Siraj: తండ్రి కల నెరవేర్చాడు.. కానీ చూసి సంతోషించడానికి ఆ తండ్రి ఇప్పుడు లేరు

తండ్రి గౌస్‌తో మహమ్మద్ సిరాజ్

ఫొటో సోర్స్, MOhammmad Siraj family

ఫొటో క్యాప్షన్,

టీమిండియా పేసర్ సిరాజ్ ఆస్ట్రేలియాలో పర్యటనలో ఉండగా 2020 నవంబరులో ఆయన తండ్రి గౌస్ హైదరాబాద్‌లో మరణించారు.

బోర్డర్-గావాస్కర్ ట్రోఫీ‌లో టీమిండియా పేస్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ పేరు మారుమోగుతోంది.

ఆస్ట్రేలియాలో జాత్యహంకార వ్యాఖ్యలకు బాధితుడిగా ఉండడం నుంచి అనుభవజ్ఞులైన బుమ్రా వంటి పేసర్లు గాయపడగా వారి స్థానంలో భారత్ పేస్ దళాన్ని నడిపించడం.. గబ్బా వేదికగా జరిగిన నాలుగో టెస్టులో భారత్‌ను గెలిపించి సిరీస్ అందివ్వడం వరకు సిరాజ్ పేరు వినిపిస్తోంది.

అయితే, హైదరాబాద్‌కు చెందిన సిరాజ్ క్రికెట్ ప్రస్థానం అంతా ఆయన స్వయంకృషితోనే ముడిపడి ఉంది.

2017 చివర్లో భారత్ న్యూజీల్యాండ్‌తో ఆడబోయే టీ-20 టీమ్‌లో చోటు దక్కించుకున్నప్పటి నుంచి స్థిరంగా ఆడుతూ ఇప్పుడు టీమిండియాలో కీలక బౌలర్‌గా అవతరించాడు.

ఫొటో సోర్స్, PATRICK HAMILTON/gettyimages

ఫొటో క్యాప్షన్,

సిరాజ్

తండ్రి మరణించినా

ప్రస్తుత ఆస్ట్రేలియా సిరీస్‌ మొదలైన తరువాత నవంబరులో సిరాజ్ తండ్రి మరణించారు.

కానీ, సిరాజ్ మాత్రం జట్టుతో పాటు ఆస్ట్రేలియాలోనే ఉండిపోయారు.

అంతేకాదు.. జట్టులోని కీలక బౌలర్లు గాయపడితే తన కంటే తక్కువ అనుభవం ఉన్న మిగతా పేస్ బౌలర్లను ముందుకునడిపిస్తూ బౌలింగ్ బాధ్యతలు భుజానికెత్తుకున్నారు.

ఫొటో సోర్స్, PTI

ఆ ఇద్దరిలో ఒకడు.

2017లో న్యూజీలాండ్‌తో టీ20 సిరీస్ కోసం ఇద్దరు కొత్తముఖాలకు చోటు దక్కింది.

వారిలో ఒకరు ముంబై ఓపెనర్ శ్రేయస్ అయ్యర్ కాగా, మరొకరు హైదరాబాద్ లెఫ్టార్మ్ మీడియం పేసర్ మహమ్మద్ సిరాజ్.

చిన్నప్పటి నుంచి సిరాజ్ క్రికెట్ ఆడడానికి తగిన పరిస్థితులు కానీ, సౌకర్యాలు కానీ లేవు.

1994లో జన్మించిన సిరాజ్‌కు క్రికెట్ అంటే చాలా ఆసక్తి అయినా, ఏదైనా అకాడెమీలో చేరి ఆట నేర్చుకునే తాహతు లేదు.

కారణం.. అతని తండ్రి మహమ్మద్ గౌస్ ఓ ఆటో డ్రైవర్.

ఫొటో సోర్స్, PTI

బ్యాటింగ్ నుంచి బౌలింగ్‌కి

తన స్నేహితులకు టెన్నిస్ బాల్‌తో బౌలింగ్ చేస్తూ సిరాజ్ బౌలింగ్ మెళకువలు తెలుసుకున్నాడు. మొదట బ్యాటింగ్‌ అంటే ఇష్టమున్నా, క్రమంగా బౌలింగ్‌పై దృష్టి సారించాడు.

ఒక్కో మెట్టూ ఎక్కుతూ 2015లో హైదరాబాద్ రంజీ టీమ్‌లో చోటు సంపాదించుకున్నాడు.

మొదటి సీజన్‌లోనే అద్భుతమైన బౌలింగ్ గణాంకాలతో అందరి దృష్టినీ ఆకట్టుకున్నాడు.

తొమ్మిది మ్యాచ్‌లలో 18.92 సగటుతో 41 వికెట్లు పడగొట్టాడు. ఆ సీజన్‌లో అత్యుత్తమ బౌలర్లలో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు.

ఫొటో సోర్స్, Albert Perez - CA/gettyimages

ఐపీఎల్‌ రూపంలో తలుపు తట్టిన అదృష్టం

అతని తలరాతను మార్చే అవకాశం తొందరగానే వచ్చింది. అదృష్టం ఐపీఎల్‌ రూపంలో అతని తలుపు తట్టింది.

2017లో సిరాజ్‌ కోసం హైదరాబాద్ సన్‌రైజర్స్ , రాయల్ ఛాలెంజర్స్ మధ్య తీవ్రమైన పోటీ జరిగింది. చివరకు సిరాజ్ బేస్ ప్రైజ్ రూ. 20 లక్షల కన్నా 13 రెట్లు ఎక్కువ ధర.. రూ.2.6 కోట్లు పెట్టి సన్‌రైజర్స్ అతణ్ని సొంతం చేసుకుంది.

ఆ ఐపీఎల్‌లో అతనికి కేవలం ఆరు మ్యాచ్‌లలోనే అవకాశం దక్కినా వాటిలో పది వికెట్లు పడగొట్టాడు. గుజరాత్ లయన్స్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో 4 వికెట్లతో ఆకట్టుకున్నాడు.

వాటన్నిటి ఫలితంగా న్యూజీల్యాండ్‌తో టీ-20 స్క్వాడ్‌కు ఎంపికయ్యాడు.

అక్కడి నుంచి సిరాజ్ వెనుదిరిగి చూడలేదు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)