ప్రెస్ రివ్యూ: ఏపీలో హిజ్రాలకు పించన్, ఇల్లు

  • 30 అక్టోబర్ 2017
Image copyright Getty Images

ఏపీలో హిజ్రాలకు పింన్‌, ఇల్లు

స్త్రీ, పురుషులతో పాటు హిజ్రాల సంక్షేమానికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక కథనం ప్రచురించింది. ప్రభుత్వం ఇప్పటికే ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసిందని.. వారికి ఇళ్లు, పెన్షన్లు, రేషన్‌కార్డులు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత నెల 21వ తేదీన అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చారని పేర్కొంది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 4.87 లక్షల మందిగా ఉన్న ట్రాన్స్‌జెండర్లలో 9 శాతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నారన్నది అంచనాగా చెప్పింది. అయితే ఇటీవల జరిగిన ట్రాన్స్‌జెండర్‌ బోర్డు రాష్ట్రంలో 7,500 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారని పేర్కొందని, కానీ స్మార్ట్‌ పల్స్‌ సర్వేలో రాష్ట్రంలో 63 వేల మంది హిజ్రాలున్నట్లు చెప్తోందని 'ఆంధ్రజ్యోతి' తెలిపింది. ఈ లెక్కలకు పొంతన లేకపోవడంతో అసలైన ట్రాన్స్‌జెండర్‌ జనాభాను కూడా లెక్కించాల్సిన అవసరముందని అధికారులు చెప్తున్నట్లు పేర్కొంది.

Image copyright KRANTI TEKULA

ఆ ఒప్పందంతో మాకు సంబంధం లేదు: ఐలయ్య

''శనివారం విజయవాడలో సీపీఐ కార్యదర్శి రామకృష్ణ, ఇతర దళిత, బహుజన నాయకులు, ఆర్యవైశ్య నాయకుల మధ్య జరిగిన ఒప్పందంతో నాకు, టీమాస్‌కు ఎలాంటి సంబంధం లేదు. బహుజన ప్రతిఘటనా వేదికకూ సంబంధం లేదు. 'సామాజిక స్మగ్లర్లు-కోమటోళ్లు' పుస్తకంపై ఈనెల 13న సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎటువంటి చర్చకూ అవకాశం లేదు'' అని టీమాస్‌ ఫోరం నేత, రచయిత ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య షెఫర్డ్‌ విలేకరుల సమావేశంలో చెప్పినట్లు నవతెలంగాణ పత్రిక పేర్కొంది. సామాజిక న్యాయం, ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ల కోసం శనివారం విజయవాడలో జరుప తలపెట్టిన సభకు ఈనెల 9న మీటింగ్‌ హాల్‌ బుక్‌ అయిందని, ఈనెల 24న వేరే సంఘం సమావేశానికి హాల్‌ బుక్‌ అయిందని అన్నారు. రెండు సమావేశాలకూ ఏపీ పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం సమంజసం కాదని ఆయన తప్పుపట్టినట్లు 'నవ తెలంగాణ'లో అచ్చయిన కథనం వివరించింది.

Image copyright Miss Vizag Facebook

అందాల పోటీలపై ఆగ్రహం.. 'మిస్ వైజాగ్' వాయిదా

'సేవ్‌ గర్ల్స్‌' పేరుతో మహిళలను అంగడి బొమ్మగా చూపించే అందాల పోటీలు సరైనవి కావని, 'మిస్‌ వైజాగ్‌' పోటీలను తక్షణం రద్దు చేయాలని పలు మహిళా సంఘాలు విశాఖపట్నంలో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారిందని ప్రజాశక్తి దినపత్రిక కథనం ప్రచురించింది. ఈ సందర్భంగా పోలీసులకు, మహిళలకు మధ్య తోపులాట జరిగిందని, కొందరు మహిళలు సొమ్మసిల్లారని పత్రిక తెలిపింది. పోటీలు జరుగుతున్న హోటల్ వద్ద శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న మహిళలను పోలీసులు విచక్షణారహితంగా వ్యానుల్లోకి ఎక్కించారని పేర్కొంది. అయినా మహిళలు ఆందోళన కొనసాగించి నినాదాలు చేయడంతో నిర్వాహకులు 'మిస్‌ వైజాగ్‌' పోటీలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారని 'ప్రజాశక్తి' వివరించింది.

Image copyright Tadivaka Venkateswara Rao

కార్పొరేట్ కాలేజీలు, కోచింగ్ సెంటర్లను నిషేధించాలి: సందీప్ పాండే

కార్పొరేట్‌ కళాశాలలు, కోచింగ్‌ కేంద్రాల నిషేధంతోనే విద్యార్థుల ఆత్మహత్యలు ఆగుతాయని ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు, రామన్‌ మెగసెసె అవార్డు గ్రహీత సందీప్‌ పాండే పేర్కొన్నట్లు ఈనాడు దినపత్రిక కథనం ప్రచురించింది. 'కార్పొరేట్‌ కళాశాల విద్యార్థుల ఆత్మహత్యలు - ప్రభుత్వ వైఫల్యాలు, నివారణ చర్యలు' అంశంపై ఆదివారం విజయవాడలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ విద్యా వ్యవస్థ ఘోర వైఫల్యానికి విద్యార్థుల ఆత్మహత్యలే నిదర్శనమని విమర్శించినట్లు పేర్కొంది. దేశంలో పలుచోట్ల కార్పొరేట్‌ సంస్థలతో ప్రభుత్వం కుమ్మక్కయిందని.. ఫలితంగా విద్యార్థుల హక్కులకు భంగం వాటిల్లుతోందని ఆయన తప్పుపట్టినట్లు 'ఈనాడు' కథనం తెలిపింది.

Image copyright TSPSC/Facebook

తెలంగాణ గ్రూప్ 1 టాపర్లలో ముగ్గురు మహిళలు

టీఎస్‌పీఎస్‌సీ శనివారం ప్రకటించిన గ్రూప్‌-1 ఫలితాల్లో టాప్‌-10లో మొదటి ర్యాంకు సహా ముగ్గురు మహిళలు ఉన్నారని 'సాక్షి' కథనం ప్రచురించింది. రంగారెడ్డి జిల్లా హైదర్‌నగర్‌కు చెందిన ఆర్‌డీ మాధురి గ్రూప్‌-1లో అత్యధిక స్కోర్‌తో మొదటి ర్యాంకర్‌గా నిలిచి డిప్యూటీ కలెక్టర్‌ పోస్టుకు ఎంపికయ్యారని పేర్కొంది. 2011లో జారీ చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించిన మెయిన్‌ పరీక్షలను, ఇంటర్వ్యూలను ఇటీవల పూర్తి చేసిన టీఎస్‌పీఎస్సీ 127 పోస్టుల్లో 121 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసిందని.. అభ్యర్థుల వయస్సు, సామాజిక వర్గం, పోస్టుల రోస్టర్‌ పాయింట్ల ఆధారంగా సర్వీసులను టీఎస్‌పీఎస్సీ కేటాయించిందని 'సాక్షి' వివరించింది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)