కాటలోనియా స్వయంప్రతిపత్తి రద్దు, ప్రత్యక్ష పాలన ప్రారంభించిన స్పెయిన్

  • 28 అక్టోబర్ 2017
కాటలోనియా Image copyright AFP
చిత్రం శీర్షిక ‘ప్రజలే పాలిస్తారు’ అని అర్థం వచ్చే ప్లకార్డులను ప్రదర్శిస్తూ కాటలోనియా ప్రజలు స్వాతంత్ర్య సంబరాలు జరుపుకున్నారు

కాటలోనియాలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. స్పెయిన్ ప్రభుత్వం కాటలోనియా స్వయంప్రతిపత్తిని రద్దు చేసి పాలనను స్పెయిన్ ఉప ప్రధాని సొరాయా సాయెంజ్ డి సాంటామారియాకు అప్పగించినట్లు అక్కడి అధికారిక వార్తాఛానల్ వెల్లడించింది.

కాటలన్ పోలీస్ వ్యవస్థను స్పెయిన్ అంతర్గత మంత్రి తన ఆధీనంలోకి తీసుకున్నారు.

అంతకుముందు స్పెయిన్ నుంచి విడిపోవడానికి వీలుగా కాటలోనియా ప్రాంతీయ పార్లమెంట్ ఓటు వేసింది. స్పెయిన్ ప్రభుత్వం ఇక్కడ ప్రత్యక్ష పాలనను అమలు చేయాలని తీర్మానించిన నేపథ్యంలో ఈ పరిణామం జరిగింది. దీంతో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

తర్వాత కాసేపటికి స్పెయిన్ ప్రధాని మారియానో కాటలోనియా పార్లమెంట్‌ను రద్దు చేశారు.

ప్రాంతీయ ఎన్నికలకు పిలుపునిచ్చారు.

కాటలోనియా పార్లమెంట్‌లో మొత్తం 80 ఎంపీలు ఓటింగ్‌లో పాల్గొనగా 70 మంది అనుకూలంగా 10 మంది వ్యతిరేకంగా ఓటేశారు.

వ్యతిరేక పార్టీ ఎంపీలు ఈ ఓటింగ్‌ను బాయ్‌కాట్ చేశారు.

అంతకు ముందు స్పెయిన్ ప్రధాని మారియానో రజాయ్.. కాటలోనియాలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రత్యక్షపాలన అవసరమని అభిప్రాయపడ్డారు.

స్వాతంత్ర్య కాంక్షకు మూలమేమిటి?

స్పెయిన్‌లోని చాలా ధనిక, ఉత్పాదక ప్రాంతాల్లో కాటలోనియా ఒకటి. ఈ ప్రాంతానికి విభిన్నమైన చరిత్ర ఉంది. స్పెయిన్ అంతర్యుద్ధానికి ముందు కాటలోనియాకి విస్తృత స్వయంప్రతిపత్తి ఉండేది. కానీ 1939-75 మధ్య జనరల్ ఫ్రాన్సిస్కో ఫ్రాంకో నియంతృత్వ పాలనలో ఆ అటానమీ కోల్పోయింది.

Image copyright Getty Images

జనరల్ ఫ్రాంకో చనిపోయిన తర్వాత కాటలన్ జాతీయవాదం మళ్లీ బలంపుంజుకుంది. 1978 రాజ్యాంగంలో ఈ ప్రాంతానికి అటానమీ లభించింది. 2006లో కాటలోనియాను ఒక ''దేశం''గా అభివర్ణిస్తూ.. ఆ ప్రాంతానికి మరిన్ని అధికారాలిస్తూ ఒక చట్టం చేశారు. కానీ స్పెయిన్ రాజ్యాంగ న్యాయస్థానం ఇందులో చాలా వరకూ అధికారాలను రద్దుచేసింది. ఇది ఈ ప్రాంత వాసులకు ఆగ్రహం కలిగించింది.

ఒకవైపు అటానమీకి కోత పెట్టడం, మరోవైపు కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఆర్థిక మాంద్యం, ప్రభుత్వ వ్యయాల్లో కోతలతో ఆగ్రహించిన కాటలోనియా వాసులు స్వాతంత్ర్యం కోసం 2014 నవంబర్‌లో అనధికారికంగా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు.

ఈ ప్రాంతంలోని 54 లక్షల మంది ఓటర్లలో 20 లక్షల మందికి పైగా ఆ ఓటింగ్‌లో పాల్గొన్నారు. వారిలో 80 శాతం మందికి పైగా ఓటర్లు విడిపోవడానికి మద్దతు తెలిపారని కాటలోనియా రాష్ట్ర పాలకులు ప్రకటించారు.

2015లో జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో వేర్పాటువాద పార్టీల కూటమి గెలిచి అధికారం చేపట్టింది. స్పెయిన్ నుంచి విడిపోవడంపై అధికారికంగా నిర్ణయాత్మక రెఫరెండం నిర్వహించే దిశగా కృషి ప్రారంభించింది.

సుసంపన్న కాటలోనియా

స్పెయిన్‌లోని ఈశాన్య ప్రాంతంలో గల స్వయంప్రతిపత్తి రాష్ట్రం కాటలోనియా. మొత్తం జనాభా 75 లక్షలు. కాటలోనియా రాజధాని బార్సిలోనా. 1992 వేసవి ఒలింపిక్స్ ఇక్కడ జరిగినప్పుడు నుండీ ఈ నగరం పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక రెఫరెండం నిర్వహించడం కోసం కాటలోనియాలోని పలు స్కూళ్లను ఆక్రమించుకున్న ఉద్యమకారులు ట్రాక్టర్లతో బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు

కాటలోనియాలో కూడా స్పానిష్ భాష ముఖ్య భాష అయినప్పటికీ.. ఆ ప్రాంతానికి ప్రత్యేకమైన భాషా సంస్కృతులున్నాయి. సగం జనాభా కాటలన్ భాష మాట్లాడతారు.

కాటలోనియా రెఫరెండం: స్వాతంత్ర్యం కావాలి

జనాభాలో సగం మంది క్రైస్తవులు. 30 శాతం మందికి ఏ మతవిశ్వాసాలూ లేవు. ఏడు శాతం మంది ముస్లింలు, ఒకటిన్నర శాతం మంది బౌద్ధులు ఉన్నారు.

  • స్పెయిన్‌ జనాభాలో 16% మంది కాటలోనియాలోనే ఉన్నారు
  • స్పెయిన్ ఎగుమతుల్లో 25.6% కాటలోనియా నుంచే వస్తాయి
  • స్పెయిన్ జీడీపీలో 19% కాటలోనియాలోనే ఉత్పత్తవుతుంది
  • స్పెయిన్‌కి వచ్చే విదేశీ పెట్టుబడుల్లో 20.7% కాటలోనియాకే వెళుతుంది
  • కాటలోనియా జీడీపీలో 35.3% అప్పు

(ఆధారం: ఆర్థికశాఖ, ఇండస్ట్రీ అండ్ కాంపిటిటివ్‌నెస్, యూరోస్టాట్, బ్యాంక్ ఆఫ్ స్పెయిన్)

సంబంధిత అంశాలు