శివబాలాజీ కుటుంబ సభ్యులపై అసభ్య వ్యాఖ్యలు, పోలీసులకు ఫిర్యాదు

  • 30 అక్టోబర్ 2017
శివబాలాజీ Image copyright facebook/shivabalaji
చిత్రం శీర్షిక భార్య మధుమితతో శివబాలాజీ

తమ కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అసభ్య వ్యాఖ్యలు చేసిన వారిపై చర్య తీసుకోవాలంటూ సినీనటుడు, తెలుగు బిగ్ బాస్ విజేత శివబాలాజీ పోలీసులను ఆశ్రయించారు.

దీనిపై ఆయన సైబరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై శివబాలాజీ బీబీసీకి ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ "ఇటీవల యూట్యూబ్‌లో నా కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన వ్యాఖ్యలు పోస్టు చేశారు. దీనిపై నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను" అని చెప్పారు.

"2012 నుంచి ఇలాంటి కామెంట్లు నాపై చేస్తూనే ఉన్నారు. గతంలో కూడా నా మీద ఫేస్‌బుక్‌లో వ్యక్తిగత దూషణలు చేసిన వారిపై చర్య తీసుకోవాలని పోలీసులను కోరాను" అని తెలిపారు. ఆయన ఒక సినిమా సెట్స్‌పై సెల్ఫీ తీసి ఫేస్‌బుక్‌పై పోస్ట్ చేయగా కొందరు అసభ్యకరమైన కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.

పోరాడితేనే దారికొస్తారు..

ఇటీవల సోషల్ మీడియాలో సెలబ్రిటీలను, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని అసభ్యకరమైన కామెంట్లు చేసే ధోరణి బాగా పెరిగింది. శివబాలాజీ దీనిపై మాట్లాడుతూ, "సినిమా పరిశ్రమలో చాలా మంది ఇలాంటి అసభ్యకరమైన దూషణలకు గురవుతున్నారు. అయితే ఎక్కువ మంది దీని పట్ల మౌనంగానే ఉండిపోతున్నారు. వారికి దీటుగా జవాబివ్వడం లేదా పోలీసులకు ఫిర్యాదు చేయడం లాంటివి చేయడం లేదు. అందుకే ఇలాంటి వారు మరింత రెచ్చిపోతున్నారు" అని అన్నారు.

"ఇలాంటి వాటిపై మనం ప్రతిస్పందించకపోవడం వల్లే వారు మరింత రెచ్చిపోతున్నారు. వర్చువల్ ప్రపంచంలో సెలబ్రిటీల మీదైనా, ఎవరి మీదైనా ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెట్టడం చాలా సులువై పోయింది. దీన్ని అరికట్టడానికి కచ్చితంగా పోరాడాల్సిందే" అని శివబాలాజీ అన్నారు.

Image copyright facebook/shivabalaji
చిత్రం శీర్షిక శివబాలాజీ కుటుంబ సభ్యులు

ఇలాంటి వ్యక్తులపై తగిన చర్యలు తీసుకుంటేనే అలాంటి ఉద్దేశాలున్న ఇతరులు కూడా దారికి వస్తారని శివబాలాజీ అభిప్రాయపడ్డారు.

"ఇలాంటి వ్యాఖ్యలు నా మానసిక స్థైర్యాన్ని ఏమీ దెబ్బతీయవు. నేను ఎలాంటి తప్పూ చేయలేదు. అలాంటప్పుడు సోషల్ మీడియాలో నాపై ఇతరులు చేసే వ్యాఖ్యలను ఎందుకు భరించాలి? అందుకే దీనిపై చర్య తీసుకోవాలని పోలీసులను కోరాను" అని ఆయన వెల్లడించారు.

అసభ్య కామెంట్లపై శివబాలాజీ తమకు ఫిర్యాదు చేశారని, కేసును దర్యాప్తు చేస్తున్నామని సైబరాబాద్ అసిస్టెంట్ కమిషర్ ఆఫ్ పోలీస్ ఎస్.జయరాం బీబీసీకి తెలిపారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)