ప్రెస్ రివ్యూ: ‘కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి డిమాండ్లకు చంద్రబాబుకు విసుగొచ్చింది’

  • 23 అక్టోబర్ 2017
కేఈ కృష్ణమూర్తి Image copyright Govt of AP

ప్రతిపక్షంలో ఎవరూ లేకుండా చేయాలన్నదే చంద్రబాబు లక్ష్యమని, అందుకే టీడీపీలోకి ఎవరు వచ్చినా చేర్చుకుంటున్నామని ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే'లో అన్నట్లు ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించింది.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. టీడీపీలోకి రావాలంటే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి చాలా డిమాండ్లు పెట్టారని, దీంతో చంద్రబాబుకు విసుగొచ్చి వదిలేయమన్నారని వెల్లడించారు.

అయితే, సూర్యప్రకాశ్ రెడ్డిని చేర్చుకునే విషయంలో తనకు అభ్యంతరం లేదని, బుట్టా రేణుక విషయంలోనూ ఆక్షేపణ లేదని చంద్రబాబుకు చెప్పానని ఆయన అన్నట్లు ఆంధ్రజ్యోతి వివరించింది.

Image copyright Getty Images

వేళ్లు లేవు.. రేషన్ రాదు

గుంటూరు జిల్లాలో కుష్ఠువ్యాధిగ్రస్తులకు రేషన్ అందడం లేదు. వేళ్లు లేకపోవడంతో వారి బయోమెట్రిక్ వేలిముద్రలు తీసుకోవడం సాధ్యం కాక వారు ఇబ్బందులు పడుతున్నారు.

ఈ విషయం తెలుసుకున్న భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫోన్ చేసి.. రేషన్ పొందలేకపోతున్న వారిని ఆదుకోవాలని కోరినట్లు 'సాక్షి' కథనం తెలిపింది.

Image copyright NOAH SEELAM/Getty Images

పంచాయతీలకు ఎన్నికలు

పంచాయతీ ఎన్నికలను సకాలంలో నిర్వహించి తీరుతామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.

గతంలో ఇచ్చిన హామీ మేరకు గిరిజన తండాలు, గూడేలను గ్రామపంచాయతీలుగా మారుస్తామని వరంగల్‌ రూరల్ జిల్లా శాయంపేట గ్రామంలో కాకతీయ మెగా జౌళి పార్కు రెండోదశకు శంఖుస్థాపన సందర్భంగా జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ అన్నట్లు 'ఆంధ్రజ్యోతి' కథనం పేర్కొంది.

మద్యం సేవిస్తే మెరుగైన మాటలు

మద్యం సేవిస్తే విదేశీ భాషలు మాట్లాడే సామర్థ్యం పెరుగుతుందని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

తగిన మోతాదులో మద్యం సేవిస్తే అది భాషా నైపుణ్యానికి దోహదం చేస్తుందని పలువురు పరిశోధకులు తేల్చారు.

మద్యం తీసుకోని వారికన్నా, తీసుకున్న వారి ఉచ్ఛారణ మెరుగ్గా ఉందని ఈ పరిశోధనలో తేలినట్లు 'నమస్తే తెలంగాణ' కథనం పేర్కొంది.

Image copyright Getty Images

డెన్మార్క్‌ ఓపెన్‌ సిరీస్‌ గెలిచిన శ్రీకాంత్

భారత షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌ డెన్మార్క్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌లో ఛాంపియన్‌గా నిలిచాడు.

పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో శ్రీకాంత్‌ 21-10, 21-5తో దక్షిణ కొరియాకు చెందిన లీ హ్యున్‌ను కేవలం 25 నిమిషాల్లో అలవోకగా ఓడించాడు.

డెన్మార్క్‌ ఓపెన్‌ పురుషుల టైటిల్ భారత క్రీడాకారుడికి లభించడం 37 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారని 'ఈనాడు' కథనం పేర్కొంది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)