అనుపమా పరమేశ్వరన్ : కాలేజీ రోజుల్లో నన్నూ వేధించారు

  • ప్రకాశ్ చిమ్మల
  • బీబీసీ న్యూస్ తెలుగు కోసం
అనుపమా పరమేశ్వరన్

ఫొటో సోర్స్, AnupamaParameswaranOnline/facebook

’’జీవితంలో ప్రతి అమ్మాయికీ ఏదో ఒక దశలో వేధింపులు ఎదురవుతూనే ఉంటాయి. ఒక్కోసారి మనకు తెలీకుండానే మనల్ని ఎదుటివాళ్లు వేధిస్తుంటారు. కానీ చాలా మంది అమ్మాయిలు దాన్ని గుర్తించలేరు".

‘అ..ఆ..’ నుంచి ‘ఉన్నది ఒకటే జిందగీ’ వరకూ ప్రతి సినిమాతో తన క్రేజ్‌ని పెంచుకుంటున్న కేరళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్. ‘గతంలో నేనూ అందరిలాంటి అమ్మాయినే. చాలామందిలా నాకూ బస్సుల్లో వేధింపులు తప్పలేదు’ అంటూ అనుపమ సినిమాలతో పాటు ఎన్నో ఆసక్తికరమైన వ్యక్తిగత సంగతులనూ ‘బీబీసీ న్యూస్ తెలుగు’తో పంచుకున్నారు.

సినీ పరిశ్రమే పెద్ద యూనివర్సిటీ

నాకైతే చదువుకోవడం చాలా కష్టం. ఆ కష్టాన్ని నేను రోజూ అనుభవిస్తున్నాను. సినీ పరిశ్రమే పెద్ద యూనివర్సిటీ లాంటిది. ఇక్కడ రోజూ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నా. కొత్త వ్యక్తుల గురించి తెలుసుకుంటున్నా. కొత్త భాషలు నేర్చుకునేందుకు నేనస్సలు సిగ్గుపడను. భాషలో తప్పులు దొర్లినా సరే ఎవరు ఏమనుకుంటారోనని పట్టించుకోకుండా అలా మాట్లాడుతూనే ఉంటా. అందుకే చాలా త్వరగా తెలుగు నేర్చుకోగలిగా.

‘ఆ’ చూపులకు అర్థం తెలుసు

జీవితంలో ప్రతి అమ్మాయికీ ఏదో ఒక దశలో వేధింపులు ఎదురవుతూనే ఉంటాయి. ఒక్కోసారి మనకు తెలీకుండానే మనల్ని ఎదుటివాళ్లు వేధిస్తుంటారు. ఉదాహరణకు బస్సులో కండక్టర్ టిక్కెట్ ఇచ్చే సాకుతో అమ్మాయిల్ని దురుద్దేశంతో తాకొచ్చు. కానీ ఆ రద్దీలో చాలా మంది అమ్మాయిలు దాన్ని గుర్తించలేరు.

అమ్మాయిలను తప్పుడు ఉద్దేశంతో చూడటం, కామెంట్లు చేయడం కూడా వేధింపుల్లో భాగమే. ఎవరు ఏ ఉద్దేశంతో తమను చూస్తున్నారో అర్థం చేసుకోవడం అమ్మాయిలకు పెద్ద కష్టమేం కాదు. అలా ప్రవర్తించేవాళ్లంతా తమకూ ఇంట్లో అమ్మలూ, అక్కాచెల్లెళ్లూ ఉంటారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం ఇలాంటి వేధింపుల గురించి చర్చిస్తున్న ‘మీటూ’ ఆన్‌లైన్ క్యాంపైన్ చాలా అర్థవంతమైందని నా అభిప్రాయం.

ఫొటో సోర్స్, AnupamaParameswaranOnline/facebook

నన్నూ అసభ్యంగా తాకేవాళ్లు

గతంలో నాక్కూడా బస్సుల్లో రకరకాల చేదు అనుభవాలూ, వేధింపులూ ఎదురయ్యాయి. రోజూ హాస్టల్ నుంచి కాలేజీకి బస్సులోనే వెళ్లొచ్చేదాన్ని. వారాంతాల్లో హాస్టల్ నుంచి ఇంటికి బస్సులో వెళ్లడానికి ఐదారు గంటలు పట్టేది. ఆ సమయంలో బస్సులో ఎక్కువగా మగవాళ్లే ఉండేవారు.

రద్దీగా ఉందన్న వంకతో చాలామంది పక్కన నిలబడటానికీ, తాకడానికీ ప్రయత్నించేవారు. దానివల్ల వాళ్లకు ఏం ఆనందమొస్తుందో నాకర్థం కాదు. చాలాసార్లు అలాంటి వాళ్ల మీద చిరాకుపడి దూరంగా నిలబడమని హెచ్చరించేదాన్ని. ఇలాంటి అనుభవాలు అందరికీ ఉంటాయనుకుంటున్నా.

ఫొటో సోర్స్, AnupamaParameswaranOnline/facebook

ఇష్టమైన వ్యాపకాలు

జిమ్‌లో వ్యాయామాలూ, పబ్‌లో పార్టీలూ.. ఇలాంటివేవీ నాకు ఇష్టం లేదు. నేను మంచి భోజన ప్రియురాలిని. తినడం, పర్యటనలకు వెళ్లడం చాలా ఇష్టం. సినిమాల పుణ్యమా అని నాకు నచ్చింది తింటూ, ఎక్కడికైనా వెళ్లొచ్చే అవకాశం దొరికింది. ‘నీకు చాలా ఇష్టం కదా తిరగటం.. ఇలా తిరుగు’ అంటూ దేవుడు నాకు సినిమాల్లో అవకాశం ఇచ్చారు!

తెలుగు రాష్ట్రాలతో అనుబంధం

హైదరాబాద్‌లో గోల్కొండ, బిర్లా మందిర్, చార్మినార్ లాంటి అన్ని ప్రాంతాల్నీ చూశా. ఆంధ్రాలో వైజాగ్, గోదావరి జిల్లాలు నాకు బాగా నచ్చాయి. ‘శతమానం భవతి’కి 49 రోజుల పాటు గోదావరి జిల్లాల్లోనే పనిచేశా. రాజమండ్రి, అమలాపురం లాంటి ప్రాంతాల్లో తిరుగుతుంటే కేరళలో మా ఊళ్లో ఉన్నట్టే అనిపించేది. నాకు అక్కడ చాలా జ్ఞాపకాలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, AnupamaParameswaranOnline/facebook

ఆ యాస చాలా ఇష్టం

పెసరట్టు, ఉప్మా, పునుగులు.. ఇలా గోదావరి జిల్లాల్లో దొరికే చాలా పదర్థాలు నాకు తెగనచ్చేశాయి. కేవలం భోజనం మాత్రమే కాదు.. వాళ్లు వడ్డించే తీరు.. ‘అమ్మా పెట్టుకోమ్మా. రండమ్మా’ అంటూ అన్నంతో పాటు కాస్త ప్రేమనూ కలిపి వడ్డిస్తారు. వాళ్ల యాస, కొత్త వాళ్లని ఆదరించే తీరు నన్ను కట్టిపడేశాయి. ముఖ్యంగా.. ‘ఏం చేశావ్ రా..’ అంటూ వాళ్లు ఆ యాసలో అంటుంటారు కదా! అది నాకు చాలా ఇష్టం.

ఫొటో సోర్స్, AnupamaParameswaranOnline/facebook

తెలుగు హీరోల గురించి.. ఒక్క మాటలో

నితిన్ - అందగాడు.

నాగచైతన్య - ప్రొఫెషనల్, నిరాడంబరమైన వ్యక్తి.

శర్వానంద్ - నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్.

రామ్ - సూపర్ ఎనర్జిటిక్, అతనితో పనిచేయడం చాలా సరదాగా ఉంటుంది.

నాని - చాలా మంచి టైమింగ్ ఉన్న నటుడు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)