వినోద్ కాంబ్లీ క్రీడా జీవితం: ఓ హిట్ వికెట్

  • దినేశ్ ఉప్రీతీ
  • బీబీసీ ప్రతినిధి
వినోద్ కాంబ్లీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

వినోద్ కాంబ్లీ

•స్కూల్ క్రికెట్‌లో సచిన్‌తో కలసి 664 పరుగులు. అందులో 349 స్కోర్ తనదే.

•తొలి బంతికే సిక్సర్‌ బాది రంజీ ట్రోఫీలోకి ఎంట్రీ.

•టెస్ట్ మ్యాచ్‌లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన రికార్డు.

•21 ఏళ్లకు భారత టీంలో చోటు, కేవలం 14 మ్యాచ్‌లతోనే ముగిసిన కెరీర్.

•షేన్ వార్న్ వేసిన ఒక ఓవర్‌లో 22 పరుగులు బాదిన మొదటి బ్యాట్స్‌మెన్.

•23 ఏళ్లకే ముగిసిన అంతర్జాతీయ క్రికెట్ ప్రస్థానం.

అబ్బురపరిచే ఈ అంకెలన్నీ ఎవరివో కావు, అత్యంత ప్రతిభావంతుడైన ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌గా పేరున్న వినోద్ కాంబ్లీవి.

దాదాపు 17 ఏళ్ల కిందట వినోద్ కాంబ్లీ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.

29 అక్టోబర్ 2000లో షార్జాలో శ్రీలంకతో తలపడిన భారత్ జట్టుకు ఆ మ్యాచ్ ఓ చేదు జ్ఞాపకం.

శ్రీలంక బౌలర్ల ధాటికి భారత బ్యాట్స్‌మెన్ అంతా కుప్పకూలారు. జట్టు మొత్తం కలసి కేవలం 54 పరుగులే చేసింది.

కాంబ్లీ ఆ మ్యాచ్‌లో 3 పరుగులు మాత్రమే చేశాడు. సచిన్‌, సౌరవ్, యువరాజ్ సింగ్ కూడా అదే వ్యక్తిగత స్కోరుతో వెనుదిరిగారు. రాబిన్ సింగ్ ఒక్కడే పది పరుగులు దాటాడు.

అప్పటికే జట్టులోకి వస్తూ, పోతూ ఉన్న కాంబ్లీ ఆ మూడు పరుగులతోనే తన అంతర్జాతీయ క్రికెట్‌కు ముగింపు పలకాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, TWITTER

ఫొటో క్యాప్షన్,

సచిన్‌తో వినోద్ కాంబ్లీ

అంతర్జాతీయ క్రికెట్‌లో మెరుపులా వచ్చి అంతర్ధానమైన చాలా మంది క్రికెటర్ల గురించి చదివే ఉంటాం. కానీ, కాంబ్లీ కథ మాత్రం కాస్త భిన్నమైంది.

దిగ్గజ క్రికెటర్ సచిన్‌తో తరచూ కాంబ్లీని పోల్చుతుంటారు. వీళ్లిద్దరూ స్కూల్ రోజుల నుంచి క్రికెట్ భాగస్వాములు.

స్కూల్ డేస్‌లో వీళ్లిద్దరూ కలసి ఒక మ్యాచ్‌లో 664 పరుగులు చేశారు. అప్పుడు కేవలం 15 ఏళ్లున్న సచిన్ 326 పరుగులు చేయగా, 349 పరుగులు చేసి కాంబ్లీ (16) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ ఒక్క మ్యాచ్‌తో వీరిద్దరి పేర్లు క్రికెట్ ప్రపంచంలో మారుమోగాయి.

అయితే చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఏంటంటే ఆ రికార్డు మ్యాచ్‌లోనే కాంబ్లీ బౌలర్‌గానూ రాణించాడు. కేవలం 37 పరుగులిచ్చి 6 వికెట్లు కూడా తీశాడు. ఈ కారణంతోనే వాళ్ల కోచ్ రమాకాంత్ అచ్రేకర్ కూడా సచిన్ కంటే కాంబ్లీనే ప్రతిభావంతుడని భావించేవారు.

కానీ, అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాక మాత్రం కాంబ్లీ క్రీడాజీవితం మూణ్ణాళ్ల ముచ్చటగానే ముగిసింది.

తన క్రీడాజీవితం నాశనం అవడానికి కెప్టెన్, సహచరులు, క్రికెట్‌ బోర్డు కారణమని కాంబ్లీ నమ్ముతుంటాడు. రాజకీయాలు, పక్షపాతవైఖరి కారణంగానే తనకు జాతీయ జట్టులో చోటురాకుండా పోయిందని ఆరోపిస్తుంటాడు.

అయితే క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. కాంబ్లీ వ్యవహార శైలే అతడి క్రీడాజీవితానికి ముగింపు పలికిందనేది వారి విశ్లేషణ.

ఫొటో సోర్స్, Getty Images

బౌన్సర్లను ఎదుర్కోవడంలో తడ'బ్యాటు'

అంతర్జాతీయ క్రికెట్‌కు అనుగుణంగా కాంబ్లీ తన ఆట తీరును మార్చుకోలేదు. 1994 ‌లో కొట్నీ వాల్ష్ వేసిన బౌన్సర్లను అతడు ఎదుర్కోలేకపోయాడు. బౌన్సర్లను ఎదుర్కోవడం కాంబ్లీకి విప్పలేని పజిల్‌గా మారింది.

'కాంబ్లీకి ఏం చేయాలో తెలియలేదు. అప్పటి వరకు అతడి టాలెంటే అతడి అన్ని సమస్యలను పరిష్కరిస్తూ వచ్చింది' అని క్రికెట్ విశ్లేషకుడు హర్ష భోగ్లే చెప్పారు.

'వేగవంతమైన బంతులను ఎదుర్కొనేటప్పుడు కాంబ్లీ భుజాలను లేపేవాడు. కనీసం అలాంటి బంతులను కట్ చేయడానికి కూడా ప్రయత్నించలేదు. ఇలాంటివే టెస్టు క్రికెట్‌లో అతడు చోటు దక్కించుకోకుండా చేశాయి.' అని భోగ్లే పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

హర్షభోగ్లే

'అవసరమైనప్పుడు సచిన్ ఆదుకోలేదు'

1995‌లో కాంబ్లీ తన చివరి అంతర్జాతీయ వన్డే ఆడాడు. అప్పటికే 9 సార్లు జాతీయ జట్టుకు వస్తూ, పోతూ ఉన్నాడు. కానీ, సచిన్‌లా జట్టులో సుస్థిర స్థానం సంపాదించలేకపోయాడు.

2009‌లో ఓ రియాలిటీ షోలో కాంబ్లీ మాట్లాడుతూ, 'టీం ఇండియాలో వివక్ష ఉంది. కష్టకాలంలో సచిన్ నాకు సహాయం చేయలేదు' అని చెప్పాడు.

ఈ షోలో పాల్గొన్నందుకు కాంబ్లీకి రూ. 10 లక్షలు వచ్చాయని వార్తలొచ్చాయి. ఈ కార్యక్రమం తర్వాత కాంబ్లీ వివరణ ఇస్తూ.. 'నాకు అతని (సచిన్) అవసరం వచ్చినప్పుడు అతను సహాయం చేయలేదు. అదే రియాలిటీ షోలో చెప్పాను' అని పేర్కొన్నాడు.

ఫొటో సోర్స్, YOUTUBE GRAB/ SACH KA SAAMNA

ఫొటో క్యాప్షన్,

రియాలిటీ షో‌లో మాట్లాడుతున్న కాంబ్లీ

సచిన్ వీడ్కోలు ప్రసంగంలో కాంబ్లీ పేరు లేదు

అప్పటి నుంచి సచిన్, కాంబ్లీల మధ్య దూరం పెరిగింది. 2013‌లో సచిన్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పినప్పుడు చేసిన ప్రసంగంలో కాంబ్లీ పేరును కూడా ప్రస్తావించలేదు. తమ స్నేహం చెదిరిపోవడంపై అందరూ వ్యాఖ్యానించడం కాంబ్లీని కూడా ఆశ్చర్యపరిచింది.

'ఆ రోజు సచిన్ నా పేరు ప్రస్తావించకపోవడం చాలా బాధించింది. చాలా మంది పేర్లను ఆ రోజు సచిన్ ప్రస్తావించాడు. కానీ, స్కూల్ డేస్‌లో మేం చేసిన వరల్డ్ రికార్డు గురించి చెప్పనే లేదు. ఆ ఇన్నింగ్స్ తర్వాతే ప్రపంచం మమ్మల్ని గుర్తించింది.'

'మరో బాధాకర విషయం ఏంటంటే సచిన్ తన వీడ్కోలు పార్టీకి చాలా మంది సహచరులను కుటుంబంతో సహా ఆహ్వానించాడు. నన్ను మాత్రం పిలువలేదు. దానికి నా మనసు గాయపడింది. నేను సచిన్ జీవితంలోనే కాదు వాళ్ల ఇంట్లోనూ భాగం. మంచి చెడులెన్నింటినో కలిసి అనుభవించాం. అతను ఇప్పుడు నన్ను మరిచిపోయి ఉంటాడని అనుకుంటున్నా' అని కాంబ్లీ చెప్పాడు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

వినోద్ కాంబ్లీ సచిన్‌ల మాటామంతీ

మా ఇద్దరి మధ్య అక్కడ తేడా ఉంది: సచిన్

కాంబ్లీ వ్యాఖ్యలపై సచిన్ ఎప్పుడూ పెద్దగా స్పందించలేదు. అయితే, 2014 ‌లో ఆంగ్ల దినపత్రిక టెలిగ్రాఫ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సచిన్ మాట్లాడుతూ, 'నాకు, కాంబ్లీకి ఒక విషయంలో చాలా వైరుధ్యముంది. మా ఇద్దరి జీవనశైలి వేర్వేరు' అని చెప్పాడు.

'నేను టాలెంట్‌ గురించి మాట్లాడటం లేదు. అతని జీవన విధానం వేరు. నా తీరు వేరు. మేం వేర్వేరు నేపథ్యాల నుంచి వచ్చాం. భిన్నమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు నేను ఒకలా, తను మరోలా వాటిని ఎదుర్కొన్నాడు. మా ఇంట్లో వాళ్ల దృష్టి ఎప్పుడూ నామీదే ఉండేది. అందుకే నా కాళ్లెప్పుడు భూమ్మీదే ఉండేవి.' అని చెప్పాడు.

ఫొటో సోర్స్, Getty Images

కపిల్ ఏమన్నాడంటే...

మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కూడా 2016లో పుణెలో జరిగిన ఓ కార్యక్రమంలో సచిన్, కాంబ్లీల జీవన శైలి గురించి చెప్పుకొచ్చారు. కాంబ్లీ లైఫ్‌ స్టైలే అతడి క్రికెట్ జీవితం ముగియడానికి కారణమని ఆయన విశ్లేషించారు.

'సచిన్, కాంబ్లీలు ఒకేసారి క్రికెట్ ఆడటం మొదలుపెట్టారు. సచిన్ కంటే కాంబ్లీనే ఎక్కువ ప్రతిభావంతుడు. కానీ, అతడి సన్నిహితులు, అతడు పెరిగిన వాతావరణం సచిన్‌తో పోల్చితే భిన్నమైనవి. తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. సచిన్ 24 ఏళ్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడితే కాంబ్లీ మాత్రం అంచనాలను అందుకోలేక తన క్రీడా జీవితానికి త్వరగానే ముగింపు పలికాడు' అని కపిల్ చెప్పారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)