అభిప్రాయం: రోడ్ల ప్రాజెక్టుతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయా?

  • వివేక్ కౌల్
  • విశ్లేషకులు
ఫొటో క్యాప్షన్,

ప్రపంచంలో అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్ కలిగిన దేశాల్లో భారత్ ఒకటి

ఆర్థిక వ్యవస్థ కాస్త మందగించినప్పుడు, రాజకీయ నాయకులకు, ప్రభుత్వాధినేతలకు ముందుగా గుర్తొచ్చేది ప్రముఖ బ్రిటిష్ ఆర్థికవేత్త జాన్ మేనార్డ్ కీన్స్.

అభివృద్ధిని పునరుద్ధరించేందుకు అధికమొత్తంలో అప్పు తెచ్చి, పబ్లిక్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలని కీన్స్ చెబుతారు.

ప్రస్తుతం భారత ఆర్థికాభివృద్ధి మందగించింది. వరుసగా ఆరు త్రైమాసికాలు వృద్ధి రేటు నేలచూపులు చూసింది.

ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం 'కీన్స్' పుస్తకంలోని పేజీలను తిరగేసింది.

6.9 లక్షల కోట్ల రూపాయలతో దేశంలో 83,677 కిలోమీటర్ల రహదారులను అభివృద్ధి చేసే ప్రాజెక్టును ప్రకటించింది.

అందులో భాగంగా రానున్న దేశంలోని అన్ని రాష్ట్రాలనూ అనుసంధానించే రహదారులను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించింది.

ఆర్థిక వ్యవహారాల విశ్లేషకులు మిహిర్ స్వరూప్ శర్మ అభిప్రాయం ప్రకారం, ఆ డబ్బులో అధిక భాగం ప్రధానంగా 34,800 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను పునరుద్ధించేందుకు, విస్తరించేందుకు రానున్న రెండు దశాబ్దాలలో వెచ్చించనున్నారు.

ఇది కొత్తేం కాదు. ఎందుకంటే, పాత పథకాలనే మోదీ ప్రభుత్వం కొత్తవిగా చూపించే ప్రయత్నం చేస్తోంది.

ఆ విషయాన్ని పక్కనపెడదాం. ఈ ప్రాజెక్టు ఎలా కార్యరూపం దాల్చుతుందో చూద్దాం.

భారత జాతీయ రహదారుల సంస్థతోపాటు, ఇతర సంస్థలకు, శాఖలకు పూర్తి అధికారాలు ఇచ్చినట్లు ప్రభుత్వం చెప్పింది.

ఫొటో క్యాప్షన్,

83 వేల కిలోమీటర్లకు పైగా రహదారులను నిర్మించాలని భారత ప్రభుత్వం ప్రణాళిక వేస్తోంది

ప్రపంచంలోనే అతిపెద్ద రహదారుల నెట్‌వర్క్ కలిగిన దేశాల్లో భారత్ ఒకటి. జాతీయ, రాష్ట్ర, జిల్లా, గ్రామీణ రహదారులు కలిపి మొత్తం 54 లక్షల కిలోమీటర్లకు పైగా పొడవైన రోడ్లు ఉన్నాయి. అయితే అందులో జాతీయ రహదారులు 2 శాతం కంటే తక్కువే.

ఈ రోడ్ల నిర్మాణ ప్రాజెక్టు ద్వారా ఉపాధి కోసం ఎదురుచూస్తున్న లక్షల మంది నిరుద్యోగులకు మేలు చేకూర్చాల్సి ఉంటుంది.

ప్రభుత్వం చెబుతున్నట్లుగా ఈ ఒక్క ప్రాజెక్టుతోనే 14 కోట్లకు పైగా పనిదినాలను కల్పించే అవకాశం ఉంది.

ఈ ప్రాజెక్టుతో ప్రధానంగా నైపుణ్యం లేని, సెమీ స్కిల్డ్ శ్రామికులకు మంచి ఉపాధి కల్పించే వీలుంటుంది.

ఈ రహదారుల ప్రాజెక్టు కోసం ఫైనాన్షియల్ మార్కెట్లు, ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా ప్రైవేటు పెట్టుబడులు రాబట్టడం, జాతీయ రహదారులపై టోల్ వసూలు, రోడ్డు రవాణా శాఖ పండ్, తదితర మార్గాల నుంచి నిధులు సమకూర్చుకునేందుకు ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది.

ఆర్థిక వృద్ధికి ఊతం

ప్రభుత్వం రోడ్లను నిర్మిస్తుంది. అనేక మందికి ఉపాధి చూపించి, వారి ఆర్థిక స్థోమతను పెంచుతుంది. దాంతో కార్మికుల కొనుగోలు శక్తిని మెరుగుపరుస్తుంది. అప్పుడు దేశంలో అటోమేటిక్‌గా వ్యాపారాలు, ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటాయి.

అయితే, ఇదంతా కేవలం చెప్పినంత సులువుగా జరిగితేనే సాధ్యమవుతుంది.

రానున్న ఐదేళ్లలో 83,677 కిలోమీటర్ల రహదార్లను నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది.

అంటే, ఐదేళ్లలో సగటున ఏడాదికి 16,735.4 కిలోమీటర్ల రోడ్లను నిర్మించనుంది.

మరి అది సాధ్యమవుతుందా?

దేశంలో గత మూడేళ్ల కాలంలో నిర్మించిన రోడ్లకు సంబంధించి ప్రభుత్వ లెక్కలను చూద్దాం.

  • 2014-15లో 4,410 కిలోమీటర్లు.
  • 2015-16లో 6,061 కిలోమీటర్లు.
  • 2016-2017 ఆర్థిక సంవత్సరంలో 2016 డిసెంబర్ నాటికి 4,699 కిలోమీటర్ల రోడ్లు నిర్మించారు.

పై వివరాలు చూస్తే, ప్రభుత్వం రహదారుల నిర్మాణంలో వేగాన్ని క్రమంగా పెంచుతూ వచ్చిందన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

ఫొటో క్యాప్షన్,

నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్లనే భారత్‌లో రోడ్లు ఎక్కువగా చెడిపోతున్నాయి

రహదారుల నిర్మాణాకి ఎదురయ్యే ప్రధాన సమస్య భూసేకరణ.

అయితే, "భూసేకరణ క్లిష్టమైనదే. కానీ, అది సమస్య మాత్రం కాదు. ఎందుకంటే, రహదారుల ప్రాజెక్టుల కోసం సేకరించే భూములకు మెరుగైన పరిహారం చెల్లించి రైతులను ఒప్పించేందుకు చర్యలు చేపడుతున్నాం" అని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.

కానీ, గత ప్రాజెక్టులు చూస్తే మంత్రి చెప్పింత సులువుగా ఏమీ జరగట్లేదన్నది సత్యం.

ఉదాహరణకు.. దిల్లీ, ముంబయి నగరాలను అనుసంధానిస్తూ పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధి చేయాలన్న ప్రాజెక్టును ప్రకటించి దాదాపు దశాబ్దం గడిచిపోయింది. పనులు ప్రారంభం అయ్యాయి. కానీ, భూసేకరణ సమస్యలతో ఇప్పటికీ చాలావరకు పనులు ముందుకు కదలడంలేదు.

ఇది కొత్తేం కాదు

దేశ ఆర్థిక వృద్ధిని మెరుగుపరిచేందుకు రహదారులను నిర్మించాలన్న ఆలోచన కొత్తదేమీ కాదన్నది గమనించాల్సిన విషయం.

కీన్స్ పుస్తకంలో రాయకముందు నుంచే ఇలాంటి ఆలోచనలు ఆచరణలో ఉన్నాయి.

కీన్స్ థియరీ రాకముందే, అడాల్ఫ్ హిట్లర్ ఆ ఆలోచనను అమలు చేశారు. జర్మనీలో లక్ష మంది కార్మికులతో దేశవ్యాప్తంగా కూడలి రహిత నాలుగు లైన్ల రహదారి(ఔటోబాన్) నిర్మాణం చేపట్టారు.

1933లో హిట్లర్ అధికారంలోకి వచ్చారు. 1936లోగా జర్మనీ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టారు. భయంకరమైన ఆర్థిక మాంద్యం, నిరుద్యోగ సమస్య నుంచి దేశాన్ని గట్టెక్కించారు.

ఇటలీ, జపాన్ కూడా ఇలాంటి వ్యూహాన్నే అనుసరించాయి.

మరి భారత్‌లో పరిస్థితులు ఎంతమేరకు పనిచేస్తుంది?

అంటే, ప్రభుత్వం ఎంత పక్కాగా రోడ్ల నిర్మాణ ప్రక్రియను చేపడుతుందన్న విషయంపైనే అది అధారపడి ఉంది.

శుభ వార్త ఏంటంటే, నరేంద్ర మోదీ ప్రభుత్వంలోని చక్కని పనితనం కలిగిన మంత్రుల్లో నితిన్ గడ్కరీ ఒకరు కావడం. కానీ, భారత్‌లో సాధారణంగా ఆచరణ సరిగ్గా ఉండదన్న విషయమే బ్యాడ్ న్యూస్.

వివేక్ కౌల్ ('ఇండియాస్ బిగ్ గవర్నమెంట్-ది ఇన్‌ట్రూసివ్ స్టేట్ అండ్ హౌ ఇట్ ఈస్ హర్టింగ్ అస్' పుస్తకం రచయిత)

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)