అభిప్రాయం: మగాళ్లలో ఎవరు అందంగా ఉంటారు? మలయాళీలా, తమిళులా?

  • 25 అక్టోబర్ 2017
యువకుడు Image copyright iStock

'మగాళ్లు వేటి వల్ల అందంగా కనిపిస్తారు?' చల్లగా ఉన్న ఓ సాయంత్రం నా గర్ల్ ఫ్రెండ్స్ గ్రూపుతో కలిసి కూర్చుని, వేడివేడి టీ సిప్ చేస్తున్నపుడు చర్చకు వచ్చిన విషయమిది.

'అతను మరీ పొడుగ్గా ఉండకూడదు, మరీ బక్కగా ఉండకూడదు.' ఇదీ పొట్టిగా, లావుగా ఉండే నా స్నేహితురాలి అభిప్రాయం.

'కొంచెం లావుగా ఉన్నా ఫర్వాలేదు. దాని వల్ల అతనికి మ్యాచ్ అవ్వాలంటే నేను కడుపు మాడ్చుకోవాల్సిన అవసరం ఉండదు' అంది.

'అబ్బే! లావుగా, పొట్ట ఉన్న మగాళ్లతో నేను వేగలేను. వాళ్లు ఎంత అసహ్యంగా ఉంటారో! అంతే కాదు, మగాళ్ల ఒంటి మీద వెంట్రుకలు కూడా నాకిష్టం ఉండదు' అంది మరో స్నేహితురాలు.

'టైటానిక్ సినిమా గుర్తుందా? దానిలో లియొనార్డో డి కాప్రియో కొన్ని బొమ్మలు గీస్తాడు. అలా అందంగా ఉండే చేతులు కావాలి' అని ముగించింది.

Image copyright AFP

ఏది అందం?

ఒక స్నేహితురాలు తనకు ఉంగరాల జుట్టంటే ఇష్టమంది. గోధుమ రంగులో, ఉంగరాల జుట్టుతో హిప్పీ లుక్ ఉన్నవాడు తనకిష్టమని ప్రకటించింది.

దానికి తోడు, అతను కళ్లద్దాలు ధరిస్తే ఇంకా బాగుంటుంది, మనోహరంగా ఉండే మేధావికి ఎవరూ సాటి రారు. అని ముసిముసి నవ్వులు నవ్వింది.

వాళ్లెవ్వరూ ఆరడుగుల ఎత్తు, తెల్లని/ఛామనఛాయ వర్ణం, నల్లని మెరిసే జత్తు, బలిష్టమైన కండల గురించి మాట్లాడకపోవడం నాకు వింతగా అనిపించింది.

హృతిక్ రోషన్, షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్.. వీళ్లంతా నా బుర్రలో కదలాడారు. నా స్నేహితురాళ్లు ఎవ్వరూ వాళ్ల గురించి కలలు కనడం లేదు.

నిజానికి వాళ్ల ఆలోచనల్లో ఎవరో ఒక్క హీరో మాత్రమే లేడు. వాళ్ల హీరోలు చాలా వైవిధ్యంగా, సంప్రదాయ హీరోలకు చాలా భిన్నంగా ఉన్నారు.

Image copyright Twitter/Induja Raghunathan

అందరినీ ఒకే గాటన కట్టేస్తారా?

ఒక పాపులర్ టీవీ డిబేట్‌‌లో 'ఎవరు అందంగా ఉంటారు? కేరళ మహిళలా, తమిళ మహిళలా?' అన్నది కనిపించినపుడు నా స్నేహితులంతా దాని చుట్టూ చేరి, తమ సొంత చర్చను ప్రారంభించడం పెద్ద ఆశ్చర్యమేమీ కాదు.

టీవీ షోలో చేస్తున్నదే మీరు కూడా చేస్తున్నారని నేను వాళ్లను వ్యతిరేకించాను. రెండు ప్రాంతాలకు చెందిన మహిళల శారీరక లక్షణాలను పోల్చడం సరైనదేనా?

మహిళలను కేవలం రూపురేఖలకు కుదించడం, ఒకే ప్రాంతానికి చెందిన మహిళలందరినీ ఒకే గాటన కట్టేయడం!

ఒక రాష్ట్రంలోని మహిళలంతా ఒకే విధంగా ఉండరు! మా పక్కింటావిడే వేర్వేరు దుస్తుల్లో నాకు వేర్వేరుగా కనిపిస్తుంది.

ఈ టీవీ ఛానెల్ ఒక అడుగు ముందుకు వేసి, చర్చను సోషల్ మీడియా పోల్ వరకు తీసుకెళ్లింది.

కేరళ మహిళలు అందంగా ఉంటారా లేక తమిళ మహిళలా? ఎవరు అందంగా ఉంటారో చెప్పండంటూ ఓటింగ్ పెట్టింది.

ఈ చర్చ మహిళలను ఒక వస్తువుగా చూపిస్తోందంటూ దానిపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి.

చివరకు ఆ టీవీ ఛానెల్ ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది.

Image copyright Youtube

‘హాని లేని సరదా’

నా గర్ల్ ఫ్రెండ్స్ చాయ్ పార్టీ చేసుకోవడానికి ఒక కారణం ఇదే.

ఒక పాపులర్ టీవీ షో చర్చ 'మహిళల్లో దేనిని అందంగా భావిస్తారు?' లాంటి స్టీరియోటైప్ భావజాలంతో ముగియడం లేదని వారి ఆనందం.

మరి 'మగాళ్లు వేటి వల్ల అందంగా కనిపిస్తారు?' అన్న చర్చను ప్రస్తావిస్తూ, మీరెందుకు మగాళ్లను వస్తువులుగా చూస్తున్నారని నేను ప్రశ్నించాను.

మగాళ్లలో ఉండే ఇతర లక్షణాలు - వాళ్ల సెన్సాఫ్ హ్యూమర్, విద్య, రాజకీయ విశ్వాసాలు, ప్రాపంచిక దృక్పథం మొదలైన వాటి గురించి ఎందుకు చర్చించరు?

ఇతర వ్యక్తుల అందాన్ని గురించి మాట్లాడేటప్పుడు వాటిని ప్రస్తావించాల్సిన అవసరం లేదా?

'నీకసలు సెన్సాఫ్ హ్యూమరే లేదు' అని వాళ్లంతా ఏకగ్రీవంగా తీర్మానించేశారు.

'ఈ సరదా వల్ల ఎవరికీ హాని లేదు.' 'నీ వైపు చూసుకుని నవ్వడం నేర్చుకో.' 'జస్ట్ చిల్.' ఇవీ వాళ్లు నాకు చెప్పింది.

Image copyright Twitter

మళ్లీ మళ్లీ చూడాలనిపించే, అందంగా ఉండే పురుషులంటే నాకూ ఇష్టమే. ఇతరుల్లాగే నాకు కూడా చూపులను బట్టి వారిపై ఒక 'ఫస్ట్ ఇంప్రెషన్' పడిపోతుందనే మాట నిజమే.

కానీ మనం హాస్యానికైనా సరే, పురుషులను, మహిళలను 'అందమైన' శరీరం అనే కొలమానంతో చూస్తున్నామంటే ఆ భావజాలాన్నే 'ఆదర్శంగా చూస్తున్నామన్న మాట.

Image copyright iStock

బహుశా అందుకే డజన్ల కొద్దీ ఆడపిల్లలు ఆ టీవీ షోలో పాల్గొన్నారు కావొచ్చు. ఇదంతా ఎలాంటి హాని లేని వినోదంగా వారికి తోచి ఉండొచ్చు.

కానీ ఈ హాని లేని వినోదమే క్రాష్ డైట్, డిప్రెషన్, ఆత్మ నూన్యత, విశ్వాసం కోల్పోవడం, సన్నగా కనిపించడం కోసం చేయించుకునే ప్రమాదకరమైన లైపోసక్షన్‌ లాంటి వాటికి దారి తీయదా?

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు