పీడీ : ట్వీట్లు చేసే ఒక మంచి కుక్క!

  • 30 అక్టోబర్ 2017
రాహుల్ గాంధీ Image copyright Getty Images

ఇటీవల ట్విటర్లో రాహుల్ గాంధీ వేసే పంచ్‌లకు నెటిజన్ల నుంచి ఆదరణ బాగా పెరిగింది. సరదాతోపాటు నిశిత విమర్శలు చేస్తూ పోస్ట్ చేసే ఈ ట్వీట్లకు స్పందించే వారి సంఖ్యా పెరిగింది.

అయితే విపక్ష నేతల నుంచి ఒకటే విమర్శలు.. రాహుల్ గాంధీలో ఇంత మార్పు ఎలా వచ్చింది? ఈ ట్వీట్లు చేసేది అసలు రాహులేనా? లేదంటే ఆయన కోసం వేరే ఎవరైనా చేస్తున్నారా?

మరి ఈ సందేహాల్ని అర్థం చేసుకున్నారో ఏమో.. ఈ మార్పు వెనక ఉన్న రహస్యం ఇదీ అంటూ రహస్యం బయటపెట్టారు రాహుల్. అదే పీడీ.. ఆయన పెంపుడు కుక్క. ఆయన వ్యంగ్యం ఇపుడు వైరల్‌గా మారింది.

తన పెంపుడు కుక్క పీడీ వీడియోను ట్విటర్లో ఉంచుతూ చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది.

"రాహుల్ బదులుగా ఎవరు ట్వీట్లు చేస్తున్నారు అని చాలామంది అడుగుతున్నారు.. అందుకే మీ ముందుకొచ్చా. అది నేనే.. పీడీ. చూడండి.. ట్వీట్‌తో నేనేం చేయగలనో.. కాదు కాదు.. ట్రీట్‌తో" అని పోస్ట్ చేసిన ఈ 14 సెకన్ల వీడియో ఇదీ.

Image copyright Twitter

ఇది చూసిన నేతలు సైతం సరదా కామెంట్లతో దాన్ని రీట్వీట్ చేశారు.

కాంగ్రెస్ పార్టీలో సోషల్ మీడియా వ్యవహారాలు చూసే దివ్య ట్వీట్ చూడండి.

‘మీకు ఇప్పుడు తెలిసి ఉంటుంది. దీంతో ఎవరు సరితూగగలరు?’

Image copyright Twitter

రాహుల్ గాంధీ గారు, నాకంటే బాగా ఎవరికి తెలుస్తుంది చెప్పండి.. అస్సాం సమస్యల గురించి సీరియస్‌గా మీతో మాట్లాడుతుంటే మీరేమో పీడీకి ఆహారం పెడుతూ కూర్చోవడం నాకిప్పటికీ గుర్తుంది అని కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన అస్సాం మంత్రి హేమంత్ బిశ్వాస్ ట్వీట్ చేశారు.

Image copyright Twitter

స్మృతి ఇరానీ పాత్రికేయ సమావేశం ఎప్పుడు ఏర్పాటు చేస్తున్నారు అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సంజయ్ ఝా ట్వీట్ చేశారు. రాహుల్‌కి సోషల్ మీడియాలో పాపులారిటీ పెరగడంపై కొద్ది రోజుల క్రితం స్మృతి ఇరానీ విమర్శించారు. ఆయన విదేశాల్లో ఎన్నికలు నెగ్గాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

Image copyright Twitter

బీజేపీ కూడా ఏమీ తగ్గలేదు..

ఐటీ విభాగానికి చెందిన అమిత్ మాలవీయ పీడీ ఫొటోని తీసుకుని హిందీ సినిమా ప్యాడ్‌మాన్ పోస్టర్లో మార్పులు చేసి ‘పీడీమాన్.. తన యజమాని కన్నా తెలివైన కుక్క కథ’ అని పోస్ట్ చేశారు.

Image copyright Twitter

ఇక నెటిజన్ల సంగతి చెప్పనక్కర్లేదు.

పీడీ గాంధీ అనే పేరుతో ట్విటర్లో ఐదారు అకౌంట్లే పుట్టుకొచ్చాయి. వాటిలో ఒకరు.. "గుజరాత్ ఎన్నికల్లో మోదీకి వ్యతిరేకంగా ప్రచారానికి నేను రావాలనుకుంటున్నారు. కానీ ఈ ట్వీట్ చూసిన తర్వాత కూడా ఎన్నికలు కావాలా, నేను ఓట్లడగాలా?" అంటూ సరదాగా ట్వీట్ చేశారు.

Image copyright Twitter

ఇప్పుడు చెప్పండి... కాంగ్రెస్‌ పార్టీలో శక్తిమంతులెవరో...

  1. సోనియా
  2. రాహుల్
  3. పీడీ
  4. పటేల్
  5. ఎంఎంఎస్
  6. ఇతరులు

అని ఓ సరదా ప్రశ్నని సంధించారు రిషి బాగ్రీ అనే ఓ ట్విటర్ యూజర్.

Image copyright Twitter

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)