ప్రెస్ రివ్యూ: ‘పనులు చేయించుకోలేకుంటే ఎమ్మెల్యేలు అసమర్థులే’

  • 25 అక్టోబర్ 2017
కేసీఆర్ Image copyright NOAH SEELAM/Getty Images

తమ నియోజకవర్గాలకు సంబంధించిన పనులు చేయించుకోలేని ఎమ్మెల్యేలు అసమర్థుల కిందే లెక్క అని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.

కరీంనగర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో జరిగిన సమీక్షలో ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కావాల్సిన పనులు చేయించుకోలేకపోతున్నారనే అపప్రథ తీసుకురావద్దని కేసీఆర్ ఎమ్మెల్యేలను కోరారు.

మళ్లీ గెలవాలంటే నాయకులందరినీ కలుపుకుని పోవాలని సూచించినట్లు ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది.

Image copyright Getty Images

‘జగన్ పాదయాత్రతో టీడీపీకి మేలు’

జగన్ పాదయాత్రతో తమ పార్టీకి మేలే జరుగుతుందని టీడీపీ మంత్రులు ఆదినారాయణరెడ్డి, పితాని, అచ్చెన్నాయుడు అన్నారు.

పాదయాత్రను అడ్డుకోవాలని తాము ప్రయత్నించడం లేదన్నారు. పాదయాత్రకు ముందే ఈడీ జగన్‌ను అరెస్ట్ చేస్తుందేమో అని అనుమానం వ్యక్తం చేశారు.

ప్రజా సమస్యలు పరిష్కరించే అసెంబ్లీని బహిష్కరించి, పాదయాత్ర చేస్తామనడం విడ్డూరంగా ఉందని టీడీపీ నేతలు వ్యాఖ్యానించినట్లు ఈనాడు కథనం పేర్కొంది.

Image copyright TAP Highcourt

హైకోర్టు విభజనకు లైన్ క్లియర్

ఉమ్మడి హైకోర్టు విభజనకు లైన్ క్లియరైంది. హైకోర్టు న్యాయమూర్తులు ఇచ్చిన ఆప్షన్స్‌కు కేంద్రం ఆమోదముద్ర వేసింది. న్యాయమూర్తుల సంఖ్యనూ ఖరారు చేసింది.

ఉమ్మడి హైకోర్టు మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 61 కాగా.. 58:42 ప్రకారం ఏపీకి 37, తెలంగాణకు 24 మంది జడ్జీలను కేటాయించింది.

అయితే ప్రస్తుతం హైకోర్టులో 31 మంది జడ్జీలే ఉన్నారు. వారిలో ఇద్దరు బయటి రాష్ట్రాలవారు.

మిగిలిన 29 మంది జడ్జీలలో 17 మందిని ఏపీకి, 12 మందిని తెలంగాణకు కేటాయించినట్లు సాక్షి కథనంలో పేర్కొన్నారు.

Image copyright Shabbir Ali/Facebook

హవాలా ఉచ్చులో షబ్బీర్!

తెలంగాణ కాంగ్రెస్ శాసనమండలి పక్ష నేత షబ్బీర్ అలీ హవాలా కేసులో ఇరుక్కున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జ్ షీట్‌లో ఆయన పేరున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు మొయిన్ ఖురేషితో షబ్బీర్ అలీకి సంబంధాలున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అయితే తనకు ఇప్పటివరకు ఈడీ నుంచి ఎలాంటి నోటీసులూ అందలేదని షబ్బీర్ అలీ స్పష్టం చేసినట్లు నమస్తే తెలంగాణ కథనం పేర్కొంది.

Image copyright Getty Images

జీఎస్టీ మోత

జీఎస్టీ అమలులోకి వచ్చినా ఇంకా వినియోగదారులపై భారం పడుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో పలు వస్తువులపై పన్నులు తగ్గినా ధరల మోత మోగుతూనే ఉంది.

పన్ను రేట్లను వ్యాపారులు ఇష్టం వచ్చినట్లు అన్వయించుకుంటున్నారు.

బియ్యం, పప్పులపై పన్ను లేకున్నా, టూత్ పేస్టులు, సబ్బులు వంటి వాటిపై పన్ను ధర తగ్గినా వ్యాపారులు మాత్రం జీఎస్టీ పేరు చెప్పి దోచుకుంటున్నారు.

వ్యాపారుల మాయాజాలంతో వినియోగదారులపై 5 నుంచి 10 శాతం భారం పడుతోందని ఈనాడు కథనం పేర్కొంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఫేస్‌బుక్

బీజేపీకి 'సిల్వర్ టచ్'

సోషల్ మీడియాలో బీజేపీకి 'సిల్వర్ టచ్' అనే సంస్థ సహకరిస్తోంది.

బీజేపీపై వస్తున్న విమర్శలను ఎదుర్కొనేందుకు ఈ సంస్థ కట్ అండ్ పేస్ట్ ట్వీట్లతో పాటు, రెడీమేడ్ కామెంట్లను రూపొందిస్తున్న వారికి కూడా భారీ మొత్తంలో పారితోషికాలు ఇస్తున్నట్లు ఆధారాలు వెలుగు చూస్తున్నాయి.

ఈ పారితోషికాలన్నీ ప్రభుత్వ నిధుల నుంచే వెళుతున్నాయి.

బీజేపీ వ్యతిరేక వార్తలు రాకుండా ఈ సంస్థ విమర్శకులపై ఎదురుదాడికి దిగుతున్నట్లు ప్రజాశక్తి కథనం పేర్కొంది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు