హైదరాబాద్: ఇంటికప్పుపై విరిగిపడిన విమానం తలుపు

  • 31 అక్టోబర్ 2017
ఊడిపడిన విమానం తలుపు Image copyright TELANGANA POLICE

హైదరాబాద్‌లోని లాలాగూడ యాదవ్ బస్తీలో సోమవారం మధ్యాహ్నం ఓ ఇంటిపైకప్పుపై విమానం తలుపు విరిగిపడింది. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎవరికీ గాయాలు కాలేదు.

ఇంటి కప్పుపై అప్పటి వరకూ ఓ పెయింటర్ ఉన్నాడనీ, అయితే అతను భోజనం చేసేందుకు కిందికి వెళ్లడంతో ప్రమాదం తప్పిందని ఇంటి యాజమాని గణేష్ యాదవ్ మీడియాతో చెప్పారు.

ఊడిపడిన విమానం తలుపు బరువు దాదాపు 20 కిలోలుందని స్థానికులు చెప్పారు.

తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీకి చెందిన నాలుగు సీట్ల ఈ విమానాన్ని శిక్షణ ఇచ్చేందుకు ఉపయోగిస్తారు. ఇంటి కప్పుపై తలుపు పడినప్పుడు విమానం తక్కువ ఎత్తులో ఉందని స్థానికులు చెబుతున్నారు. విమానాన్ని నడిపే పైలెట్ శిక్షణలో ఉన్నాడు.

ఒక్కసారిగా విమానం నుంచి తలుపు ఊడి పడటంతో పెద్ద శబ్దం వచ్చినట్టు గణేష్ కుటుంబ సభ్యులు తెలిపారు. భయంతో స్థానికులు అరుపులు కేకలు పెట్టారు. ఆ తలుపును వారు స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు.

మా ఇతర కథనాలు:

లాలాగూడ పోలీసు స్టేషన్ ఇన్స్‌పెక్టర్ కరణ్ కుమార్ సింగ్ బీబీసీతో మాట్లాడారు. లాలాగూడ ప్రాంతంలో తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలు కనిపించడం సర్వసాధారణం. శిక్షణ కొరకు విమానాలు ఈ ప్రాంతంలోనే తిరుగుతాయని ఆయన అన్నారు.

సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ ఈ విషయంలో విచారణకు ఆదేశించారు. మూడడుగుల పొడవు, నాలుగడుగుల వెడల్పున్నఈ లోహపు తలుపును కొన్ని గంటలపాటు స్థానిక పోలీస్ స్టేషన్లోనే పెట్టారు. ఆ తర్వాత సివిల్ ఏవియేషన్ అధికారులు ఆ తలుపును తీసుకెళ్లారు.

గత నెల సెప్టెంబరు 28 తేదీన కూడా ఓ విమానం ప్రమాదానికి గురయ్యింది. అందులో ఉన్న పైలెట్, కో పైలెట్ ప్యారాచూట్ సహాయంతో బయటపడ్డారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)