వరకట్న ప్రయోజనాలను బోధిస్తున్న బెంగళూరు కళాశాల!

  • ఇమ్రాన్ ఖురేషి
  • బీబీసీ కోసం, బెంగళూరు
నవ వధువు

ఫొటో సోర్స్, INDRANIL MUKHERJEE/AFP/Getty Images

వరకట్నం ఇవ్వడం వల్ల ప్రయోజనాలున్నాయని బెంగళూరులోని ఓ ప్రముఖ కళాశాల తన విద్యార్థులకు ఇచ్చిన నోట్స్‌లో పేర్కొనడం వివాదాస్పదంగా మారింది. సోషల్ మీడియాలో దీనిపై తీవ్ర ప్రతిస్పందన కనిపిస్తోంది.

అయితే, కళాశాల యాజమాన్యం మాత్రం ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నామని, సిలబస్‌లో లేని దానిని విద్యార్థులకు నోట్స్‌గా ఎలా అందించారో తమకు తెలియదని అంటోంది.

బెంగళూరు శాంతినగర్‌లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో బీఏ ఫైనల్ ఇయర్‌ సోషియాలజీ సబ్జెక్ట్‌లో రిఫరెన్స్ మెటీరియల్ కింద విద్యార్థులకు అందజేసిన నోట్స్‌లో వరకట్నం వల్ల ఉపయోగాలు అనే అంశం ఉంది.

ఫొటో సోర్స్, SAJJAD HUSSAIN/AFP/Getty Images

"సాధారణంగా వరకట్నాన్ని దురాచారంగా భావిస్తారు. అయితే, చాలా మంది వరకట్నం ఇచ్చిపుచ్చుకోవడాన్ని సమర్థిస్తారు. ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలనుకుంటారు. వరకట్నం ఇవ్వడం వల్ల అనేక ఉపయోగాలున్నాయని వారి అభిప్రాయం. అవేమిటంటే...." అని రాశారు.

వరకట్నం వల్ల ఏడు లాభాలున్నాయిని అందులో వివరించారు.

1) అందంగా లేనందువల్ల పెళ్లి కాని అమ్మాయిలకు ఎక్కువ వరకట్నం ఇవ్వడం ద్వారా త్వరగా పెళ్లి అవుతుంది.

2) పెళ్లికి చేసుకోవడానికి మొండికేసే కొంతమంది అబ్బాయిలను ఎక్కువ కట్నం ఆశ చూపి వివాహానికి ఒప్పించవచ్చు.

3) కట్నంతో వచ్చిన డబ్బు, ఇతర వస్తువులతో నవదంపతులు హాయిగా కాపురం చేయొచ్చు. జీవితంలో ఎలాంటి ఇబ్బందులూ పడకుండా కట్నం డబ్బు వాళ్లకు సహాయపడుతుంది. కొత్తగా వ్యాపారం చేసుకోడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.

4) వరకట్నం కింద వచ్చే డబ్బుతో పిల్లలను ఉన్నత చదువులు చదివించవచ్చు.

5) కట్నం తెచ్చే అమ్మాయిలకు అత్తారింటిలో ఎక్కువ గౌరవం దక్కుతుంది. ఎక్కువ వరకట్నం తెచ్చే అమ్మాయిని భర్త చాలా ప్రేమగా చూసుకుంటాడు.

6) వరకట్నం ద్వారా సమాజంలో కుటుంబం హోదా పెరుగుతుందని కొంత మంది భావిస్తారు. ఎక్కువ కట్నం ఇవ్వడం ద్వారా ఒక కుటుంబం తమ కూతురిని 'హై స్టేటస్' గల కుటుంబంలోకి పంపించగలుగుతుంది. ఆ విధంగా కట్నం మన స్టేటస్‌ను పెంచుకోవడానికి దోహదపడుతుంది.

7) వరకట్నం వల్ల కుటుంబంలో శాంతి, సమైక్యత నెలకొంటాయి. వరకట్న ఆచారం అంతం కావొద్దని కొందరు భావిస్తారు. కూతురికి తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వగూడదని కూడా వారి అభిప్రాయం.

ఇలా ఏడు ఉపయోగాలను ఆ పాఠంలో పేర్కొన్న తర్వాత, చివర్లో ఈ ప్రయోజనాలను పేర్కొనడమంటే వరకట్నాన్ని సమర్థిస్తున్నట్టు కాదు అని ప్రస్తావించారు.

ఫొటో సోర్స్, Facebook

రితికా రమేశ్ అనే మహిళ వరకట్న ప్రయోజనాలు అని ఉన్న ఆ పేజీని ఫేస్‌బుక్‌లో పోస్టు చేస్తూ, ''దేశంలోని ఓ ప్రముఖ కళాశాలలో చదువులు ఇలా సాగుతున్నాయి. బెంగళూరు శాంతినగర్‌లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో బీఏ విద్యార్థులకు ఈ నోట్స్ ఇచ్చారు. 60 మంది ఉన్న క్లాసులో ఒక్కరు కూడా టీచర్‌ను ఈ విషయంపై నిలదీయలేదు. మనం ఎక్కడికో వెళ్లిపోయాం.'' అని కామెంట్ చేశారు.

ఫొటో క్యాప్షన్,

ఫేస్‌బుక్ కామెంట్

ఆమె చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి ఈ అంశం వివాదాస్పదమైంది.

దానిష్ అలీ సయ్యద్ అనే నెటిజన్ దీనిపై స్పందిస్తూ, "కొందరి అభిప్రాయం ప్రకారం అని పాఠ్యాంశంలో ముందే చెప్పారు. వరకట్నాన్ని సమర్థించే వాళ్ల మనస్తత్వాన్ని అందులో వివరించారంతే." అని పేర్కొన్నారు.

అయితే దీనికి ప్రతిస్పందనగా కృష్ణకుమార్ అనే నెటిజన్ "ఒక విద్యాసంస్థ ఇలాంటి పాఠానికి మద్దతిస్తే మనం ఎన్నాళ్లు వేచిచూసినా మార్పు రాదు" అని వ్యాఖ్యానించారు.

దీనిపై రితికా రమేశ్ స్పందిస్తూ, "అయితే హంతకులు, రేపిస్టులు, తీవ్రవాదుల అభిప్రాయాలను కూడా పాఠాలలో చేర్చాలి. ఎందుకంటే వారి దృష్టిలో వాళ్లు చేసేది కూడా సరైందే కదా" అని పేర్కొన్నారు.

ఈ వివాదంపై కళాశాల యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. "దీనిపై మేం దర్యాప్తు జరుపుతున్నాం. ఇలాంటి ప్రగతినిరోధక, పితృస్వామిక ఆలోచనలను కళాశాలలు, విద్యాసంస్థలు వ్యతిరేకిస్తాయి'' అని పేర్కొంది.

కళాశాల ప్రొఫెసర్ కిరణ్ జీవన్ దీనిపై బీబీసీతో మాట్లాడుతూ, "మా పాఠ్యాంశంలో అది భాగం కాదు. కాలేజ్ వెబ్‌సైట్‌లో విద్యార్థులకు ఉపయోగపడే 20 పుస్తకాలను రిఫరెన్స్ కింద ఇచ్చాం. అందులో సామాజిక సమస్యలు అనే పుస్తకం ఒకటి. అందులోనే ఈ వివరాలున్నాయి. వేరొక కాలేజీ టీచర్ దీన్ని రాశారు" అని చెప్పారు.

"వరకట్న వేధింపుల వల్ల చనిపోయిన మహిళల గురించి మాత్రమే మా పాఠ్యప్రణాళికలో ఉంది. అది మాత్రమే విద్యార్థులు చదవాల్సి ఉంది. అయితే ఓ విద్యార్థి వాటి పూర్తి వివరాలు కావాలని అడగడంతో ఆ పుస్తకంలోని అన్ని పేజీలు కాపీ చేసి ఇచ్చాం." అని వివరణ ఇచ్చారు.

ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)