అమరావతి: రైతులేమనుకుంటున్నారు?

  • 22 అక్టోబర్ 2017
అమరావతి, రాజధాని, ఆంధ్రప్రదేశ్ Image copyright Naveen

ఏపీ రాజధాని అమరావతి కోసం ఉద్దండరాయుని పాలెంలో రాజధాని శంకుస్థాపన జరిగి రెండేళ్లు గడిచిపోయాయి. ఇప్పటికీ వెలగపూడిలో ఏర్పాటు చేసిన తాత్కాలిక సచివాలయంలోనే రోజువారీ విధులు నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే 32 డిపార్టుమెంట్‌లు, 89 డైరెక్టరేట్లు ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాదు నుండి అమరావతికి తరలి వెళ్లాయి.

రాజధాని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద రైతుల నుండి 33 వేల ఎకరాల భూమిని సేకరించింది.

మంగళగిరి, తుళ్ళూరు, తాడేపల్లి మండలాలలో దాదాపు 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల రాజధానిని నిర్మించబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.

రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చిన రైతులు రాజధాని నిర్మాణంతో తమ భవిష్యత్ తీర్చిదిద్దుకోవచ్చని ఆశిస్తున్నారు.

ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చిన రైతులకు 10 ఏళ్ల వరకు పరిహారం చెల్లిస్తూ, ప్రతి సంవత్సరం 10% పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వం వాగ్దానం చేసింది.

Image copyright AP Govt
చిత్రం శీర్షిక అమరావతి విహంగ వీక్షణం

‘ల్యాండ్ పూలింగ్’ రైతులకు వరమా? శాపమా?

తాత్కాలిక సచివాలయానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుళ్ళూరు గ్రామానికి చెందిన దమ్మినేని శ్రీనివాస్ రాజధాని కోసం తన 34 ఎకరాల భూమిని ఇచ్చారు. భూమికి బదులుగా ఇస్తున్న పరిహారంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

''ఇక్కడ మరిన్ని పెట్టుబడులు వస్తేనే ఉద్యోగ అవకాశాలు, హాస్పిటల్స్, స్కూల్స్ వంటి మౌలిక సదుపాయాలు పెరుగుతాయి. ఇవన్నీ జరగాలంటే 10 సంవత్సరాలు ఓపిక పట్టాలి" అని ఆయన తెలిపారు.

అయితే ల్యాండ్ పూలింగ్ చట్టవిరుద్ధంగా వుందని భావించే రైతులూ వున్నారు.

రాయపూడి గ్రామానికి చెందిన కొందరు రైతులు తమ భూములు ఇవ్వడానికి సుముఖత చూపడం లేదు. అందులో 27 ఎకరాల భూమి యజమాని అయిన రైతు మల్లెల హరేంద్రనాథ్ చౌదరి ఒకరు.

''రాజధాని కోసం భూములను త్యాగం చేయటానికి సిద్ధమే. కాని చట్టబద్ధంగా తీసుకుంటామంటేనే భూములను ఇస్తాం'' అని ఆయన స్పష్టం చేశారు.

Image copyright Naveen

రాజధాని - చీకటివెలుగులు

అయితే ప్రతిపాదిత రాజధాని ప్రాంతంలో రైతుకూలీల పరిస్థితి వేరేలా ఉంది.

వీరంతా ఉదయాన్నే ఒక్కో ఆటోలో దాదాపు 15 మంది ఇరుకిరుకుగా కూర్చుని, జీవనాధారం కోసం చుట్టు ప్రక్కల గ్రామాలకు వెళ్ళి కూలీపనులు వెతుక్కోవలసి వస్తోంది.

''రాజధాని నిర్మాణంలో కానీ, తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనుల్లో కానీ, కనీసం సఫాయి పనుల్లో కూడా మాకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు'' అని తుళ్ళూరు మండలానికి చెందిన ఓ వ్యవసాయ కూలీ వాపోయారు.

ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చిన రైతులంతా బాగుపడ్డారా అంటే అదీ లేదని పలువురు చెబుతున్నారు.

ఒక్కసారిగా పెద్ద ఎత్తున డబ్బులు రావటంతో, అటు గ్రామీణ వాతావరణంలో ఇమడలేక, ఇటు పట్టణ వాతావరణానికి అలవాటు పడలేక కొందరు రైతులు కొత్త అలవాట్లకు బానిసలౌతున్నారని అక్కడి గ్రామపెద్దలు చెబుతున్నారు.

''అభివృద్ధి జరుగుతోంది. పెంకుటిళ్ళు పోయి పెద్ద మేడలు వస్తున్నాయి. కాని రాజధానిలో నివసిస్తున్నామనే సామాజిక స్పృహ వారిలో కొరవడింది'' అని 45 ఏళ్లుగా అమరావతిలో నివసిస్తున్న రిటైర్డ్‌ ప్రొఫెసర్ వావిలాల సుబ్బారావు అన్నారు.

Image copyright AP Govt

స్పష్టత ఏదీ?

ప్రస్తుతం విజయవాడ నుండి తాత్కాలిక సచివాలయం వెలగపూడి, అమరావతిలను కలుపుతూ రోడ్ల నిర్మాణం శరవేగంగా సాగుతోంది.

2 వేల సంవత్సరాల క్రితం నాటి అమరావతి శాతవాహనులకు రాజధాని. పూర్వ వైభవాన్ని తలపిస్తూ అత్యాధునిక మౌలిక సదుపాయాలతో ఒక స్మార్ట్‌ సిటీని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు మార్లు ప్రకటించారు.

అయితే శంకుస్థాపన జరిగి రెండేళ్లయినా, రాజధాని డిజైన్ ఎలా వుండాలి అన్నది తేల్చుకోలేకపోవటం చర్చానీయాంశంగా మారింది.

నిర్మించబోయే రాజధాని అమరావతా? భ్రమరావతా? అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

''కేంద్రం నుండి రాజధాని నిర్మాణానికి అందవలసినంత సహాయం అందుతున్నట్లు కనిపించడం లేదు. రాజకీయ విభేదాలే దీనికి కారణంగా కనిపిస్తున్నాయి" అని రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి అన్నారు.

రాజధాని కనీసమాత్రంగా నైనా ఒక రూపు దిద్దుకోవడానికి 5 సంవత్సరాలు కాదు, ఆ పైన మరో 5 సంవత్సరాలు వేచి చూడాల్సిందే అని ఆయన అభిప్రాయపడ్డారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)