హైదరాబాద్: 12 ఏళ్లకే నరకం చూపించారు

  • దివ్య ఆర్య, దీప్తి బత్తిని
  • బీబీసీ న్యూస్ ప్రతినిధులు
ముస్లిం యువతి

హైద‌రాబాద్ అమ్మాయిల జీవితాల‌తో అరబ్ దేశాల మ‌గ‌వారు చెల‌గాటం ఆడుతున్నారు. డ‌బ్బు కోసం కొంద‌రు పేద ముస్లింలు త‌మ మైనర్ కుమార్తెలను అర‌బ్ ధ‌న‌వంతుల‌కు క‌ట్ట‌బెడుతున్నారు.

ఫ‌ర్హీన్ సైన్స్ చ‌దువుకుని న‌ర్స్ కావాల‌నుకుంది. కానీ ఆమెకు 13 ఏళ్ళ వ‌య‌సులోనే జోర్డాన్‌కి చెందిన 55 ఏళ్ళ వ్య‌క్తికిచ్చి పెళ్ళి చేశారు.

ఒక‌ రోజు ఫ‌ర్హీన్ తండ్రి ఆమెను ఒక గ‌దిలోకి తీసుకెళ్లి ముగ్గురు మ‌గ‌వాళ్ల‌కు చూపించాడు. ఆ సాయంత్ర‌మే ఆ ముగ్గురిలో ఒక‌రిని పెళ్లి చేసుకోవాల‌ని తండ్రి చెప్పాడు.

"నేను గ‌ట్టిగా ఏడ్చాను, ఇంకా చ‌దువుకోవాల‌ని ఉంద‌ని చెప్పాను. ఎవ‌రూ విన‌లేదు" అంది ఫ‌ర్హీన్.

ఆమె త‌ల్లి ఫ‌ర్హీన్‌ని పెళ్లి కూతురిలా త‌యారు చేసింది. పెళ్లి చేసినందుకు ఆ అర‌బ్ వ్య‌క్తి రూ. 25 వేలు ఇస్తున్నాడనీ, అది కాక నెలా నెలా రూ. 5 వేలు ఇస్తాడని కూతురితో చెప్పింది త‌ల్లి.

ఈ హైద‌రాబాదీ బాలిక‌కు, అర‌బ్ పెద్ద మ‌నిషికి ఖాజా ద‌గ్గ‌రుండి పెళ్ళి చేశారు.

వీడియో క్యాప్షన్,

వీడియో: ‘నాన్న నన్ను పాతిక వేలకు అమ్మేశారు’

‘నేను ఏడుస్తుంటే రేప్ చేశాడు...‘

వాళ్ళు ఏకాంతంగా ఉన్న‌ప్పుడు మొద‌టిసారి ఫ‌ర్హీన్ అత‌ణ్ని చూసింది. త‌న‌కంటే దాదాపు నలభై ఏళ్లు పెద్ద వాడ‌ని అప్పుడే గుర్తు ప‌ట్టింది.

"ఆ రాత్రి నేను ఏడుస్తుంటే, అత‌ను బ‌ల‌వంతం చేశాడు. మూడు వారాల పాటు న‌న్ను రేప్ చేశాడు’’ అని గుర్తు చేసుకుంది ఫ‌ర్హీన్.

ఆ త‌రువాత ఫ‌ర్హీన్‌ని త‌న‌తో పాటు జోర్డాన్ వ‌చ్చి అక్క‌డ త‌న ఇత‌ర భార్య‌లు, పిల్ల‌ల బాగోగులు చూసుకోవాలని అత‌డు చెప్పాడు. అత‌డికి అంత‌కు ముందే పెళ్ల‌యిన‌ట్లు ఫ‌ర్హీన్‌కు తెలియదు. తాను జోర్డాన్ రాన‌ని చెప్పేసింది.

దీంతో అత‌డు ముందు జోర్డాన్ వెళ్లిపోయి, త‌రువాత ఫ‌ర్హీన్‌కి వీసా పంపించేలా రాజీ కుదిరింది.

కానీ వీసా ఇప్ప‌టికీ రాలేదు. ఫ‌ర్హీన్‌కి పెళ్లయి ఒంట‌రిగానే ఉంటోంది. ఆమె భ‌ర్త ఎక్క‌డున్నాడో ఆమెకి తెలీదు.

‘నన్నే నిందిస్తున్నారు...‘

"నేనిప్పుడు ఏడ‌వ‌డం లేదు. మౌనంగానే ఉంటున్నా. ఈ అర్థంలేని బ‌తుకు చాలించాల‌నుకున్నా. నా క‌న్న‌వారే న‌న్ను మోసం చేశారు" అంది ఫ‌ర్హీన్.

ఇది జ‌రిగి ఎనిమిదేళ్లు అవుతోంది. కానీ ఫ‌ర్హీన్‌ను ఇంకా ఆ భ‌యం వెంటాడుతూనే ఉంది. అందుకే ఆమె న‌న్ను (బీబీసీ ప్ర‌తినిధి) తాను టీచ‌ర్‌గా ప‌నిచేస్తున్న ఎన్‌జీఓ ఆఫీసులో మాత్ర‌మే క‌ల‌వ‌డానికి ఒప్పుకుంది.

"ముస‌లివాడిని పెళ్లి చేసుకున్నాన‌ని కొంద‌రు చుట్టాలు ఎగ‌తాళి చేశారు. ఇంకొంద‌రైతే మా ఆయ‌న కోర్కెలు తీర్చ‌లేక‌పోయాననీ అందుకే వదిలేశాడ‌నీ నా ముందే అన్నారు" అని ఫ‌ర్హీన్ చెప్పుకొచ్చింది.

మూడేళ్ల‌లో తెలంగాణ పోలీసులు న‌మోదు చేసిన 48 కేసుల్లో ఫ‌ర్హీన్ కేసు ఒక‌టి.

వారిని భారత్ రప్పించే అవకాశాలు చాలా తక్కువ

ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు న‌మోదు చేశారు. బ్రోక‌ర్లు అరెస్ట‌య్యారు కానీ, పెళ్లిళ్లు చేసుకునే వారు భార‌తీయులు కాక‌పోవ‌డంతో వారిని అరెస్టు చేయ‌డం సాధ్యం కాదు.

"మామూలుగా బాధితులు మా ద‌గ్గ‌ర‌కు రారు. మా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే వాళ్ళు కూడా అర‌బ్ మ‌గ‌వాళ్లు వీరిని వ‌దిలేసి, త‌మ సొంత దేశం పారిపోయాకే మా ద‌గ్గ‌ర‌కు వ‌స్తారు. ఇదే మాకు పెద్ద స‌వాల్. దీంతో మేం విదేశాంగ శాఖ‌ను ఆశ్ర‌యించాలి. అప్పుడు కూడా వారిని భార‌త‌దేశానికి ర‌ప్పించే అవ‌కాశాలు చాలా త‌క్కువ‘‘ అని చెప్పారు హైద‌రాబాద్ ద‌క్షిణ మండ‌ల డీసీపీ వి.స‌త్య‌నారాయ‌ణ‌.

ఇది చాలా బ‌ల‌మైన నేర‌స్తుల ముఠా అని పోలీసులు చెప్తున్నారు. దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో న‌కిలీ పెళ్లి స‌ర్టిఫికెట్లు త‌యారు చేసే బ్రోక‌ర్లు ఈ వ్య‌వ‌హారంలో ఉన్నార‌ని వారంటున్నారు. హైద‌రాబాద్‌లోని ఇరుకు ఇళ్ల‌ల్లో ర‌హ‌స్యంగా జ‌రిగే బాల్య వివ‌ాహల‌కు చ‌ట్ట‌బద్ధత క‌ల్పించే స‌ర్టిఫికెట్లు వీళ్లు త‌యారు చేస్తార‌ని చెప్తున్నారు.

ఈ సెప్టెంబ‌రులో ఇద్ద‌రు 80 ఏళ్ల‌కు పైబ‌డిన వృద్ధుల‌తో స‌హా 8 మంది అర‌బ్ షేక్‌ల‌ను, 35 మంది మ‌ధ్య‌వ‌ర్తుల‌ను పోలీసులు అరెస్టు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images

బలవుతోంది బాలికలే...

కానీ అస‌లు న‌మోదు కాని కేసులు చాలా ఎక్కువ‌. అమ్మాయిలంతా 12 నుంచి 17 ఏళ్ల వారే కావ‌డం దీనికి ఒక కార‌ణం అంటారు హ‌క్కుల కార్య‌కర్త‌లు.

త‌బుస్సమ్ అనే అమ్మాయికి 70 ఏళ్ల వ్య‌క్తితో పెళ్ల‌య్యే నాటికి ఆమె వ‌య‌సు కేవ‌లం 12 సంవ‌త్స‌రాలే! ఆమెను పెళ్లి చేసుకున్న వ్య‌క్తి హోటల్‌కి తీసుకెళ్లి లైంగికంగా హింసించాడు. త‌రువాత వీసా పంపుతాన‌ని చెప్పి ఆమెను ఇంటికి పంపేశాడు. ఆ త‌రువాత ఏడాది త‌బుస్స‌మ్ ఒక పాప‌కు జ‌న్మ‌నిచ్చింది. కానీ ఆ పాప‌ను త‌బుస్స‌మ్‌కి చెల్లి అని చెప్పి పెంచారు.

"నా క‌న్న కూతురు న‌న్ను అక్కా అని పిలిచిన ప్ర‌తిసారీ నా గుండె త‌రుక్కుపోతుంది. ఆమె న‌న్ను అమ్మీ అని పిలిస్తే వినాల‌ని ఎదురుచూస్తున్నాను" అని చెప్పింది త‌బుస్స‌మ్.

ఈ పెళ్లిళ్లు చేసుకునే వాళ్లు ఎక్కువ‌గా ఒమ‌న్, ఖ‌తార్, సౌదీ అరేబియా, యెమ‌న్ నుంచి వ‌స్తారు.

ఫోన్‌లో పెళ్లి చేసుకుని.. విమానంలో రప్పించుకుని...

కొన్ని పెళ్లిళ్ల‌లో అయితే షేక్‌లు భార‌త‌దేశానికి రావ‌ల్సిన ప‌నే ఉండ‌దు. 15 ఏళ్ల జెహ్రా విష‌యంలోనూ అదే జ‌రిగింది. జెహ్రా త‌న అమ్మ‌మ్మ‌తో క‌లిసి ఉంటుంది. త‌ల్లిదండ్రులు లేరు.

జెహ్రాకు తెలియ‌కుండా ఆమె ఫొటోను సోష‌ల్ మీడియాలో పెట్టి ఆమెను అమ్మేసే ప్ర‌య‌త్నం చేసింది ఆమె పిన్ని.

"అదే రోజు రాత్రికి ఖాజీ ఆమె ఇంటికి వ‌చ్చి ఫోన్‌లో నిఖా జ‌రిపించేశాడు. నాకు పెళ్ల‌వుతోంద‌న్న విష‌యం కూడా నాకు తెలియ‌దు" అంది జెహ్రా.

ఆ పెళ్లి జ‌రిగిన కొన్ని రోజుల‌కే ఆమెకు యెమ‌న్ వీసా వ‌చ్చింది. ఒక 65 ఏళ్ల వ్య‌క్తి ఆమెను విమానాశ్రయం నుంచి హోటల్‌కి తీసుకెళ్లాడు. తానే ఆమె భ‌ర్త‌న‌ని చెప్పాడు. ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ త‌రువాత మళ్లీ పిలిపిస్తానంటూ హైద‌రాబాద్ తిప్పి పంపేశాడు.

సమిధలవుతున్న పేద కుటుంబాల బాలికలు

ఫ‌ర్హీన్, జెహ్రా వంటి ఎంద‌రో అమ్మాయిలు ‘భ‌ర్తలు వ‌దిలేసి‘ ఏ జీవనాధారం లేకుండా ఉన్నారు. జ‌మీలా నిషాత్ ఇటువంటి మ‌హిళ‌ల‌కు స‌హాయం అందించ‌డం కోసం 'షాహీన్' అనే స్వ‌చ్ఛంద సంస్థ‌ను ప్రారంభించారు.

తాను చూసిన ఉదంతాల్లో మూడో వంతు కుటుంబాలు త‌మ ఇంటి ఆడ‌పిల్ల‌ల‌ను డ‌బ్బుకోసం పెళ్లి చేసి పంపేశారు.

"వారిలో చాలా కుటుంబాలు ఎంతో పేద‌రికంలో ఉంటాయి. వారి పిల్ల‌లు బ‌ళ్ల‌లో పెట్టే మ‌ధ్యాహ్న భోజ‌నంపై ఆధార‌ప‌డ‌తారు" అని చెప్పారు జమీలా.

తాము డ‌బ్బుకోసం ఇదంతా చేశామ‌ని త‌ల్లిదండ్రులు ఒప్పుకోరు. ఇది ఎంతో దారుణ‌మైన ప‌రిస్థితి.

ఇద్దరు స్నేహితుల కన్నీటి కథ...

రుబియా, సుల్తానా అనే చిన్ననాటి స్నేహితుల క‌థ అయితే గుండెల్ని పిండేస్తుంది. వాళ్లిద్ద‌రికీ పెళ్ల‌యింది. కానీ ఆ తరువాతే తెలిసింది. వాళ్లిద్ద‌రూ చేసుకుంది ఒక‌ర్నే అని. 78 ఏళ్ల ఒమ‌న్ వ్య‌క్తిని చేసుకునే నాటికి రుబియా వ‌య‌సు 13 ఏళ్లు.

"అత‌ను న‌న్నూ, నా స్నేహితురాలినీ వ‌దిలేశాడు. వారాల తర‌బ‌డి అత‌ని గురించి స‌మాచారం లేదు. చివ‌ర‌కు నా స్నేహితురాలు ఆత్మ‌హ‌త్య చేసుకుంది" అని ఏడుస్తూ చెప్పింది రుబియా.

ఇస్లామిక్ పండితుడు ముఫ్తి హ‌ఫీజ్ అబ్రార్ ఈ పెళ్లిళ్ల‌ను వ్య‌భిచారంగా వ‌ర్ణించారు.

"ఇలాంటి పెళ్లిళ్లు చేసే ఖాజీలు ఇస్లాం మ‌తానికీ, ముస్లింల‌కు చెడ్డ పేరు తీసుకువ‌స్తున్నార‌ు" అని ఆయ‌న విమ‌ర్శించారు.

మసీదుల సహకారం అవసరం...

ఇలాంటి పెళ్లిళ్లు ఆప‌డానికి మ‌సీదుల నుంచి స‌హ‌కారం కావాల‌ని తెలంగాణ బాల‌ల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ అధికారి ఇంతియాజ్ అలీ ఖాన్ పేర్కొన్నారు.

"ప్రార్థ‌న‌లతో పాటు.. ఇటువంటి పెళ్లిళ్ల‌కు వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేయాల‌ని మేం మసీదుల‌ను కోరాం" అని ఆయన చెప్పారు.

ఫ‌ర్హీన్, జెహ్రా, రుబియా, త‌బుస్సమ్ వంటి ఎంద‌రో అమ్మాయిల‌కు ఇది చిరు ఆశ క‌ల్పిస్తోంది. ఏదో ఒక‌ రోజు స‌మాజం.. ఆడ‌పిల్ల‌ను బొమ్మ‌లా చూడ‌డం మానేసి, ఆడ‌పిల్ల చ‌దువుకు విలువ ఇస్తుంద‌ని ఫ‌ర్హీన్ ఆశ‌ప‌డుతోంది.

"నా తల్లితండ్రులు ఇప్పుడు బాధ‌ప‌డుతున్నారు. వారి చేసిన త‌ప్పు తెలుసుకున్నారు. కానీ ఈ విష‌యాన్ని అంద‌రూ అర్థం చేసుకుని, త‌మ ఆడ‌పిల్ల‌ల‌కు డ‌బ్బుకోసం పెళ్లిళ్లు చేయ‌డం మాని చ‌దివించాలి" అన్నది ఆమె ఆకాంక్ష.

* క‌థ‌నంలో ఉన్న బాధిత అమ్మాయిల పేర్లు మార్చాం.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)