నకిలీ స్టాంపు పేపర్ల కుంభకోణంలో సూత్రధారి అబ్దుల్ కరీం తెల్గీ మృతి

  • 26 అక్టోబర్ 2017
అబ్దుల్ కరీం తెల్గీ Image copyright INDRANIL MUKHERJEE/AFP/Getty Images

కోట్లాది రూపాయల స్టాంపు పేపర్ల కుంభకోణం కేసులో శిక్ష అనుభవిస్తున్న అబ్దుల్ కరీం తెల్గీ బెంగళూరులో మృతి చెందారు. మెనింజైటిస్‌తో బాధపడుతున్న తెల్గీ కొంత కాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన మృతి చెందారని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

పదుల వేల కోట్ల రూపాయల స్టాంపు పేపర్ల కుంభకోణం 1990వ దశకం ఆరంభంలో మొదలైంది.

మొదట తెల్గీకి స్టాంపు పేపర్లు అమ్మే లైసెన్స్ ఉండేది. ఆ క్రమంలో అతను నకిలీ స్టాంపు పేపర్లను అచ్చువేయడం మొదలుపెట్టారు.

నకిలీ స్టాంపు పేపర్లు అమ్మడం కోసం తెల్గీ వందలాది మందిని ఏజెంట్లుగా నియమించుకున్నారనీ, ఆయన నెలసరి ఆదాయం కొన్ని కోట్లల్లో ఉండేదనీ చెబుతారు.

తెల్గీపై ఆరోపణలు 1995లో దాఖలు చేసినప్పటికీ 2001లో ఆయనను అరెస్టు చేశారు. గత 16 ఏళ్లుగా ఆయన జైలులో ఉన్నారు.

అబ్దుల్ కరీం తెల్గీ అరెస్టు తర్వాత పలువురు రాజకీయ నాయకులనూ, పోలీసు ఉన్నతాధికారులనూ కూడా అదుపులోకి తీసుకున్నారు.

తెల్గీ కుంభకోణంతో అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కృష్ణయాదవ్‌తో సంబంధాలున్నాయనే అరోపణలు వచ్చాయి. ఈ కారణంగానే ఆయనను నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనను మంత్రివర్గం నుంచి తప్పించారు.

కృష్ణ యాదవ్‌ను ఈ కేసులో మహారాష్ట్ర పోలీసులు 2003లో అరెస్ట్ చేశారు. 2006లో ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.

తెల్గీకి 2006లో కోర్టు 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దాంతో పాటు రూ. 202 కోట్ల జరిమానా కూడా విధించింది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)