ప్రెస్ రివ్యూ: జగన్ వైఖరి నక్క వాత పెట్టుకున్నట్లుంది - చంద్రబాబు

  • 29 అక్టోబర్ 2017
చంద్రబాబు నాయుడు Image copyright AndhraPradeshCM/facebook

‘పులిని చూసి నక్క వాత పెట్టుకుందట. జగన్ వ్యవహారశైలి అలానే ఉంది’ అని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఫిరాయింపులను వ్యతిరేకించిన ఎన్టీ రామారావే తనకు ఆదర్శమని, అందుకే అసెంబ్లీని బహిష్కరిస్తున్నామని ఇటీవలే వైఎస్సార్‌‌సీపీ అధ్యక్షుడు జగన్ అన్నారు.

ఈ నేపథ్యంలో శనివారం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్సులో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు.. ఎన్టీఆర్‌తో జగన్ పోల్చుకోవడం అంటే పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం లాంటిదని చంద్రబాబు సమాధానం ఇచ్చినట్టు ఆంధ్రజ్యోతి పత్రిక పేర్కొంది.

‘ఆయన అసెంబ్లీని బాయ్‌కాట్ చేయడమంటే.. ఎవరో ఎందుకో ఊరి మీద అలిగారంట’ అంటూ మరో సామెతను చంద్రబాబు ఉటంకించారు. ప్రతిపక్ష ఎంపీలు ప్రజాస్వామ్యాన్నీ, వ్యవస్థనూ దుర్వినియోగం చేస్తున్నారనీ, రాష్ట్రంలో కులాలను కూడా రెచ్చగొడుతున్నారనీ ఆయన ఆరోపించారు.

Image copyright facebook

కాంగ్రెస్‌లో రేవంత్ పాత్ర ఏమిటో?

టీడీపీకీ, ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి ఈ నెల 31న కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ ఖరారవడంతో, ఈ నెల 31నే ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారన్న వాదనకు బలం చేకూరుతోంది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో చేరనున్న రేవంత్ రెడ్డికి ఆ పార్టీలో ఏ అవకాశం వస్తుందోనన్న అంశంపై రాజకీయ వర్గాలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నట్లు సాక్షి తన కథనంలో పేర్కొంది. టీపీసీసీ మరో ఇద్దరు కార్య నిర్వాహక అధ్యక్షులను నియమిస్తుందనీ, అందులో రేవంత్ రెడ్డికీ అవకాశం దొరుకుతుందనీ ఆ పత్రిక విశ్లేషించింది. కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ బాధ్యతలను కూడా రేవంత్‌కే అప్పగించే అవకాశాలున్నాయని అంటోంది.

ఐలయ్య పుస్తకంపై వివాదానికి స్వస్తి

ప్రొఫెసర్ కంచ ఐలయ్య పుస్తకంపై చెలరేగిన వివాదానికి ముగింపు పలికేందుకు ఇరుపక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ స్పష్టం చేశారు. విజయవాడలో ఐలయ్యకు సన్మానం, ఆర్యవైశ్యుల సమావేశం ఒకే రోజు నిర్వహించాలనే విషయమై వివాదం చెలరేగిన నేపథ్యంలో, దీనికి సామరస్యంగా పరిష్కారాన్ని కనుగొనేందుకు చేసిన ప్రయత్నం ఫలించిందని ఆయన చెప్పారు.

ఇకపై జరిగే సభలు, సమావేశాల్లో ఆర్యవైశ్య కులం గురించి తాను మాట్లాడబోనని ఐలయ్య స్పష్టం చేసినట్టు రామక‌ృష్ణ తెలిపారు.

‘సామాజిక స్మగ్లర్లు-కోమటోళ్లు’ అనే పుస్తకంపై వివాదం నెలకొన్న నేపథ్యంలో దానికి ముగింపు పలికే ఉద్దేశంతో ఆర్యవైశ్య సంఘం, దళిత సంఘాల నేతల మధ్య చర్చలు జరిగాయని విశాలాంధ్ర పత్రిక పేర్కొంది.

Image copyright TDP Khammam Official/Facebook

‘నా జీవితం తెరిచిన పుస్తకం’

టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు హైదరాబాద్‌కి చెందిన ఓ మహిళను బ్లాక్‌మెయిల్ చేశారన్న ఆరోపణలకు సంబంధించిన ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో బాధిత మహిళ సుజాత మాట్లాడుతూ.. మహిళా సాధికారత కోసం పనిచేస్తానని చెబుతున్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంపై స్పందించాలని కోరారు. మహిళలను లొంగదీసుకొని, బెదిరించే మనస్తత్వం ఉన్న నామాను పార్టీ పొలిట్‌బ్యూరోలో ఎలా కొనసాగిస్తారో బాబు సమాధానం చెప్పాలని, తనకు న్యాయం చేయాలని కోరారు.

తనపై నమోదైన కేసు గురించి స్పందించిన నామా.. తాను ఎవర్నో బ్లాక్‌మెయిల్ చేసినట్టుగా వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. తన జీవితం తెరిచిన పుస్తకమనీ, నలుగురికి సాయపడటం తప్ప ఎప్పుడూ ఎవర్నీ ఇబ్బంది పెట్టలేదని ఆయన చెప్పినట్టు సాక్షి తన కథనంలో పేర్కొంది.

ఏపీ పోలీసులపై రాజస్థాన్‌లో కేసు

దోపిడీ దొంగ భీమ్‌సింగ్‌ను ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు కాల్చి చంపిన ఘటనకు సంబంధించి రాజస్థాన్‌లో మూడు ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. శుక్రవారం ఏపీ పోలీసులు వెంటాడుతున్న సమయంలో నిందితులు పారిపోతున్న కారు ఢీకొని ఓ మహిళ మృతి చెందారు. ఆ తరవాత జరిగిన కాల్పుల్లో భీమ్‌సింగ్ హతమవ్వగా, అతడి అనుచరుడు భరత్ పురోహిత్ గాయపడ్డాడు.

నిలువరించబోయిన పోలీసులపై కాల్పులు జరిపినందుకు ఒక కేసు, తనను గాయపర్చడంతో పాటు భీమ్‌సింగ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారంటూ భరత్ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఏపీ పోలీసులపై మరో కేసు, ప్రమాదంలో మ‌ృతి చెందిన మహిళ బంధువుల ఫిర్యాదు ఆధారంగా మూడో కేసు నమోదు చేసినట్టు రాజస్థాన్‌లోని సంచోర్ పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు చెప్పారు.

ఆత్మరక్షణ కోసమే నిందితులపైన పోలీసులు కాల్పులు జరిపినట్టు కర్నూలు రేంజి డీఐజీ శ్రీనివాస్ వెల్లడించినట్టు ఈనాడు పేర్కొంది.

Image copyright TWITTER/PIB

‘మా వాళ్లకు పది నాలుకలు’

‘మా వాళ్లకు పది నాలుకలు’ అని ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత పార్టీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం నిర్వహించిన ‘దివాలీ-మిలన్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ బీజేపీలో కొందరు నేతలు భిన్న స్వరాలను వినిపిస్తున్నారన్నారు.

అవినీతిపై కేంద్రంలోని బీజేపీ చెబుతున్న మాటలకు భిన్నంగా రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే క్రిమినల్ లా (రాజస్థాన్ అమెండ్‌మెంట్) ఆర్డినెన్స్ 2017ను తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ ఆర్డినెన్స్‌పై ప్రభుత్వం వెనక్కి తగ్గనుంది. కానీ కొంత మంది సీనియర్ బీజేపీ నేతలు మాత్రం దాన్ని చట్టం చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్టు చెబుతున్నారు. యూపీలో తాజ్ మహాల్‌పై నెలకొన్న వివాదానికి సంబంధించీ బీజేపీ నేతల నుంచి భిన్న వాదనలు వినిపించాయి. ఈ నేపథ్యంలో తమ పార్టీ నేతలను ఉద్దేశించి మోదీ పై వ్యాఖ్యను చేశారని ప్రజాశక్తి కథనం వెల్లడించింది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)