ప్రెస్ రివ్యూ: లక్షా 12 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కేసీఆర్

  • 31 అక్టోబర్ 2017

లక్ష ఉద్యోగాలు తథ్యమన్న కేసీఆర్, గ్రూప్-1 పోస్టింగులు రద్దు, గొత్తికోయలు మనోళ్లు కాదంటున్న తెలంగాణ సర్కార్, ఎం.వి. శ్రీధర్ హఠాన్మరణం... ఈనాటి ప్రధాన వార్తలు

Image copyright Getty Images

సివిల్స్ పరీక్షల్లో ఐపీఎస్ అధికారి హైటెక్ కాపీయింగ్‌

''చట్టాన్ని కాపాడాల్సిన ఐపీఎస్‌ అధికారి యూపీఎస్సీ పరీక్షలో కాపీ కొడుతూ పట్టుబడ్డాడు. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా ఏఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఐపీఎస్‌ అధికారి సబీర్‌ కరీంకి ఐఏఎస్‌ కావాలన్నది కల. యూపీఎస్సీ పరీక్షల్లో బ్లూటూత్‌ సాయంతో హైదరాబాద్‌లో ఉన్న తన భార్య నుంచి సమాధానాలు తెలుసుకుని రాస్తుండగా అధికారులు పట్టుకున్నారు. చైన్నె పోలీసులు ఆయనను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. వాళ్లిచ్చిన సమాచారంతో హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు.. కరీమ్‌ భార్య జాయిస్‌ను, సహకరించిన లా ఎక్సలెన్సీ ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ రాంబాబును సోమవారం రాత్రి అరెస్ట్‌ చేశారు. ఈ ఏడాది జూన్‌లో జరిగిన ప్రిలిమ్స్‌ పరీక్షలో కూడా సఫీర్‌ హైటెక్ సాంకేతికతను ఉపయోగించి సులభంగా ఉత్తీర్ణుడయ్యాడని, గత శనివారం మెయిన్స్‌ పరీక్ష కూడా ఇదే తరహాలో రాస్తుండగా కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో చెన్నై పోలీస్‌ అధికారులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు.'' - ఈనాడు

Image copyright Getty Images

లక్షా 12 వేల ఉద్యోగాలు తథ్యం: అసెంబ్లీలో కేసీఆర్

''తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 12 వేల ఉద్యోగాలు వంద శాతం భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు. చెప్పినదానికంటే ఓ వెయ్యి ఎక్కువే ఇస్తామని అన్నారు. శాసనసభలో సోమవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా అంబేద్కర్ ఓవర్సీస్ పథకం, గ్రూప్-2 అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. అంబేద్కర్ ఓవర్సీస్ పథకానికి ఎలాంటి పరిమితి లేదన్నారు. అర్హులందరికీ ఈ పథకం వర్తింపచేస్తామని హామీ ఇచ్చారు. బలహీనవర్గాలకోసం అనేక పథకాలు తీసుకొచ్చామని సీఎం ఈ సందర్భంగా తెలిపారు. ఉద్యోగుల సంఖ్యకు అనుగుణంగా భర్తీ ఉంటుందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా బలహీనవర్గాల విద్యార్థుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్నదని సీఎం వివరించారు. గురుకుల పాఠశాలల ఏర్పాటుతో ప్రతి విద్యార్థి మీద 1.20 లక్షలు ఖర్చుచేసే విధానం తీసుకొచ్చామన్నారు. ఎస్సీ, ఎస్టీ బిల్లు తెచ్చిన తర్వాత సభలోని సభ్యులందరికీ లక్ష పేజీలతో కూడిన వివరాలను పెన్‌డ్రైవ్‌లో అందజేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.'' - నమస్తే తెలంగాణ

Image copyright Getty Images

వెబ్ ఆప్షన్ల తారుమారుతో టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్-1 పోస్టింగులు రద్దు

''టీఎస్‌పీఎస్‌సీ శనివారం విడుదల చేసిన 2011 గ్రూప్‌-1 పోస్టింగులను సోమవారం రద్దు చేసింది. త్వరలోనే తుది పోస్టింగుల జాబితాను ప్రకటించనున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ కార్యదర్శి వాణీప్రసాద్‌ తెలిపారు. అయితే, తుది ఫలితాలు ప్రకటించినా సెలక్షన్‌ జాబితా మారదు. అభ్యర్థుల తుది ర్యాంకులు మారవు. కేవలం పోస్టింగులు మాత్రమే మారతాయి. ఇందుకు కారణం.. పోస్టుల ఎంపికకు అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్లు తారుమారు కావడమే! సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (సీజీజీ) తప్పిదంతోనే ఈ గందరగోళం నెలకొంది. 2011 గ్రూప్‌-1లో 127 పోస్టులకు 121 మందిని ఎంపిక చేస్తూ శనివారం టీఎస్‌పీఎస్‌సీ ఫలితాలు ప్రకటించింది. నాలుగో ర్యాంకర్‌ నెల్లూరి వాణితోపాటు మరి కొంత మంది ఎంపికైన అభ్యర్థులు.. తాము వెబ్‌ ఆప్షన్లు ఇచ్చిన మాదిరిగా కాకుండా మరో విధంగా పోస్టింగ్‌ వచ్చిందని సోమవారం టీఎస్‌పీఎస్‌సీ అధికారులను ఆశ్రయించారు. అభ్యర్థుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న అధికారులు.. పోస్టింగుల ఎంపికకు అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా ఇచ్చిన వెబ్‌ ఆప్షన్లు తారుమారు అయ్యాయని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దీంతో శనివారం ప్రకటించిన పోస్టింగులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ఫైనల్‌ పోస్టింగుల జాబితాను ప్రకటించనున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ సెక్రటరీ వాణి ప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు.'' - ఆంధ్రజ్యోతి

Image copyright Getty Images

బీసీసీఐ మాజీ జీఎం, హైదరాబాద్ మాజీ కెప్టెన్ ఎం.వి.శ్రీధర్ హఠాన్మరణం

''భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాజీ జనరల్‌ మేనేజర్‌ (క్రికెట్‌ ఆపరేషన్స్‌), హైదరాబాద్‌ రంజీ జట్టు మాజీ కెప్టెన్‌ మాటూరి వెంకట శ్రీధర్‌ సోమవారం కన్ను మూశారు. హైదరాబాద్‌లోని తన స్వగృహంలో మధ్యాహ్నం ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో శ్రీధర్‌ కుప్పకూలిపోయారు. ఆయనను సమీపంలో ఉన్న స్టార్‌ ఆస్పత్రిలో చేర్పించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయన మృతదేహాన్ని సాయంత్రం ఇంటికి తరలించారు. అంత్యక్రియలు మంగళవారం ఉదయం 11 గంటలకు మహాప్రస్థానంలో నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 51 ఏళ్ల శ్రీధర్‌కు భార్య సాగరిక, కొడుకు, కూతురు ఉన్నారు. విజయవాడలో 1966 ఆగస్టు 2న జన్మించిన ఎంవీ శ్రీధర్‌ 1988లో హైదరాబాద్‌ రంజీ జట్టు తరఫున తొలిసారి బరిలోకి దిగారు. 2000 వరకు కొనసాగిన ఆయన కెరీర్‌లో మొత్తం 97 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడారు. హైదరాబాద్‌ కోఠిలోని ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన శ్రీధర్‌ను క్రికెట్‌ వర్గాల్లో ముద్దుగా 'డాక్‌' అని పిలుస్తారు. బీసీసీఐ క్రికెట్‌ ఆపరేషన్స్‌ జనరల్‌ మేనేజర్‌ (జీఎం)గా 2013 నుంచి నాలుగేళ్లపాటు ఉన్న ఆయన గత నెలలో 27న తన పదవికి రాజీనామా చేశారు.'' - సాక్షి

Image copyright Getty Images

'ఆధార్' విచారణకు రాజ్యాంగ ధర్మాసనం: సుప్రీంకోర్టు

''ఆధార్‌ కార్డు రాజ్యాంగ బద్ధత, సమాచార గోప్యత, ప్రభుత్వ పథకాలు, మొబైల్‌ ఫోన్లకు అనుసంధానించటం వంటి అంశాలపై దాఖలైన పిటిషన్ల విచారణకు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. నవంబర్‌ చివరి వారం నుండి రాజ్యాంగ ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ చేపడుతుందని ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా ప్రకటించారు. ఆధార్‌ చెల్లుబాటును సవాలు చేస్తూ 2014 నుండి దాఖలైన పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయటానికి బదులు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తే ప్రభుత్వం తన వాదనను వినిపించేందుకు సిద్ధంగా వుందని అటార్నీ జనరల్‌ కెకె వేణుగోపాల్‌ సుప్రీంకోర్టుకు చెప్పారు. వ్యక్తిగత గోప్యత అన్నది ప్రాథమిక హక్కేనంటూ న్యాయమూర్తి రోహింటన్‌ నారీమన్‌ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించినప్పటికీ తాజాగా ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని ప్రధాన న్యాయమూర్తి నిర్ణయించటం విశేషం. ప్రస్తుతం ఈ పిటిషన్లను విచారిస్తున్న న్యాయమూర్తి జె చలమేశ్వర్‌ నేతృత్వంలోని ధర్మాసనం వీటిని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించింది. గత ఏడాది ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ఆధార్‌ చట్టం రాజ్యాంగ విరుద్ధమని ఈ పిటిషన్లు వాదిస్తున్న విషయం తెలిసిందే.'' - ప్రజాశక్తి

Image copyright Getty Images

గొత్తి కోయలు.. మనోళ్లు కాదు: కేసీఆర్‌

''గొత్తి కోయలు అడవులను నరుకుతుంటే చూస్తూ ఊరుకుందామా.. వారి వల్ల అడవులు అంతరించి పోతున్నాయి. అసలు వారు ఈ రాష్ట్రానికి చెందిన వారు కారు. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి అడవులను విధ్వంసం చేస్తున్నారు. రకరకాల కారణాలతో అడవులను నరుకుతున్నారు. అడవులను నరికి వ్యవసాయం చేయడం తప్ప వారికి వేరే జీవనోపాధి లేదా? వారి వల్లనే అటవీ సంపదను కోల్పోతున్నాం.. అందుకే వారిపై కఠినంగా వ్యవహరించాలని నేనే ఆదేశించా'' అని అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. అడవులను నరికితే కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా సభ సహకరించాలన్నారు. సోమవారం శాసనసభలో హరితహారం మీద స్వల్ప కాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో అడవులను నరికితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటవీ భూములపై ఎవరికీ హక్కు లేదన్నారు. అటవీ ఫలాలను సేకరించే హక్కు గిరిజనులకు ఉందని, అటవీ భూములను సాగు చేసుకునే హక్కు లేదని చెప్పారు. భూపాలపల్లి జిల్లాలో గొత్తి కోయలు అడవులను నరకుతున్నందునే అటవీ శాఖ అధికారులు దాడులు చేశారని తెలిపారు. రాష్ట్రంలో అన్యాక్రాంతమైన అటవీ భూములను వెనక్కి తీసుకుంటామని చెప్పారు. ఇకనుంచి అటవీ భూముల్లో ఇంచ్‌ భూమిని ఎవరికి ఇవ్వబోమన్నారు. గత కాంగ్రెస్‌, తెలుగుదేశం ప్రభుత్వాలు అడవుల అభివృద్ధి కోసం రూ.130 కోట్లు ఖర్చు చేస్తే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ వెయ్యి కోట్లపైన ఖర్చు చేసిందని వెల్లడించారు.'' - నవ తెలంగాణ

Image copyright Getty Images

రాజధాని రైతులు వ్యాపార వేత్తలుగా ఎదగాలి: చంద్రబాబు

''ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు అందరూ వ్యాపార వేత్తలుగా ఎదగాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన 34 మందితో కూడిన మొదటి విడత రైతుల బృందం సింగపూర్‌ పర్యటనను సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మలేసియా నుంచి విడిపోయిన 50 ఏళ్లకే సింగపూర్‌ ఏ విధంగా అభివృద్ధి చెందిందో, వ్యాపార అవకాశాలను ఎలా అందిపుచ్చుకుందో ఈ పర్యటనలో తెలుసుకోవాల్సిందిగా రైతులను కోరారు. చేతిలో డబ్బులు లేకపోయినా మనసులో గట్టి సంకల్పం ఉంటే ఏ విధంగా ఎదగవచ్చో సింగపూర్‌ నిరూపించిందన్నారు. తానిచ్చే చేయూతను అందిపుచ్చుకోవాలని అలా కాకుండా చెడగొట్టే వారిని అనుసరిస్తే పతనమైపోతారని రైతులకు సూచించారు. కొంతమంది రెచ్చగొట్టిన వారి మాటలు విని భూములు ఇవ్వని వారి విషయంలో చట్టప్రకారం నడుచుకుంటామన్నారు.'' - సాక్షి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు