలమై అభివృద్ధి పథంలో సాగుతున్న రాష్ర్టం విడిపోవడమేమిటి? తెలుగు మాట్లాడేవాళ్లందరూ ఒక రాష్ర్టంగా ఉంటే బాగుండును కదా అనే భావన కొంతమందిలో ఉన్నప్పటికీ భౌతికపరమైన అసంతృప్తిలో పెద్ద పాత్ర హైదరాబాద్ నగరానిది.

నిజంగా కోల్పోయేదేమిటి, అప్పటికీ ఇప్పటికీ వచ్చిన తేడా ఎంత అనేదానికంటే కూడా అదొక ఉద్వేగభరితమైన అంశంగానే ఉంటూ వస్తున్నది.

ఫొటో సోర్స్, facebook

మధ్యతరగతి మేధావుల్లో కొంతమందిని కదిలించినప్పుడల్లా హైదరాబాద్ వెలుగుల్లో ఆంధ్రుల పాత్ర ఎంత కీలకం అనేదాని గురించి బాధపడుతూ మాట్లాడుతూ ఉంటారు. చంద్రబాబు ఈ భావోద్వేగపరమైన అసంతృప్తిని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. మారిన కాలంతో పాటు భారీతనంమీద క్రేజ్ పెరిగిపోతూ వస్తుండడం వల్ల రాజధాని ఆశల్ని, కలల్ని ఆ భారీతనాన్ని మరింత పెంచేశారు.

ఆయనైతేనే అంతగొప్ప రాజధానిని పోటాపోటీగా నిర్మించగలరు, పాలనను పట్టాలెక్కించగలరు అనే భావన ప్రచారంలో ఉండింది. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ నిర్మాణం, సాఫ్ట్‌వేర్ బూమ్‌ని అందిపుచ్చుకోవడం ఆయనకు ఉపయోగపడిన అంశాలు. ఇప్పటికీ ఆయన ప్రతిరోజూ క్రమం తప్పకుండా జనాలకు గుర్తుచేస్తున్న అంశాలు.

ఎన్నికల ప్రచారంలోనే హైదరాబాద్‌ను తలదన్నే రాజధానిని నిర్మిస్తాం అని చెపుతూ ఆంధ్రుల భావోద్వేగాలను అడ్రస్ చేశారు. 2014 ఏప్రిల్ 30న తిరుపతిలో జరిగిన ఎన్నికల సభలో అయితే బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీ ఏకంగా దిల్లీని మించిన రాజధానిని నిర్మిస్తాం అని అతిశయోక్తులతో కూడిన హామీలిచ్చేశారు.

మోదీ నోట అంత అతిశయోక్తి ఎన్నికల ప్రచారంలో రావడం ఆంధ్రుల భావోద్వేగాలను తమకు అనుకూలంగా మల్చుకోవడంలో భాగం. దానికి తగ్గట్టుగానే తర్వాతి పరిణామాలు సాగాయి.

ఫొటో సోర్స్, ఫేస్‌బుక్

కాకపోతే ఈ ఉద్వేగపు కాక ఎన్నిరోజులు ఉంటుంది, భౌతికంగా పురోగతి అంతగా కనిపించకపోతే పరిస్థితి ఎలా మారొచ్చు అనేది ఇవాళ రచ్చబండమీదకు వస్తున్న అంశం. ప్రస్తుతం చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్నారు. సీడ్ క్యాపిటల్ నమూనాను ఖరారుచేయడం కూడా ఈ పర్యటనలో భాగం.

ఆయన పర్యటననుంచి వచ్చాక ఏం చేయబోతారు, పురోగతి ఎలా ఉండబోతోంది అనే దానిమీద చాలా అంశాలు ఆధారపడి ఉంటాయి. రాజకీయంగా కూడా ప్రాధాన్యమున్న అంశం ఇది.

ఇప్పటివరకైతే హైదరాబాద్‌ను తలదన్నేలా రాజధాని నిర్మాణం సాగుతుంది అని ప్రజలు నమ్మేలా చేయడానికి చంద్రబాబు తన శక్తిమేర ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా సింగపూర్ నుంచి ఇస్తాంబుల్ దాకా చాలా నగరాల నమూనాలు జనాలకు చూపించారు.

2015 అక్టోబర్ 22న జరిగిన రాజధాని శంకుస్థాపన కార్యక్రమంలో భారత ప్రధానితో పాటు జపాన్, సింగపూర్ పరిశ్రమల మంత్రులిద్దరూ పాల్గొనడం కాకతాళీయమేమీ కాదు. ముఖ్యమంత్రి ఆ తర్వాత నమూనాలుగా చూపించిన వాటిలో రాజధాని అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించే దేశాలుగా చూపించిన వాటిలో జపాన్, సింగపూర్, మలేసియా, చైనా, ముందుభాగాన ఉన్నాయి.

ఫొటో సోర్స్, facebook

అందివచ్చిన ఫొటోషాప్ టెక్నాలజీ ఆయనకు ఆయుధంలా ఉపయోగపడుతున్నది. ఈ ఫోటోషాప్ నగరాలు ఎంతమేరకు నిజరూపంలో చూడగలం అనే సందేహాలు ఇపుడిపుడే బలపడుతున్నాయి.

ఇటీవల రాజధాని డిజైన్లకు బాహుబలి దర్శకుడు రాజమౌళి సలహాలు తీసుకోవాలని నిర్ణయించాక.. చంద్రబాబు సీరియస్‌నెస్‌పై కొత్త ప్రశ్నలు ముందుకొచ్చాయి.

పారిశ్రామికీకరణకు తగినంత ప్రాధాన్యమిస్తున్నారా, ఇవ్వకుండా భారీ రాజధానులు సాధ్యమేనా అన్నది బలంగా వినిపించే ప్రశ్న.

హైదరాబాద్ విస్తరణ తొలిదశలో బీహెచ్ఈఎల్, ఈసీఐఎల్ లాంటి భారీ ప్రభుత్వ రంగ సంస్థలది కీలకపాత్ర. మలిదశలో ప్రైవేట్ రంగం, అందులోనూ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీది కీలకపాత్ర.

రెండూ నాటి పాలనా విధానాలకు దేశంలో వచ్చిన మార్పులకు సంకేతాలు. ఇందిరాగాంధీ అమలు చేసిన నెహ్రూవియన్ పారిశ్రామిక నమూనా ఒకటైతే, పీవీ ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక విధాన నమూనా తాలూకు ప్రతిఫలం రెండోది.

ఫొటో సోర్స్, facebook

నగరాలు ప్రధానంగా ఉపాధి కేంద్రాలు. విజయవాడ వ్యవసాయ రంగ పునాది ఉన్న పట్టణం. వైజాగ్ వలె ఇండస్ర్టియల్ సిటీ కాదు. బెజవాడ కంటే వేగంగా వైజాగ్ అభివృద్ధి చెందడంలో పనిచేసిన అంశం పరిశ్రమలే. అమరావతి విస్తరించడానికి జనం అక్కడికి ప్రవహించడానికి ఆ స్థాయిలో ఉపాధి కల్పించే మార్గాలు వెతికారా అనే ప్రశ్న ఎదురవుతోంది.

రాజధానికి అమరావతిని ఎంపిక చేసుకోవడం వ్యూహాత్మకమైనదే కావచ్చును. బెజవాడ-గుంటూరు మధ్య భాగంలో నగరాన్ని అభివృద్ధి చేస్తే అంతా కలిసిపోయి మహానగరంగా రూపుదిద్దుకుంటుందనే ఆలోచన ఉండొచ్చును. విపక్షాలు ఆరోపిస్తున్నట్టు ఇంకే కారణాలైనా ఉండొచ్చును.

కేంద్రం రాజధాని గురించి వేసిన శివరామకృష్ణన్ కమిటీ అక్కడ వద్దే వద్దని చెప్పినా, పక్కనే బీడు భూమి బోలెడంత పడి ఉండగా రెండు మూడు పంటలు పండే భూమిలో రాజధాని ఏమిటి అని పేర్కొన్నా చంద్రబాబు మాత్రం తన మాటే నెగ్గించుకోగలిగారు.

రాజకీయంగా తాను ఉన్న స్థితి, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో బంధం లాంటివన్నీ పనిచేశాయి. తొలిదశలో వచ్చిన విమర్శలను గట్టిగానే ఎదుర్కోగలిగారు. ముఖ్యంగా కాస్తో కూస్తో గొంతున్న రాయలసీమ నాయకులు అధికార పార్టీలో చేరిపోయాక ఈ విషయంలో చంద్రబాబు పరిస్థితి సులువైపోయింది.

ఫొటో సోర్స్, facebook

ఇక మేధా పాట్కర్, రాజేంద్రసింగ్ లాంటి సామాజిక కార్యకర్తలు, పర్యావరణ వాదుల గొంతులు మార్జిన్లను దాటి వినిపించే పరిస్థితి లేదు కాబట్టి అవి ఆయనకు పెను సవాల్‌గా మారలేదు.

ఆ మాటకొస్తే రాజధాని రభస ఎక్కువై పోయి పేదరికం, నిరుద్యోగం, పౌరహక్కులు, వ్యవసాయ సంక్షోభం వంటి ప్రాధమిక అంశాలు తెరవెనక్కు వెళ్లిపోతున్నాయని ఆవేదన పడేవారున్నా వారి మాట గట్టిగా బయటకు వినపడే పరిస్థితి లేదు. ఆ సాధనాలు వారికి దూరంగా ఉన్నాయి.

ఏమైతేనేం, ఏటా రెండు మూడు పంటలు పండే భూములను రాజధానికోసం సేకరించడంలో చంద్రబాబు కృతకృత్యులయ్యారు. కొన్ని గ్రామాల్లో రైతులనుంచి బలమైన వ్యతిరేకతలున్నా సామదాన భేదదండోపాయాలతో అదుపులో ఉంచగలిగారు. దానికి ఉన్న రాజకీయ కోణాలు సరేసరి.

రాజధాని నిర్మాణం పెద్ద స్కాం అని ప్రధాన ప్రతిపక్షం వైసీపీ తరచుగా ఆరోపణలు గుప్పిస్తూనే ఉంది. కమ్యూనిస్టు పార్టీలు కూడా తరచుగా విమర్శలు చేస్తూనే ఉన్నాయి.

ఫొటో సోర్స్, facebook

ప్రస్తుతానికైతే రాజధాని నిర్మాణం అంశం ఒక మలుపులో ఉంది. ఇప్పటికే చాలా నమూనాలు చూశారు. ఇప్పటికి కూడా కనీసం డిజైన్‌ ఖరారు కాకపోతే అసహనం పెరిగే అవకాశం ఉంది.

పదేళ్ల వరకూ హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని, అన్నింటికి తొందర ఎందుకు అని చెప్తూ వచ్చిన తెలుగుదేశం నేతలు సెక్రటేరియట్‌ను, అసెంబ్లీని హైదరాబాద్‌ నుంచి అమరావతికి తరలించిన పద్ధతి ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది.

హైదరాబాద్‌లో అన్ని కోట్లు ఖర్చుపెట్టి సీఎం కోసం ఫ్లోర్‌ సిద్ధం చేసి లేక్‌ వ్యూ గెస్ట్‌ హౌస్‌కు హంగులద్ది అంతలోనే హడావుడిగా ఎందుకు నిర్ణయం తీసుకున్నారనేది ఇప్పటికీ వినిపించేమాట.

ఓటుకు నోటు కేసులో తెలుగుదేశం నేతలు ఇరుక్కుపోయిన పద్ధతిని బట్టి ఇక ఇది మనది కాదు, మనం మన దారి తొందరగా చూసుకోవాలి అనే నిర్ణయానికి వచ్చారని, పార్టీ పరమైన వ్యవహారాలు పాలనా పరమైన వ్యవహారాలపై ప్రభావం చూపాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఫొటో సోర్స్, facebook

అంతకుముందు నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి పాలన చేస్తాం అని చెప్పి అక్కడా ఖర్చు పెట్టించారని గుర్తుచేస్తున్నారు. అసంతృప్తులంటూ బలపడడం మొదలైతే ఇవన్నీ మళ్లీ బలంగా ముందుకొచ్చే అవకాశం ఉంటుంది.

కేంద్రం నుంచి తెలుగుదేశానికి ఆశించిన సహాయం అందడం లేదన్నది బహిరంగ రహస్యం. బీజేపీతో తప్పనిసరి సంసారం మాత్రమే సాగుతున్నది.

దిల్లీని మించిన రాజధానిని నిర్మిస్తానన్న పెద్దమనిషి విదిలించింది ఎంత అని ఎప్పుడైనా తెలుగుదేశం నేతలు గట్టిగా నోరుచేసుకున్నప్పుడల్లా అది హద్దుదాటకుండా చంద్రబాబు కంట్రోల్‌ చేసుకుంటూ వస్తున్నారు. రాజకీయ అవసరాలే ప్రధానంగా పనిచేస్తాయి.

ఫొటో సోర్స్, facebook

రాజధాని, ప్రత్యేక హోదా రెండింటిలోనూ తీవ్రమైన అసంతృప్తి ఉంది. పోలవరం విషయంలోనూ ఇపుడిపుడే బయటపడుతోంది. అటు పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేక హోదా విషయం, రాజధాని నిర్మాణం విషయం ప్రధాన ఎజెండాగా తీసుకుని జనంలోకి వెడతారని చెపుతున్నారు.

జగన్‌ ఇప్పటికే జనంలో తిరుగుతున్నారు. దూకుడే మంత్రంగా రాజధానిమీద, ప్రత్యేక హోదా మీద ఆయన ప్రధానంగా వాగ్బాణాలు ఎక్కుపెడుతున్నారు. కాకపోతే కీలకమైన అంశాల్లో చంద్రబాబు మీద అసంతృప్తి మొదలైనా దాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే స్థితిలో జగన్‌ లేరని కొందరు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

జగన్‌ వ్యూహాత్మక తప్పిదాలు, బలహీనతలే చంద్రబాబుకు రక్షగా పనిచేస్తున్నాయనేది వారి మాట. రాజధాని విషయంలో వేగంగా నిర్ణయాలు తీసుకోకపోతే ఈ పరిణామాలన్నీ ఏ మలుపు తీసుకుంటాయో చెప్పలేం.

ఇవికూడా చూడండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)