ప్రెస్ రివ్యూ: సైకిల్ లక్ష.. అమరావతా, మజాకా!

ఫొటో సోర్స్, APgovt
ఆంధ్రప్రదేశ్: అమరావతిలో సైకిల్ సవారీ!
ఈనాడు: వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయ సిబ్బంది, సందర్శకులు ఇకపై సైకిళ్లపై దూసుకుపోవచ్చు. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) సచివాలయంలో సైకిల్ సవారీకి ఏర్పాట్లు చేస్తోంది.
ఆల్ ఇండియా బైక్ ఫెడరేషన్, ఆంధ్రాబ్యాంక్, నెక్స్ట్ బైక్ సంస్థల సౌజన్యంతో ఈ కార్యక్రమం చేపట్టింది. ప్రత్యేకంగా జర్మనీ నుంచి ఇప్పటికే 30 అత్యాధునిక సైకిళ్లు దిగుమతి చేసుకుంది. జర్మనీ సహా అనేక దేశాల్లో పేరొందిన 'నెక్స్ట్బైక్' సంస్థ వీటిని సరఫరా చేసింది.
ఒక్కో సైకిల్ ఖరీదు రూ.లక్ష. వారం పది రోజుల్లో వీటిని వినియోగంలోకి తేనున్నారు. రాజధాని అమరావతిని పర్యావరణ హితంగా తీర్చిదిద్దేందుకు..సైకిళ్ల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రహదారుల వెంబడి 1,670కి.మీ.ల పొడవైన ప్రత్యేక సైకిల్ మార్గాలను సీఆర్డీఏ అభివృద్ధి చేస్తోంది.
ఫొటో సోర్స్, Getty Images
గాంధీ పక్కన అంబేద్కర్‌కు చోటులేదంట
నవతెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో రాజ్యాంగ నిర్మాతకు మరోసారి దారుణ అవమానం ఎదురైంది. నగరానికి కూతవేటు దూరంలో ఉన్న బోరాం(పి) గ్రామంలో గాంధీ విగ్రహం పక్కన అంబేద్కర్ విగ్రహానికి చోటు లేదంటూ వీడీసీ ముసుగులో పెత్తందార్లు అడ్డుకున్నారు. ఊరు చివర పెట్టుకోవాలంటూ దళితులకు హుకుం జారీ చేశారు.
బోర్గాం(పి) గ్రామంలో దాదాపు 7వేల జనాభా ఉంది. గ్రామంలో బీసీ, ఓసీ సామాజిక తరగతులు ఎక్కువ ఉన్నాయి. 130 దళిత, ఇతర కుటుంబాలున్నాయి. సర్పంచ్ కూడా దళితుడే.
ఊళ్లో గ్రామపంచాయతీ కార్యాలయం దగ్గర అంబేద్కర్ విగ్రహం పెట్టాలని గ్రామసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. భూమిపూజ చేసేందుకు దళితులు సిద్ధమవగా.. 'నడిఊళ్లో అంబేద్కర్ విగ్రహం పెట్టొద్దు. జీపీ వద్ద స్థలం లేదు. వాహనాలకు అడ్డంకిగా మారుతుంది. హైదరాబాద్ రోడ్డులో పెట్టుకోండి' అంటూ వీడీసీ ముసుగులో కొందరు పెత్తందార్లు అడ్డుతగిలారు.
విగ్రహ ఏర్పాటుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సోమవారం (అక్టోబర్ 30) రోజున గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా పంచాయతీ అధికారికి వినతిపత్రం ఇచ్చారు.
అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు అనుమతివ్వాలని కోరుతూ మంగళవారం సాయంత్రం అంబేద్కర్ యువజన సంఘం, ఎంఆర్పీఎస్ నాయకులు నిజామాబాద్ ఇన్చార్జి కలెక్టర్ రవీందర్‌రెడ్డిని ఆశ్రయించారు.
ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణ: తాగేటోళ్లు పెరిగారు.. మేమేం చేస్తాం?
ఆంధ్రజ్యోతి: మద్యం రేట్లు పెరిగాయి. తాగేటోళ్లు పెరిగారు. మేం ఏం చేస్తాం' అని తెలంగాణ ఆబ్కారీ శాఖ మంత్రి పద్మారావుగౌడ్ వ్యాఖ్యానించారు.
మంగళవారం శాసనసభలో గుడుంబా, మద్యం నియంత్రణపై జరిగన లఘుచర్చ సందర్భంగా పద్మారావు మాట్లాడుతూ.. మద్యం అమ్మకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకుంటోందనడం సరికాదన్నారు.
గుడుంబా వల్ల మహిళలు వితంతువులుగా మారుతున్నారని కాకతీయ, ఉస్మానియా వర్సిటీ ప్రొఫెసర్లు నివేదికలిచ్చినా గత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
మద్యం ద్వారా రూ. 21 వేల కోట్ల ఆదాయం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందన్న బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు.
ఫొటో సోర్స్, Getty Images
హైదరాబాద్: ప్రతి మెట్రో స్టేషన్‌కు రూ. కోటిన్నర
నమస్తే తెలంగాణ: హైదరాబాద్ మెట్రోరైలు స్టేషన్ల నిర్మాణం ఇప్పటికే పూర్తిచేసిన అధికారులు ప్రస్తుతం ప్రతి మెట్రోస్టేషన్‌ను అందంగా తయారుచేసేపనిలో నిమగ్నమయ్యారు.
దీనికోసం ప్రత్యేకంగా స్టేషన్ యునిట్‌గా విభజన చేసి ఈ నెలలో ప్రారంభం కానున్న నాగోల్-మియాపూర్ 30 కిలోమీటర్ల మార్గంలోని 24 స్టేషన్లను అందంగా ముస్తాబు చేస్తున్నారు.
ఒక్కో స్టేషన్‌కు రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. ఈ నిధులతో అర్బన్ రెజోనేషన్ పనులు చేపడుతున్నారు.
పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్‌లో భాగంగా గ్రౌండ్ లెవెల్లో ఏర్పాటు చేసే సౌకర్యాలు సహా బ్యూటిఫికేషన్తోపాటు పాదాచారుల వంతెనలు, ఫుట్‌పాత్‌లు, వేర్వేరుగా బస్‌బేలు, స్ట్రీట్ వెండర్స్ కోసం స్టాల్స్.. ఇలా సౌకర్యం, బ్యూటిఫికేషన్ కలిపి ఉండేలా స్టేషన్ పరిసరాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు.
ఫొటో సోర్స్, Getty Images
ఆంధ్రప్రదేశ్: వైద్య సీట్లలో వచ్చే ఏడాది నుంచి జాతీయ పూల్‌కు వెళ్తున్నాం
సాక్షి: వచ్చే ఏడాది నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ వైద్య సీట్ల విషయంలో జాతీయ పూల్‌లోకి వెళ్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రకటించారు.
జాతీయ స్థాయిలో 27,710 ఎంబీబీఎస్ సీట్లున్నాయని, వీటిలో 15 శాతం సీట్ల చొప్పున మనమిచ్చే సీట్లతో కలిపి 4,442 సీట్లలో పోటీపడవచ్చన్నారు. మన రాష్ట్రం నుంచి 285 సీట్లు మాత్రమే జాతీయ పూల్‌లోకి వెళ్తాయన్నారు.
పీజీ సీట్ల విషయంలో మన రాష్ట్రం 415 సీట్లు ఇస్తే మన విద్యార్థులు దేశ వ్యాప్తంగా 6,665 సీట్లలో పోటీ పడే అవకాశం ఉంటుందని తెలిపారు. ఫాతిమా కాలేజీ విద్యార్థులకు ప్రభుత్వ పరంగా చేయాల్సిందంతా చేశామని చెప్పారు.
ఫాతిమా విద్యార్థుల సమస్యపై 3న రివిజన్ పిటిషన్ వేస్తున్నట్టు చెప్పారు.
ఫొటో సోర్స్, Getty Images
కర్ణాటకకు తొలి మహిళా డిజిపి
ప్రజాశక్తి: కర్ణాటక ప్రభుత్వం ఓ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పోలీసు చీఫ్‌గా తొలిసారి ఓ మహిళను నియమించింది.
1983 బ్యాచ్‌కు చెందిన ఐపిఎస్ అధికారి నీలమణి ఎన్ రాజు మంగళవారం డైరెక్టర్ జనరల్ పోలీస్(డిజిపి)గా బాధ్యతలు స్వీకరించారు.
కర్ణాటక క్యాడర్లో రెండో మహిళ కూడా ఆమె కావడం విశేషం. పదేళ్లపాటు కర్ణాటకలో సేవలందించిన ఆమె 1993లో ఇంటెలిజెన్స్ బ్యూరోలో చేరారు. అక్కడ 23 ఏళ్ల పాటు విధులు నిర్వహించాక 2016లో సొంత కేడర్‌కు డిజిపి ర్యాంకు అధికారిగా వచ్చారు.
అంతర్గత భద్రతా, అగ్నిమాపక, అత్యవసర సేవల విభాగాలకు డిజిపిగా ఆమె పనిచేశారు. ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో ఆమె పుట్టి పెరిగారు.
రాష్ట్ర హోం మంత్రి రామలింగా రెడ్డిని సంప్రదించి సిఎం సిద్ధరామయ్య ఆమె నియామకంపై నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
అంతకుముందు డిజిపిగా బాధ్యతలు నిర్వర్తించిన రూపక్ కుమార్ దత్తా పదవీ కాలం మంగళవారంతో ముగిసింది.
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)