కశ్మీర్: భారతదేశంలో ఇలా కలిసింది

ఫొటో సోర్స్, Keystone-France
డోగ్రా కుటుంబం శతాబ్దం పాటు జమ్మూ కశ్మీర్‌ను పాలించింది.
1947లో భారత్, పాకిస్తాన్ విభజన జరిగిన తర్వాత కశ్మీర్ సంస్థానం ఎటు వెళ్ళాలో తేల్చుకోలేని పరిస్థితిలో మిగిలింది. కశ్మీర్ తన స్వతంత్ర ప్రతిపత్తిని నిలబెట్టుకోవాలని బలంగా కోరుకున్నప్పటికీ.. అప్పటి రాజకీయ పరిణామాలు ఎటో ఒకవైపు విలీనం కావాల్సిన పరిస్థితిని కల్పించాయి.
కశ్మీర్ చరిత్రలో ఈ కీలక పరిణామానికి సంబంధించి ఆనాటి జ్ఞాపకాలను తెలుసుకునేందుకు, ఈ అంశం మీద జరుగుతున్న వాదోపవాదాలను వినేందుకు బీబీసి ప్రతినిధి ఆమీర్ పీర్జాదా కశ్మీర్ లోయలో పర్యటించారు.
1947 అక్టోబర్ నాటికి మొహమ్మద్ సుల్తాన్ థాకర్కు 15 ఏళ్లు. అప్పుడాయన ఉడి హైడ్రోఎలక్ట్రిక్ విద్యుత్ సంస్థలో పని చేస్తున్నారు.
అప్పట్లో శ్రీనగర్ అంతటికీ విద్యుత్ సరఫరా చేసే ఒకే ఒక్క సంస్థ ఇది.
ఫొటో సోర్స్, Faisal H. Bhat
మొహ్రా విద్యుత్ ప్లాంటులో పనిచేసిన 85 ఏళ్ల మొహమ్మద్ సుల్తాన్ థాకర్
పాకిస్తాన్ వైపు నుంచి జరిగిన పష్తూన్ దాడులు ఆయనకి బాగా జ్ఞాపకం. వాళ్ళని ఆయన 'కబాలీ'లని వర్ణించారు.
''కశ్మీర్ మహారాజు సైన్యం ఉడి నుంచి మొహుర చేరుకుంది'' అని తాను పని చేసిన పాత పవర్ ప్లాంట్‌లో కూర్చుని మాట్లాడుతూ చెప్పారాయన.
''వారు ఇక్కడ గిరిజనులతో యుద్ధం చేశారు, బంకర్లు నిర్మించారు. కబాలీలు అడవికి వచ్చేవారు. గిరిజనులు కాల్పులు మొదలుపెట్టగానే రాజుగారి సైన్యం పారిపోయింది.''
''కబాలీలు దొపిడీదారులు'' అని థాకర్ పేర్కొన్నారు.
''మేము అడవిలోకి పారిపోయి దాదాపు వారం రోజులు తల దాచుకున్నాం. మాకు చాలా భయం వేసేది. ఎవరైనా మమ్మల్ని చంపేయవచ్చు. మేము దాక్కుని ఉండేవాళ్లం'' అని ఆయన చెప్పారు.
ఫొటో సోర్స్, Ahmer Khan
భారత్ నుంచి దూరమైనట్లు చాలామంది కశ్మీరీ యువత భావిస్తున్నారు
విదేశీ శక్తి
ఇక్కడే పరిస్థితులు మరింతగా విషమించాయి. పాకిస్తానీ గిరిజనులు ఆక్రమణదారులా లేక తమ ముస్లిం సోదరులను రక్షించడానికి వచ్చారా?
హిందూ మహారాజు పరిపాలనలోని జమ్మూకశ్మీర్ జనాభాలో మెజారిటీ ముస్లింలు.
మరిన్ని హక్కుల కోసం ముస్లింల ఆందోళన 1930 నుంచీ పెరుగుతోంది.
1947 ఆగస్టులో విభజన కారణంగా సాగిన హింస నుండి కశ్మీర్ కూడా తప్పించుకోలేకపోయింది.
కశ్మీర్‌కి వలస వెళ్ళిన పంజాబీ హిందువులు తాము ఎదుర్కొన్న భయంకరమైన రక్తపాతం, అత్యాచారాల గురించి వివరించారు.
జమ్మూలోని హిందువులు తమ పొరుగువారైన ముస్లింలపై దాడులకు దిగారు.
''పాకిస్తాన్ నుంచి వచ్చిన పష్తూన్ గిరిజనుల్లో కొందరు దుష్టశక్తులున్నప్పటికీ.. మొత్తంగా చూసినపుడు నిజానికి వారు సహాయం చేయడానికి వచ్చారు'' అని కశ్మీర్ ప్రభుత్వంలో ఉన్నతస్థాయి అధికారిగా పనిచేసిన చరిత్రకారుడు డాక్టర్ అబ్దుల్ అహద్ పేర్కొన్నారు.
''ఆగస్టు 15 తర్వాత ముస్లింల మీద హింస పెరిగిపోయింది'' అని ఆయన అంటారు.
''పూంచ్, ముజఫరాబాద్ ప్రజలు ప్రకటించిన స్వతంత్ర ప్రభుత్వానికి సాయం చేయడానికి, సుస్థిరపరచడానికి పాకిస్తాన్ నుంచి ముజహిదీన్లు, గిరిజనులు, ఫరీదీలు, పఠాన్లు, పెషావరీలు వచ్చారు'' అని చెప్పారు.
జమ్మూలో అస్థిరతకు సమాధానంగానే పాకిస్తాన్ గిరిజన దాడులు జరిగాయని ప్రొఫెసర్ సాదిక్ వాహిద్ అంటారు.
''పాకిస్తాన్ కంగారుపడి పఠాన్ల వేషంలో సైన్యాన్ని పంపింది అనేందుకు కొన్ని ఆధారాలు ఉన్నప్పటికీ.. దానికి దారితీసిన పరిస్థితులయితే అస్పష్టంగా ఉన్నాయి" అని ఆయన అంటారు.
పరిస్థితులు అస్పష్టంగానే ఉండి ఉండొచ్చు. కానీ కొందరు పాకిస్తానీ గిరిజనుల చర్యలు అపఖ్యాతి పాలయ్యాయి.
ఒక క్రైస్తవ సన్యాసిని హత్య
1947 అక్టోబర్ 27న వారు బారాముల్లాలో సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ హాస్పిటల్ మీద దాడి చేశారు.
ఉత్తర కశ్మీర్లో ఉన్న ఒకే ఒక్క క్రైస్తవ సంస్థ ఇది.
ఆ దాడి నుంచి తప్పించుకున్న సిస్టర్ ఎమీలియా గురించి సిస్టర్ సెలెస్తీనాకు తెలుసు. ఎమీలియా ఇపుడు లేనప్పటికి ఆవిడ జ్ఞాపకాలని సెలెస్తీనా గుర్తు చేసుకున్నారు. 1987లో సిస్టర్ సెలెస్తీనా సెయింట్ జోసెఫ్ కాన్వెంట్లో చేరేటప్పటికి ఎమీలియా సజీవంగా ఉన్నారు.
''కబాలీల దాడిలో ఎంతో మంది ఊచకోతకు గురయ్యారు'' అని ఆమె చెప్తారు.
''సిస్టర్ తెరెసాలినా, బారెటొ, కల్నల్ డైక్స్, ఆయన భార్య, నర్స్ ఫిలోమినాలను కాల్చి చంపారు'' అని వివరించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మోతీయా దేవి కపూర్ అనే రోగిని కూడా చంపేశారు.
ఈ గిరిజనులకు పాకిస్తాన్ సైన్యం లోపాయకారీ మద్దతు ఉందని అందరూ భావిస్తారు.
బారాముల్లా తర్వాత వారి మజిలీ శ్రీనగర్ వైమానిక స్థావరం.
ఫొటో సోర్స్, Faisal H. Bhat
భారత స్మారకాల్లో ‘అమరుడైన’ షేర్వాణీది కూడా ఒకటి. ఇది బారాముల్లాలో ఉంది
భారత వీరుడు
కాని ఒక యువకుడు పాకిస్తానీ సేనల ప్రయత్నాలను అడ్డుకోవడంలో కీలకపాత్ర పోషించారు.
మొహమ్మద్ మఖ్బూల్ షేర్వాణీకి అప్పుడు కేవలం 19 సంవత్సరాలు
అతను తన ద్విచక్ర వాహనం మీద బారాముల్లా అంతా తిరిగి, భారతీయ సైన్యం శ్రీనగర్ చేరుకుందని ప్రచారం చేసాడు
ఈ ప్రయత్నం సఫలం అయింది. భారతీయ సైన్యం 1947 అక్టోబర్ 27న శ్రీ నగర్లో అడుగు పెట్టి పాకిస్తానీ గిరిజన సైన్యాలను తిప్పికొట్టడం ఆరంభించింది.
కానీ షేర్వాణీ పోషించిన పాత్రను తెలుసుకుని గిరిజన సైన్యం అతన్ని హతమార్చింది.
భారత ప్రభుత్వం అతన్ని అమర వీరుడిగా గుర్తించి గౌరవించింది. అది కశ్మీర్ ప్రజలు అతనిని ద్వేషించడానికి దారితీసింది.
షేర్వాణీ కుటుంబం ఇంటర్వ్యూకి అంగీకరించలేదు.
కశ్మీర్ లోని సంక్లిష్ట స్థితికి ఇది అద్దం పడుతుంది.
70 యేళ్ల క్రితం కశ్మీర్లో భారీ ఆందోళనలు జరిగాయని, జనం రోడ్ల మీదకు వచ్చారని ఇపుడు చాలా మంది మరిచిపోతుంటారు లేదా పట్టించుకోరు అని కశ్మీర్ వ్యవహారాల నిపుణుడు డాక్టర్ ఆండ్రూ వితేహీద్ అంటారు
''కశ్మీర్ జాతీయ నాయకుడు షేక్ అబ్దుల్లాకి అనుకూలంగా.. మహారాజుకు, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలసంఖ్యలో ప్రజలు రోడ్లమీదకు వచ్చారు''.
భీం సింగ్ జమ్మూ కాశ్మీర్‌ని ఒకప్పుడు పాలించిన డోగ్రా వంశీకుడు.
''ముప్పు ముంగిట ఉన్నపుడు తప్పనిసరై కశ్మీర్ విలీనానికి రాజు ఒప్పుకున్నాడు'' అని అయన అంటారు
మహారాజు జమ్మూ కశ్మీర్‌ను స్వతంత్ర రాజ్యంగా ఉంచాలని చూశారా అన్న ప్రశ్నకు ఆయన నేరుగా సమాధానమివ్వకుండా మహారాజు పరిజ్ఞానం గురించి వివరించారు.
''ఆయన ప్రజాస్వామ్యాన్ని బాగా అర్ధం చేసుకున్నారు. ఆయనకు జమ్మూకశ్మీర్ మిశ్రమ సంస్కృతి గురించి బాగా తెలుసు'' అని మెరిసే కళ్లతో చెప్పారు.
కానీ విలీనమైతే ఏం జరుగుతుందో ఏమిటో ప్రజలకు తెలీకుండా జరిగిపోయిన హడావుడి నిర్ణయమని చాలామంది కశ్మీరీలు భావిస్తారు.
డాక్టర్ అబ్దుల్ అహద్ అయితే మరింత ఘాటుగా చెపుతారు.
''బలవంతంగా విలీనం చేసుకున్నారు. ఇది చెల్లదు''
''ప్రజలకు అసలు ఈ విలీనం ఇష్టం లేదు. ఈ విషయంలో చాలా తక్కువ శాతం మంది ప్రజలు షేక్ అబ్దుల్లాకి మద్దతు ఇచ్చారు''
ప్రొఫెసర్ సిద్దిఖ్ వాహిద్ దీన్నే మరికాస్త సునిశితంగా వివరిస్తారు.
''షేక్ అబ్దుల్లాకు, కశ్మీర్ ప్రజలకు భారత ప్రభుత్వం ఇచ్చిన హామీల వల్ల కొంత మంది మద్దతిచ్చారు''
''అదే సమయంలో కొంత మంది అసంతృప్తితో కూడా ఉన్నారు. కాని బయటపడలేకపోయారు.''
ఫొటో సోర్స్, Faisal H. Bhat
జీలం నది పక్కన వ్యూహాత్మక ప్రాంతంలో మొహురా విద్యుత్ ప్లాంటు ఉంది
వివాదాస్పద చరిత్ర
కశ్మీర్ భారత్‌తో విలీనం అయిన తేదీ, ఎవరు ఈ విలీన ఒప్పందంపై సంతకం చేశారు అనే విషయాలు నేటికీ వివాదాస్పద అంశాలే.
మహారాజా హరి సింగ్ శ్రీనగర్ నుంచి పారిపోయాక జమ్మూలో అక్టోబర్ 26న ఈ ఒప్పందంపై సంతకం చేశారని భారత్ చెబుతుంది.
కానీ, అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రు ప్రతినిధి వి కె మీనన్ జమ్మూ చేరింది 1947 అక్టోబర్ 27న.
ఈ 'తాత్కాలిక' విలీన ఒప్పందంపై అనేక వివాదాలు ఉన్నాయి
సంతకం చేసిన ఒప్పందంలో కొన్ని నిబంధనలు ఉన్నాయని, మహారాజా హరి సింగ్ రాజ్య ప్రజలను సంప్రదించాల్సిన అవసరం వాటిలో ఒక నిబంధన అని ప్రొఫెసర్ సిద్దిఖ్ వహీద్ అంటారు
కానీ, పార్లమెంట్ ద్వారా మహారాజు ప్రజల అంగీకారం పొందారని భీం సింగ్ అంటారు
''కానీ మూడు ప్రధాన రంగాలపై పాక్షికంగా అధికారాన్ని అప్పగించడం ఇందులో ఒకటి'' అని ప్రొఫెసర్ వహీద్ చెప్పారు. ''ఆ మూడు - రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్.''
జమ్మూ కశ్మీర్ వదిలి వెళ్లిన మహారాజు తిరిగి రాలేదు. షేక్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ తొలి ప్రధాన మంత్రిగా భాద్యతలు చేపట్టారు
కానీ, ఇది ఎంతో కాలం నిలవలేదు. ఒకనాటి మిత్రుడు షేక్ అబ్దుల్లాను దేశద్రోహ నేరం కింద 1953లో జైలులో పెట్టారు.
"కశ్మీర్ సింహం" స్వతంత్రం కోసం కుట్ర చేస్తోందని భారత్ పేర్కొంది.
ఫొటో సోర్స్, Keystone Features
షేక్ అబ్దుల్లా జమ్మూ కశ్మీర్‌కు తొలి ముస్లిం ప్రధానమంత్రి
1947లో భారత్‌లో విలీనం కావడం ఒక్కటే ఏకైక మార్గంగా ఉండింది అని శ్రీనగర్ విశ్వవిద్యాలయ విద్యార్థులు సైతం భావిస్తున్నారు.
కానీ విలీన ఒప్పందపు నిబంధనలను భారత్ అమలు చేయనే లేదని వారు చెబుతున్నారు.
కశ్మీర్ భవితను కశ్మీరీ ప్రజలే నిర్ణయించుకుంటారని అందుకోసం ప్లెబిసైట్ నిర్వహిస్తామని అప్పటి భారత ప్రధాని నెహ్రూ హామీ ఇచ్చారు. అది ఇప్పటికీ కలగానే ఉండిపోయింది.
''భారత్ వాగ్దానాలు నిలబెట్టుకోలేకపోయిందని కశ్మీరీ ప్రజల పట్ల అన్యాయంగా వ్యవహరించిందని, ఇపుడు పాకిస్తాన్‌తో కలవడం మినహా తమకు మరో మార్గం లేదు'' అని లా విద్యార్థి వసీమ్ ముస్తాఖ్ చెపుతున్నారు.
''మేము ఎపుడూ భారత్‌లో భాగం కాదు, ఇపుడూ కాదు, ఎప్పటికి కాబోము'' అని పి.హెచ్. డి విద్యార్ధి తోయిబా అంటారు.
''భారత్ సేనలు తనని ఒక ఉగ్రవాదిలా చూస్తున్నప్పటికీ, ఇంకా భారత్‌కి ప్రజల మనసులు గెలిచేందుకు అవకాశాలు ఉన్నాయి'' అని బిజినెస్ విద్యార్థి ఫైజాన్ ఇస్లాం అంటారు.
భారత్.. కశ్మీర్ ప్రజల దగ్గరకు వెళ్లి, నమ్మకం కలిగించే ప్రయత్నం చేయాలని అన్నారు.
''భారత్ కి పరిస్థితులను చక్కదిద్దే సంకల్పం ఉంటే, చరిత్రలో ఎవరు ఏమి చేశారు అనేది పెద్ద విషయం కాదు. సంకల్పశుద్ధి ఉంటే భారత్ సులభంగా దీన్ని పరిష్కరించగలదు'' అని అతను అభిప్రాయపడ్డారు.
మా ఇతర కథనాలు:
- ఆర్టికల్ 370 రద్దు: ‘ఇక భారతీయులంతా కశ్మీర్లో భూమి కొనుక్కోవచ్చు’
- ఆర్టికల్ 370 అంటే ఏంటి? కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చిన ఈ ఆర్టికల్ రద్దు సాధ్యమేనా?
- ఆర్టికల్ 35-A అంటే ఏంటి? కశ్మీర్ అమ్మాయిలు ఇతర రాష్ట్రాల వారిని పెళ్లాడితే హక్కులు కోల్పోతారు, ఎందుకిలా?
- హైదరాబాద్ పేరెత్తకుంటే.. కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు వదిలేస్తామని పటేల్ చెప్పింది నిజమేనా?
- పాకిస్తాన్లో మార్పు వస్తుందా?
- ‘ప్రాణాలతో బయటపడతానని అనుకోలేదు’
- సరిహద్దుకు ఇరువైపులు.. భర్తల కోసం ఎదురుచూపులు
- ‘మగాళ్లు చేస్తే ఒప్పు ఆడవాళ్లు చేస్తే తప్పా?’
- 1971 యుద్ధంలో పాకిస్తాన్ నుంచి భారత్ స్వాధీనం చేసుకున్న అందమైన ఊరు కథ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)