ప్రెస్ రివ్యూ: ‘మోదీ, కేసీఆర్ తోడు దొంగలు’

  • 28 అక్టోబర్ 2017
తమ్మినేని వీరభద్రం Image copyright cpimtelangana/facebook

మోదీ కేసీఆర్ ఇద్దరూ తోడుదొంగల్లా పనిచేస్తున్నారనీ, దిల్లీలో ముద్దులాట-తెలంగాణలో గుద్దులాటగా వారిద్దరూ ఒక పథకం ప్రకారం ప్రజలను పిచ్చివాళ్లను చేస్తున్నారనీ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డిలు విమర్శించారు.

సంక్షేమం పేరుతో వారిద్దరూ ఊదరగొడుతున్నారనీ, నిజమైన సంక్షేమం అంటే ఏంటో తెలియాలంటే.. మోదీ, కేసీఆర్ కలసి వాళ్ల మంత్రులను తీసుకొని వామపక్ష ప్రభుత్వం పాలిస్తున్న కేరళ వెళ్లి చూడాలని వీరభద్రం, వెంకట్‌రెడ్డిలు హితవు పలికినట్లు నవ తెలంగాణ పత్రిక పేర్కొంది.

దేశంలో లౌకిక సామ్యవాద సిద్ధాంతాలను తుదముట్టించేందుకు సంఘ్‌పరివార్, మతోన్మాద శక్తులు, విశ్వహిందూ పరిషత్, ఆరెస్సెస్ శక్తులు బలంగా పనిచేస్తున్నాయని వాళ్లు విమర్శించినట్లు ఆ పత్రిక తెలిపింది.

Image copyright APgovt

రాజధాని పనులు సంక్రాంతికి మొదలు

రానున్న సంక్రాంతికి కాస్త అటూ ఇటుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధానిలో నిర్మించే హైకోర్టు భవనం డిజైన్‌ని ఖరారు చేశామని, శాసనసభ డిజైన్‌ను 40 రోజుల్లో అందిస్తామని ఆర్కిటెక్ట్ సంస్థ చెప్పిందని ఆయన తెలిపారు.

శాసనసభలో విలేకర్లతో పిచ్చాపాటీ మాట్లాడుతూ చంద్రబాబు ఈ వివరాల్ని వెల్లడించినట్లు ఆంధ్రజ్యోతి పత్రిక తన కథనంలో పేర్కొంది.

సినీ దర్శకుడు రాజమౌళి సూచనలు అమరావతి డిజైన్లకు బాగానే ఉపయోగపడ్డాయని, బాహ్య ఆక‌ృతులపైన రాజమౌళి ఎక్కువ సూచనలు చేశారనీ చంద్రబాబు చెప్పినట్లు ఆ పత్రిక వివరించింది.

Image copyright TDP Khammam Official/Facebook

మహిళకు నామా బెదిరింపులు!

తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు తనను వేధిస్తున్నారంటూ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నామా వద్ద తన నగ్న చిత్రాలు ఉన్నాయంటూ బెదిరిస్తున్నారనీ, వాటిని బయటపెట్టి సమాజంలో తలెత్తుకోలేకుండా చేస్తానంటూ దాడికి పాల్పడ్డారని సదరు మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సాక్షి పత్రికలో ప్రచురితమైన ఓ కథనం చెబుతోంది.

నామా తనను దూషించిన సెల్‌ఫోన్ ఆడియో రికార్డులను, ఇంటికి వచ్చి దుర్భాషలాడిన వీడియోను సైతం ఫిర్యాదుకి ఆధారంగా జతపరిచినా.. నామా ఒత్తిడి కారణంగా పోలీసులు ఆలస్యంగా కేసుని నమోదు చేశారని ఆ మహిళ తెలిపినట్లు ఈ కథనంలో వివరించింది.

తెలంగాణలో చదవాలంటే తెలుగు తప్పనిసరి

ఒకటి నుంచి 12వ తరగతి వరకూ తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేయాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలనీ తెలంగాణ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు.

డిసెంబరు 15 నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఆ లోపలే తెలుగుని తప్పనిసరి సబ్జెక్టుగా చేర్చేలా విధానాన్ని రూపొందించాలని శ్రీహరి అధికారులకు సూచించినట్లు ఆంధ్రజ్యోతి కథనం తెలియజేస్తోంది.

ఈ విధానాల రూపకల్పన కోసం అధికారులతో ఓ కమిటీని మంత్రి ఏర్పాటు చేశారనీ, చట్టంలో కావల్సిన మార్పులకు సంబంధించిన ప్రతిపాదనలను ఆ కమిటీ రూపొందిస్తుందనీ ఆ కథనం చెబుతోంది.

Image copyright itministertelangana/facebook

‘హైదరాబాద్ భారీ వర్షాన్ని తట్టుకోలేదు’

హైదరాబాద్‌కి భారీ వర్షాన్ని తట్టుకునే సామర్థ్యం లేదని తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రాజధాని ప్రజలు ఇబ్బందులు పడ్డ మాట వాస్తవమేననీ ఆయన చెప్పారు.

చెరువులు, నాలాల ఆక్రమణల వల్ల వరదనీటి ప్రవాహానికి ఆటంకాలు ఎదురవుతున్నాయని కేటీఆర్ తెలిపినట్లు నవతెలంగాణ పత్రిక కథనం పేర్కొంది.

శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ, దశాబ్దాల నుంచి వేల సంఖ్యలో చెరువులూ, నాలాల ఆక్రమణలు జరిగాయనీ, గత మూడేళ్లలో అవి జరగలేదని తాను చెప్పననీ, కాకపోతే ఆ ఆక్రమణలే ముంపునకు కారణమవుతున్నాయనీ కేటీఆర్ వివరించారు.

Image copyright YS Jaganmohan Reddy/Facebook

‘కారణం లేకుండా జగన్ పాదయాత్రను అడ్డుకోం’

సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం అనుమతి తీసుకొని ఎవరైనా పాదయాత్రలు చేసుకోవచ్చనీ, జగన్ పాదయాత్రను అకారణంగా అడ్డుకోమనీ ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు స్పష్టం చేశారు.

శుక్రవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ డీజీపీ ఆ వ్యాఖ్య చేసినట్టు ఈనాడు తన కథనంలో పేర్కొంది.

విజయవాడలో కంచ ఐలయ్య తలపెట్టిన బహిరంగ సభ, ఆర్య వైశ్యులు-బ్రాహ్మణ సామాజిక చైతన్య సదస్సులకు అనుమతి ఇవ్వలేమనీ, ఐలయ్య విజయవాడ వస్తే అరెస్టు చేస్తామని ఓ ప్రశ్నకు సమాధానంగా డీజీపీ చెప్పినట్లు ఆ పత్రిక వివరించింది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)