తమిళనాడు: ప్రాణాలు తీస్తున్న అధిక వడ్డీలు

  • 31 అక్టోబర్ 2017
గోపి
చిత్రం శీర్షిక ఏసకిముత్తు చనిపోయాడని పాలయంకొట్టి జనరల్ ఆసుపత్రి ప్రకటించిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్న అతని తమ్ముడు గోపి.

తమిళనాడుకు చెందిన ఏసకిముత్తు, భార్య సుబ్బులక్ష్మి ఇద్దరు కూతుళ్లతో కలసి తిరునెల్వేళి జిల్లా కలెక్టరేట్‌లో నిప్పంటించుకొని సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారు. మూడు రోజుల కిందట జరిగిన ఈ ఘటనను తమిళనాడులోని టీవీ చానెళ్లు ప్రత్యక్ష ప్రసారం చేశాయి.

కాలిన గాయాలతో ఉన్న ఏసకిముత్తు చిన్న కూతురు, అమ్మ వద్దకు నెమ్మదిగా వెళ్తున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

"ఏసకిముత్తు భార్య అరుపులు విన్నప్పుడు షాక్‌కి గురయ్యాం. వారు మంటల్లో కాలుతున్నప్పుడు మేము అక్కడే ఉన్నాం. చూస్తుండగానే అంతా జరిగిపోయింది. అక్కడ నీళ్లు కూడా లేవు. మంటలార్పేందుకు వారిపై ఇసుక వేయడం తప్ప ఏమీ చేయలేకపోయాం" అని మీడియా ప్రతినిధి ఎన్.అరుణ్ ఓలి తెలిపారు. ఘటన సమయంలో అతను కలెక్టరేట్‌ దగ్గరే ఉన్నారు.

వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీలతో పీడించడం వల్లే ఏసకిముత్తు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

'మా అన్న వడ్డీ వేధింపులు భరించలేక కలెక్టరేట్‌లో 6 సార్లు ఫిర్యాదు చేశారు. అయినా ఎవరూ స్పందించలేదు.' అని ఏసకిముత్తు సోదరుడు గోపి తెలిపారు.

అయితే, జిల్లా యంత్రాంగం మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేసింది.

"ఏసకిముత్తు ఆరు నెలలుగా తిరునెల్వేళిలోనే లేరు. అధికారులు అతని ఇంటికి విచారణకు వెళితే ఏసకిముత్తు లేడని కుటుంబసభ్యులు చెప్పారు. నెల కిందట ముత్తులక్ష్మి అనే మహిళ తన దగ్గర అప్పు తీసుకున్నవారు తిరిగి ఇవ్వడం లేదని మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, ఆమె అధిక వడ్డీ వసూలు చేస్తూ తమను వేధిస్తోందని ఏసకిముత్తు ఆరోపించారు." అని జిల్లా కలెక్టరు సందీప్ నందూరి బీబీసీతో అన్నారు.

వడ్డీ వ్యాపారులు వేధిస్తే తమకు ఫిర్యాదు చేయాలని కూడా జిల్లా యంత్రాంగం హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది.

"కేవలం రెండు రోజుల్లోనే 200 ఫిర్యాదులు వచ్చాయి. ఇతర జిల్లాల నుంచి కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. తిరునెల్వేళిలో వడ్డీ వ్యాపారుల వేధింపులు అత్యధికంగా ఉన్నాయనే ప్రచారం ఉంది. వడ్డీ వ్యాపారులు వేధిస్తున్నారని వచ్చే ఫిర్యాదులను మేం తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఈ సమస్య కేవలం తిరునెల్వేళిలోనే లేదు." అని కలెక్టర్ తెలిపారు.

చిత్రం శీర్షిక తిరునెల్వేళి జిల్లాలోని పాలయంకొట్టి జనరల్ ఆసుపత్రి.

ప్రభుత్వం తమ ఫిర్యాదులను పట్టించుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటామని బాధితులు చెబుతున్నారు. ఒకవైపు ఇచ్చిన అప్పుకన్నా ఎక్కువ వడ్డీ వసూలు చేస్తూ వ్యాపారులు వేధిస్తున్నారని బాధితులంటుంటే, మరోవైపు తీసుకున్న అప్పు తీర్చడం లేదని వడ్డీ వ్యాపారులు ఫిర్యాదు చేస్తున్నారని స్థానిక మీడియా కొన్ని కథనాలు ప్రసారం చేసింది.

పోలీసులపై ఆరోపణలు!

వడ్డీ వడ్డీ వ్యాపారుల వేధింపులపై పోలీసులు సరిగా వ్యవహరించడం లేదని ఏసకిముత్తు స్వగ్రామం కసితర్మం, ఆ చుట్టపక్కల గ్రామాల్లో ఉండే ప్రజలు బీబీసీతో చెప్పారు.

"నేను రూ. పది వేలు అప్పు తీసుకొని ఇప్పటివరకు రూ.18,500 వడ్డీ కట్టాను. ఇంకా రూ.15,000 ఇస్తేగానీ అప్పు తీరదని వడ్డీవ్యాపారి అంటున్నాడు. " అని ఆరుముగం (35) అన్నారు. వడ్డీ వ్యాపారులకు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేయడం కష్టమేనని చెప్పారు.

సరైన ఉపాధిలేక ఆరుముగం కట్టెలు కొట్టి ఊళ్లో అమ్ముకొని కుటుంబాన్ని పోషిస్తున్నారు. అతను గత నెల మునీర్‌పాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే వడ్డీ వ్యాపారి అతనిపై దాడి చేశాడు.

దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోకుండా, డబ్బులివ్వడం లేదంటూ సబ్ ఇన్‌స్పెక్టర్ తననే తిట్టాడని అర్ముగం ఆరోపించారు.

చిత్రం శీర్షిక తన అన్న మరణానికి అధికారుల ఉదాసీనతే కారణమని వారిపై చర్యలు తీసుకోవాలని ఏసకిముత్తు సోదరుడు గోపి రోడ్డుపై బైఠాయించారు.

భర్త సమయానికి ఇంటికి రాకపోతే తనకు భయమేస్తుందని అర్ముగం భార్య సుబ్బులక్ష్మి తెలిపారు.

"చేతిలో చిల్లిగవ్వలేకపోవడంతో కొన్ని రోజులు నా ముగ్గురు పిల్లలను పస్తులుంచాల్సి వచ్చింది. మా ఆయన డబ్బులు తీసుకొస్తాడని ఎదురుచూశాను. ఆయన రాత్రి 8 తర్వాత కూడా ఇంటికి రాకపోతే ఇంకా భయం వేసింది. వడ్డీ వ్యాపారిపై, పోలీసు అధికారిపై ఫిర్యాదులు చేసినందుకు ఆయనపై ఎవరైనా దాడి చేశారేమోనని భయం వేసింది'' అని ఆమె చెప్పారు.

అయితే, అర్ముగం ఆరోపణలపై మునీర్‌పాలెం సబ్ఇన్‌స్పెక్టర్ మరియప్పన్ స్పందిస్తూ 'ఆ ఈ కేసు విచారణ ముగిసింది. నీనెందుకు అతడిని ఇబ్బంది పెడతాను' అని అన్నారు.

చిత్రం శీర్షిక వడ్డీ వ్యాపారులు తమను వేధిస్తున్నారని, ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించడంలేదని అర్ముగం అతని భార్య సుబ్బలక్ష్మి అంటున్నారు.

"పోలీస్ అధికారిగా నా బాధ్యతను సక్రమంగానే నిర్వర్తించాను. ఆ రోజు పోలీస్‌స్టేషన్‌లో వడ్డీ రేటు గురించి మాట్లాడొద్దని ఇద్దరికీ చెప్పాను'' అని వివరణ ఇచ్చారు.

ప్రైవేట్ సూక్ష్మరుణాల సంస్థ అధిక వడ్డీ పేరుతో తమను వేధిస్తోందని ఫిర్యాదు చేస్తే పోలీసులు తమను దూషించారని సూతమల్లికి చెందిన ఇద్దరు మహిళలు బీబీసీకి తెలిపారు.

'చెల్లించే స్థోమత లేకుంటే అప్పు ఎందుకు'!

"అప్పు తీర్చే స్థోమత లేకుంటే ఫిర్యాదు ఎందుకు చేస్తారని పోలీసులు మమ్మల్ని తిట్టారు. విచారణ సమయంలో మమ్మల్ని గంటకుపైగా నిలబెట్టిన పోలీసులు, ఆ ప్రైవేట్ సూక్ష్మరుణాల సంస్థ ప్రతినిధులను మాత్రం కూర్చొబెట్టి గౌరవించారు. మాతో పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన కొందరు బాధతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.'' అని సుబ్బులక్మి తెలిపారు.

బీబీసీ ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ శక్తికుమార్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన దీనిపై స్పందిస్తూ, "సూతమల్లి పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటాను. ఫిర్యాదుదారులతో గౌరవంగా మాట్లాడాలని సూచిస్తాను,'' అని చెప్పారు.

2014లో వడ్డీ వ్యాపారులపై నమోదైన కేసుల్లో ఐదు శాతం మాత్రమే నేర నిర్ధారణ జరిగి శిక్షలు పడ్డాయని డీజీపీ తెలిపారు.

చిత్రం శీర్షిక తిరునెల్వేళి.

బ్యాంకులు రుణాలు ఎందుకివ్వవు...

పూచికత్తు లేకపోయినా, గడువుతో సంబంధం లేకుండా, సులభంగా అప్పు దొరుకుతుందనే ఆశతోనే అధిక వడ్డీ రేట్లను పట్టించుకోకుండా ప్రజలు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు తీసుకుంటారని తమిళనాడు మాజీ ప్లానింగ్ కమిషన్ సభ్యులు ఆర్. శ్రీనివాసన్ తెలిపారు.

"బ్యాంకుల నుంచి రుణం పొందాలంటే సొంత ఆస్తి గ్యారంటీగా ఉంచాలి. ఒక వ్యక్తి పూచికత్తు ఉండాలి. కానీ, వడ్డీ వ్యాపారి నుంచి అప్పు కావాలంటే ఇవన్నీ అవసరం లేదు. క్షణాల్లో అప్పు దొరుకుతుంది.'' అని ఆయన చెప్పారు.

ఇతర కథనాలు

వడ్డీ మహా దారుణం !

టెంకసికి చెందిన మహరసి (35) ఓ దినసరి కూలీ భార్య. ఆమె ఓ వడ్డీవ్యాపారి వద్ద రూ. 2,000 అప్పు తీసుకుంది. చివరకు వడ్డీ చెల్లించలేక ఇంట్లో ఉన్న ద్విచక్రవాహనాన్నే వదులుకోవాల్సి వచ్చింది.

ఆమె భర్త సుదలయండికి ఎవరూ పూచీకత్తు ఇవ్వకపోవడంతో బ్యాంకులో అప్పు పుట్టలేదు.

"రూ.2000 అప్పుగా తీసుకొని ఇప్పటివరకు రూ. 2,400 వడ్డీగా చెల్లించా. అప్పు తీర్చలేదని వడ్డీ వ్యాపారి ఇంట్లో ఉన్న బైకును తీసుకెళ్లాడు. నా భర్తపై దాడి కూడా చేశాడు.'' అని ఆమె బీబీసీతో చెప్పారు.

చిత్రం శీర్షిక అర్ముగం

అధికారులు వడ్డీ వేధింపులపై చర్యలు తీసుకోకుండా ఉదాసీనంగా ఉన్నారని మాజీ శాసనసభ్యులు దిల్‌బాబు అన్నారు.

"అప్పు తీర్చని కారణంగా లైంగిక వేధింపులకు గురైన దాదాపు 20 మంది మహిళలు నాకు తెలుసు. అయితే, దీనిపై ఫిర్యాదు చేయడానికి వారు ముందుకు రాలేదు. ఈ విషయంలో నేను వారి తరఫున పోరాడాను. వేధింపులుకు పాల్పడిన వడ్డీ వ్యాపారికి నాలుగేళ్ల శిక్షపడింది. కానీ ఆ తర్వాత ఆరు నెలల్లోనే అతను బెయిల్‌పై విడుదలయ్యాడు. కఠిన శిక్షలు పడితేనే ఇలాంటి నేరాలను అరికట్టగలం.'' అని దిల్‌బాబు పేర్కొన్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)