ప్రెస్ రివ్యూ: ‘అసెంబ్లీ బహిష్కరణలో ఎన్టీఆరే నాకు ఆదర్శం’

  • 27 అక్టోబర్ 2017
వైఎస్ జగన్మోహన్ రెడ్డి Image copyright YS Jaganmohan Reddy/Facebook

''సభను బహిష్కరించడంలో దివంగత ఎన్టీ రామారావే ఆదర్శం. అప్పట్లోనూ ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు అప్రజాస్వామిక విధానాలకు పాల్పడడం వల్లే ఎన్టీ రామారావు అసెంబ్లీని బహిష్కరించారు. ఇప్పుడు కూడా చంద్రబాబే సభా మర్యాదలను మంటగలిపేలా వ్యవహరిస్తున్నారు'' అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

నవంబర్‌లో జరగనున్న అసెంబ్లీ సమావేశాలనే కాదు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేంత వరకు అన్ని సెషన్లనూ బహిష్కరిస్తున్నట్లు వైకాపా శాసనసభాపక్ష ఉపనేత రామచంద్రారెడ్డి విలేకరులతో చెప్పారని ఈనాడు కథనం ప్రచురించింది.

వైసీపీ వైఖరి చూస్తోంటే.. ప్రభుత్వం తలొగ్గకపోతే మళ్లీ ఎన్నికల వరకు ఏ శాసనసభ సమావేశాలకు హాజరు కాకపోవచ్చునని పేర్కొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ విపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అధికారపక్షం అవమానించిందన్న కారణంతో శాసనసభ సమావేశాలను బహిష్కరించారని, ఆయన తప్ప మిగతా టీడీపీ ఎమ్మెల్యేలంతా సభకు హాజరయ్యేవారని వివరించింది.

Image copyright revanthreddy/facebook

టీడీపీలో కేసీఆర్ జీతగాళ్లున్నారు: రేవంత్‌రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు జీతగాళ్లు తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఉన్నారని, అందుకే కేసీఆర్‌ను వారు ఏమీ అనడం లేదని టీడీపీ తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

తాను తెలంగాణ టీడీపీ శాసనసభాపక్ష నేతగా ఉంటే సీఎం కేసీఆర్‌ను సభలో నిలదీస్తానని, అందుకే తనను టీడీఎల్పీ పదవి నుంచి తొలగించారని కూడా ఆయన ఆరోపించినట్లు ఆంధ్రజ్యోతి ఒక కథనంలో పేర్కొంది.

తనపై విశ్వాసంతో చంద్రబాబు పదవులు ఇస్తే, ఆయన లేనప్పుడు నిర్ణయాలు చేయడం దుర్మార్గం కాదా? అని టీడీపీ-టీఎస్‌ అధ్యక్షుడు రమణను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

Image copyright Getty Images

హడావుడిగా చట్టాలు చేస్తే ఇలాగే ఉంటుంది: సుప్రీంకోర్టు

హడావుడిగా చట్టాలు రూపొందిస్తే వివాదాలు, వ్యాజ్యాలు, చిక్కులు మాత్రమే కాకుండా దానికి పర్యవసానంగా వికృత పరిస్థితులు కూడా తలెత్తుతాయని ఏపీ పునర్‌ వ్యవస్థీకరణ చట్టాన్ని ఉద్దేశించి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్లు సాక్షి కథనం ప్రచురించింది.

తెలంగాణ, ఏపీల న్యాయాధికారుల విభజన జరపనిదే నియామకాలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టరాదని తెలంగాణ న్యాయమూర్తుల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘ఒక చట్టం ద్వారా ప్రభావితమయ్యే అన్ని తరగతులకు న్యాయపరమైన పరిష్కారం ఆ చట్టంలో ఉండాలి' అని ఆయన అన్నారు.

Image copyright Getty Images

జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బందులు వాస్తవమే: ఈటల

జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు అనేక ఇబ్బందులు తలెత్తిన మాట వాస్తవమేనని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అంగీకరించారని నవతెలంగాణ దినపత్రిక కథనం ప్రచురించింది.

అటు దేశంలోను, ఇటు రాష్రంలోనూ నిరుద్యోగం నానాటికీ పెరిగిపోతున్నదని, ఇది తిరోగమనాన్ని సూచిస్తున్నదని ఆయన వ్యాఖ్యానించినట్లు పేర్కొంది.

నిరుద్యోగ యువతకు ఉదారంగా రుణాలివ్వటం ద్వారా వారి ఆర్థిక పరిపుష్టికి చేయూతనివ్వాలని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశంలో ఆర్థికమంత్రి కోరినట్లు తెలిపింది.

ఎర్ర చందనం వేలానికి చైనాలో ఏపీ అధికారుల రోడ్‌ షో

ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఆదాయార్జన కోసం ఎర్ర చందనం విక్రయాలను పెంచే దిశగా కసరత్తు చేస్తోందని.. ఇందులో భాగంగా నవంబర్‌ 6 నుంచి 12 వరకు చైనాలో రోడ్‌ షోలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారని ప్రజాశక్తి దినపత్రిక కథనం ప్రచురించింది.

అటవీశాఖ మంత్రి సిద్ధారాఘవరావుతోపాటు ఆ శాఖ ముఖ్యకార్యదర్శి జి. అనంతరాము, పిసిసిఎఫ్‌ ఎస్‌.కె. కౌషిక్‌ చైనాలో పర్యటించేందుకు అనుమతులిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసినలు తెలిపింది.

వారు రోడ్‌ షో నిర్వహించడంతోపాటు ప్రీ బిడ్‌ కాన్ఫరెన్స్‌, అక్కడ ఎర్ర చందనం మార్కెట్‌ అవసరాలను అధ్యయనం చేస్తారని పేర్కొంది.

Image copyright Getty Images

నిలోఫర్‌లో తల్లిపాల నిధి

హైదరాబాద్‌లోని నిలోఫర్ దవాఖానలో హ్యూమన్ మిల్క్ బ్యాంక్ (తల్లిపాల నిధి) ఏర్పాటు చేసినట్లు నమస్తే తెలంగాణ దినపత్రిక కథనం ప్రచురించింది.

తల్లిపాలను శుద్ధిచేసి, నిల్వచేసే యంత్రాలను ఓ స్వచ్ఛంద సంస్థ నిలోఫర్‌కు రెండు నెలల కిందటే అందజేసిందని.. ఈ బ్యాంకు ద్వారా ప్రతిరోజు 500 మంది శిశువులకు తల్లిపాలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని నిలోఫర్ వైద్యాధికారులు తెలిపినట్లు వెల్లడించింది.

నిలోఫర్‌లో రోజూ దాదాపు 300-450 మంది శిశువులకు తల్లిపాల అవసరం ఏర్పడుతున్నదని.. తల్లిపాల నిధితో ఇకపై ఆ సమస్య తీరనున్నదని ఆ కథనం పేర్కొంది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు