గౌతమి: కేన్సర్ ను ఇలా జయించారు

  • 29 అక్టోబర్ 2017
రొమ్ము కేన్సర్ పై అవగాహన కార్యక్రమం Image copyright Gowtami
చిత్రం శీర్షిక రొమ్ము కేన్సర్ పై అవగాహన కార్యక్రమం

గౌతమి.. చాలా మందికి నటిగానే తెలుసు. కాని ఆమె నటి మాత్రమే కాదు. చాలా మందికి స్పూర్తి కూడా.

ఎందుకంటే ఆమె కేన్సర్‌ను జయించారు. ఇతరులకూ కేన్సర్ పై అవగాహన కల్పించేందుకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

రొమ్ము కేన్సర్ అవగాహన కోసం ఆమె విశాఖపట్నంలో పలు కార్యక్రమాలు చేపట్టారు.

ఈ సందర్భంగా బీబీసీ తెలుగు ప్రతినిధి ఆమెతో మాట్లాడారు.

సినిమానా.. సేవా.. ఏ రంగం లో మీకు ఎక్కువ సంతృప్తి?

నాకు ఇష్టం లేని ఏ పనీ నేను చేయను. ఒక అడుగు ముందుకు వేయాలి, ఒక అడుగు పైకి ఎక్కాలి ఇదే నా ఫిలాసఫీ. రెండు రంగాలు ఇష్టమే. వృత్తి మీద ప్రేమ లేకపోతే ఇక్కడ పని చేయలేం. ఇష్టం, ప్రేమ, అంకిత భావం ఉంటేనే ఏ రంగంలోనైనా రాణించగలం.

అక్టోబర్‌ను రొమ్ము కేన్సర్ మాసంగా పరిగణిస్తున్నారు. రొమ్ము కేన్సర్ పై ఎటువంటి అవగాహన రావాలి?

లైఫ్ అగైన్ ఫౌండేషన్ ద్వారా మేము విద్య, ఆరోగ్యం వైపు దృష్టి సారిస్తున్నాం. ఎంత చదువు తెలివితేటలున్నా ఆరోగ్యంగా లేకపోతే ఏమి చేయలేము. అందువల్ల ఏ సంస్ధ చేరని మారు మూల ప్రాంతాలకు కూడా వెళ్లి అవగాహనా శిబిరాలు నిర్వహించాలని అనుకుంటున్నాం.

కేన్సర్ నిర్మూలనకు, మంచి వైద్యం అందించడానికి మా సంస్థ ద్వారా కృషి చేస్తున్నాం. అందరికి అందుబాటులో ఉండే విధానం లో ఒక నమూనాకు ప్రణాళిక చేస్తున్నాం. రెండు నెలల్లో అమలు లోకి తెస్తాం.


అక్టోబరులో అసలేం చేస్తారు?

  • అక్టోబర్ బ్రెస్ట్ కేన్సర్ అవగాహన మాసం.
  • వేలాది స్వచ్చంద సంస్థలు రొమ్ము కేన్సర్ పై అవగాహన పెంచేందుకు , ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తాయి.
  • అక్టోబర్ 20 న బ్రిటన్ అంతటా గులాబీ వస్త్రాలు ధరించి అవగాహన పెంచుతారు.
  • భారత్‌లో రొమ్ము కేన్సర్ బారిన పడే మహిళల శాతం ఎక్కువ.
  • లక్ష మంది మహిళల్లో 33 మంది బ్రెస్ట్ కేన్సర్ బారిన పడుతున్నట్లు ఐసీఎంఆర్ అంచనా.
  • దేశంలో ఏటా లక్ష మందికిపైగా రొమ్ము కేన్సర్ బారినపడుతున్నారు.
  • 2020కి దేశంలో రొమ్ము కేన్సర్ బాధితుల సంఖ్య 1797900 కి చేరవచ్చని జాతీయ బయో టెక్నాలజీ సమాచార కేంద్రం అంచనా.
  • జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, అవగాహనా లోపాలను రొమ్ము కేన్సర్ కి కారణాలని తెలిపింది.

విశాఖతో మీ అనుబంధం?

నా చిన్న నాటి జ్ఞాపకాలన్నీ విశాఖపట్నంతో ముడిపడి ఉన్నాయి. అందుకని ఈ ఊరుతో నాకు ఎపుడూ అనుబంధం ఉంది.

మీరు రాజకీయాలలోకి అడుగు పెట్టే ఉద్దేశం ఉందా?

అవసరమైనపుడు మాట్లాడాలి. నా చుట్టూ పక్కల జరుగుతున్న విషయాలకి స్పందించకుండా ఉండలేను. ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ తప్పకుండా గళం విప్పి మాటలాడతాను.

హాలీవుడ్ ప్రొడ్యూసర్ వైన్ స్టీన్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణ నేపధ్యం లో #మీ టూ అని నినదిస్తూ ఎంతో మంది మహిళలు గళం విప్పారు. తెలుగు సినిమా రంగం లో కూడా ఇటువంటి వేధింపులు ఉంటాయా?

Image copyright Wikipedia

ఎక్కడ అధికార అసమానతలు ఉంటాయో అక్కడ వేధింపులకు అవకాశం ఉంటుంది. దురదృష్టవశాత్తు ఇది మానవతకు మరో కోణం. ఏమి జరిగిందో అని ఆలోచించకుండా ఇటువంటి వేధింపుల నుంచి బయటపడటానికి ఏమి చేయాలి అని ఆలోచించాలి.

ఇలా దెబ్బ తిన్న వాళ్ళు మానసికంగా , శారీరకం గా, సాంఘికం గా నలిగిపోతున్నారు. వీళ్ళకి సహాయం చేయగలగాలి.

ఇటువంటి బాధితులకు మీరిచ్చే సలహా?

ఇది అందరి సమస్య. ఏ ఒక్కరిదో కాదు. ఇటువంటి సంఘటనలలో కౌన్సెలింగ్ చాలా అవసరం. నా సంస్థ ద్వారా తప్పకుండా చేతనైనంత సహాయం చేస్తాను. న్యాయ పరం గా ఎటువంటి రక్షణ ఉందో బాధితులకు తెలియాలి. ఈ సమస్య వినోద రంగానికి మాత్రమే పరిమితం కాదు. కార్పొరేట్ రంగం లోనూ ఉంది. కాకపొతే ఈ విషయాలు అక్కడ కూడా భయపడి ఎవరూ మాటలాడరు. సినిమా రంగం దశాబ్దాల పురాతన పరిశ్రమ. ఈ సమస్య మూలాల నుంచి పరిష్కరించుకుంటూ రావాలి.

జీవితమే ఒక పోరాటం. నేను కేన్సర్ కి ఎదురు తిరిగాను. జయించాను. ఊపిరి ఉన్నంత వరకు పోరాడాల్సిందే. పోరాటానికి లింగ బేధం లేదు.

సమాజం లో ఆధునిక మహిళ ఎదుర్కొనే సమస్యలకు ఎటువంటి పరిష్కారం సూచిస్తారు?

లింగ బేధం అనేది కేవలం ఒక భావన. ప్రతి మహిళ తనను తానూ అర్ధం చేసుకోవాలి. తనని తాను ఆమోదించగలగాలి. మహిళ ఆత్మ స్థైర్యం తో ఉంటే ఏ శక్తీ ఏమీ చేయలేదు. ఇవి వినడానికి బాగుంటాయి, కానీ అమలు చేయడానికి కష్టం. అందుకే మనం ఏమిటో మనం తెలుసుకున్న రోజున సమస్యలు తగ్గుతాయి.

ఆధునిక మహిళ పై చాలా ఒత్తిడి ఉంది. వేసుకున్న బట్టల నుంచి, మాటలాడే మాట వరకు సమాజం నిర్ధారిస్తుంది. తనది కాని వ్యక్తిత్వం లో తనను బంధించాలనే పోరాటంలో నేటి మహిళ నలిగిపోతోంది.

తన పాదాన్ని సిండ్రెల్లా షూ లో పెట్టాలని చూడటం ఆపిన రోజున ఆధునిక సమస్యలు చాలా వరకు నివారించవచ్చు.

ఆ చట్రం నుంచి బయటపడి తనకంటూ ఒక వ్యక్తిత్వం ఏర్పరుచుకున్న రోజున చాలా వరకు మహిళలు సమస్యలు అధిగమించవచ్చు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు