వివాదాస్పద బిల్లుపై వెనక్కి తగ్గేది లేదంటున్న వసుంధర రాజె ప్రభుత్వం

  • 29 అక్టోబర్ 2017
రాజస్థాన్, వసుంధర రాజె Image copyright Getty Images

వివాదాస్పద బిల్లుపై వసుంధర రాజె ప్రభుత్వం విపక్షం నుంచే కాకుండా స్వపక్షం నుంచి కూడా నిరసనలు ఎదుర్కొంటోంది.

ఈ బిల్లుకు నిరసనగా సోమవారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.

ఈ కొత్త చట్టం ప్రకారం ప్రభుత్వ అధికారులు, జడ్జిలకు వ్యతిరేకంగా అవినీతి ఆరోపణలు వచ్చినపుడు వారిపై ప్రాథమిక దర్యాప్తు చేయాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి.

అంతే కాకుండా.. అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసుల్లో ప్రభుత్వ అనుమతి లేకుండా నిందితుల పేర్లను వెల్లడించే జర్నలిస్టులకు శిక్షలు తప్పవు.

ఈ బిల్లు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌కు అస్త్రంలా ఉపయోగపడుతోంది.

Image copyright webcast.gov.in

ఈ బిల్లుపై బీజేపీ సభ్యుడు ఘనశ్యామ్ తివారీ కూడా నిరసన వ్యక్తం చేశారు. బిల్లుపై మాట్లాడేందుకు తనకు అనుమతి ఇవ్వలేదని ఆయన ఆరోపించారు.

''ఇది ఎమర్జెన్సీ నాటి పరిస్థితిని గుర్తు చేస్తోంది. అధికారంలో ఉన్న కొందరిని రక్షించేందుకు ఈ బిల్లును రూపొందించారు'' అని ఆయన ఆరోపించారు.

అయితే వసుంధర రాజే ప్రభుత్వం మాత్రం ఈ బిల్లు ఉండాల్సిందే అని పట్టుబడుతోంది.

రాజస్థాన్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ పర్నామీ, ఈ బిల్లు భావ ప్రకటనా స్వేచ్ఛకు విరుద్ధం కాదని స్పష్టం చేశారు. దాని వల్ల ప్రజాస్వామ్య హక్కులకు ఎలాంటి ముప్పూ వాటిల్లదని అన్నారు.

అజయ్ జైన్ అనే న్యాయవాది హైకోర్టులో ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమంటూ పిటిషన్ దాఖలు చేశారు.

పౌర హక్కుల ప్రజా వేదిక కూడా దీనిని కోర్టులో సవాలు చేస్తామని ప్రకటించింది.

Image copyright TWITTER @BJP4Rajasthan

బిల్లు అవసరమేంటి?

ఇటీవల షెకావతీ ప్రాంతంలో తలెత్తిన రైతాంగ ఉద్యమం సందర్భంగా ప్రజలు రోడ్డెక్కడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా పరిణమించింది.

అందుకే ఎన్నికలకు ముందు వ్యతిరేకత రాకుండా బీజేపీ జాగ్రత్తలు తీసుకుంటోదని రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ రాజీవ్ గుప్తా అన్నారు.

ప్రభుత్వం పని చేయడం ద్వారా ప్రజల విశ్వసనీయత సంపాదించుకోవచ్చు, లేదా నిరంకుశంగా ఆ అసంతృప్తిని అణచివేయవచ్చు. రాజస్థాన్ ప్రభుత్వం ఆ రెండో దారిని అనుసరిస్తోందని గుప్తా అభిప్రాయపడ్డారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)