శ్రేష్ఠ: ఆ ప్రొడ్యూసర్ల భార్యలే ‘ఒప్పుకోమనేవారు’

శ్రేష్ట
ఫొటో క్యాప్షన్,

నీకు అవకాశం ఇస్తే మాకేమిటి అని అడిగేవారు

అమ్మాయి అంటే ఇలా ఉండాలి.. అలా ఉండకూడదు.. అంటూ సవాలక్ష ఆంక్షలు. తప్పెవరిదైనా ఆడవాళ్లనే అందరూ వేలెత్తి చూపిస్తారు. సినిమాల్లో కూడా ఏ సమస్య వచ్చినా హీరోలే పరిష్కరిస్తారు. ఆఖరికి ఆడవాళ్లకు తెర మీద కూడా స్వేచ్ఛ లేదు. ఇంకెంత కాలం ఇలాంటి వేధింపులనూ, వివక్షనీ మేం భరించాలి.. అని ప్రశ్నిస్తున్నారు సినీ గేయ రచయిత శ్రేష్ఠ.

ఆమె బీబీసీ తెలుగు ప్రతినిధి పద్మ మీనాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు.

పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి సినిమాల్లో మధురమే, గుండెల్లో పాటలతో అభిమానులను సంపాదించుకుని, తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్న ఈమె #మీటూ పై స్పందించారు.

మీ టూ కాంపెయిన్ కొన్ని వేల మంది గొంతు విప్పి మాట్లాడటానికి సహకరించింది. మీరు ఏ విధమైన ఇబ్బందులకు గురయ్యారు?

ఆడ పిల్ల పుట్టినప్పటి నుంచి వివక్షకు గురవుతూనే ఉంది. కేవలం హీరోయిన్‌లే కాదు, సినీ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇబ్బందులకు గురవుతూనే ఉంటారు. బయటకు చెప్పకుండా లోలోపల కుమిలిపోతూ ఉంటారు. బయటకి చెబితే ఎటువంటి సమస్యలు తలెత్తుతాయో అని భయపడుతూ ఉంటారు.

అసభ్యకర ప్రపోజల్స్ కారణంగా నేను ఒక సినిమాను మధ్యలో వదిలి పెట్టాల్సి వచ్చింది. నా అనుకున్న స్నేహితురాళ్ళు కూడా దురుద్దేశంతో ఉన్న మగవారిని సమర్ధించడం, అమ్మాయిలే నా కదలికలను వేరే వాళ్లకు తెలియచేయడం చూసి చాలా బాధపడ్డాను. అబ్బాయిల నుంచి రక్షణ ఎలానూ లేదు. కాని అమ్మాయిల దగ్గర నుంచి రక్షణ లేకపోవడం ఇంకా దారుణం.

పబ్‌కి వెళదాం, పార్టీలకు వెళదాం అని, వేరే అబ్బాయిలను పరిచయం చేయడం, అభ్యర్థనలను ఒప్పుకోమని ఇండైరెక్ట్ గా చెప్పడం.. ఇవన్నీ ఇక్కడ సర్వసాధారణం.

అసలేం జరిగింది?

ఎలా అయినా నువ్వు కావాలి అని ప్రయత్నించేవారు. సినిమాలోకి వస్తున్నారంటే అన్నిటికీ సిద్ధంగా ఉన్నారనే అభిప్రాయంతో ఉంటారు. నన్ను కూడా చాలా మంది.. ఇలా ఎంత రాసుకున్నా, నువ్వు పైకి ఎదగలేవు, నేను చెప్పినట్లు వింటే నీకు ఒక కార్ కొంటాను లేదా ఫ్లాట్ కొంటాను అని మొదలు పెట్టేవారు.

కొంత మంది నేరుగా, కొంత మంది పక్క దారుల్లో ప్రపోజ్ చేశారు. ఏ మద్దతు లేకుండా ఎలా నిలబడతావో చూస్తాం అనే మాటలు కూడా వినాల్సి వచ్చింది. నేను 2 సంవత్సరాలకు పైగా కెరీర్‌ను వదులుకున్నా .

నన్ను ఇబ్బందికి గురి చేయని మనుషులు దొరికిన తరువాత నేను మళ్ళీ ఫీల్డ్‌కి వచ్చాను. నేను ఎవరినైతే కాదన్నానో, వారు నాకు అవకాశాలు ఇవ్వలేదు. ఇప్పుడు అలా కాదు. నన్నూ నా పనినీ గౌరవించేవాళ్లే ఇప్పుడు అవకాశాలు ఇస్తున్నారు.

మీ స్వానుభవం చెప్పండి

ఇప్పుడు నేను చెప్పబోయే అంశం నన్ను చాలా షాక్‌కి గురి చేసింది. మహిళలే మహిళలకి శత్రువు అన్నట్లు.. ఒక మహిళా డైరెక్టర్ గోవా రమ్మని పిలిచారు.

రానని చెబితే.. మళ్లీ పది సార్లు ఫోన్ చేశారు. నీకొక సర్ప్రైజ్ ఉంది. ఒక అబ్బాయి నీకు ప్రపోజ్ చేద్దామనుకుంటున్నాడు అన్నారు.

అందుకు గోవాలో పార్టీ ఏర్పాటు చేశాడు.. రావాలని పిలిచారు. నేను కచ్చితంగా రానని చెప్పా.

ఆ తర్వాత ఎవరో నాకు తెలియని ఒక అబ్బాయి ఫోన్ చేసి, అంతా ఏర్పాట్లు చేసుకున్నాక మీరు రాకపోతే ఎలా అని, ‘ఆవిడే’ మిమ్మల్ని ఆఫర్ చేసిందని చెప్పాడు.

నేను హతాశురాలినయ్యాను.

నువ్వు అన్నిటికీ సిద్ధంగానే ఉన్నావని తాను చెప్పిందని, అందుకే పార్టీ కి ఏర్పాట్లు చేశానని తిట్టి పోశాడు.

దీంతో అచేతనంగా ఉండిపోయా. తరువాత నేను ఆ మహిళా డైరెక్టర్‌ని నా అంగీకారం లేకుండా అలా ఎలా చేస్తారని అడిగాను.

ఈ సంఘటనతో నేను సినీ రంగాన్ని కొన్ని సంవత్సరాలు వదిలిపెట్టాను కూడా. ‘ఆవిడ’ను నమ్మి పార్టీ కి వెళ్లి ఉంటె ఏమయ్యేదాన్నో?

నేను చాలా గట్టిగా పోలీస్ కంప్లైంట్ ఇస్తానని బెదిరించి జాగ్రత్త పడ్డాను. అమ్మాయిలను కూడా నమ్మకూడదు అని తర్వాత అర్థమైంది.

ఫొటో క్యాప్షన్,

‘అసభ్యకర అభ్యర్థనల కారణంగా ఒక సినిమా మధ్యలో వదిలి పెట్టా’

ఒక ప్రొడ్యూసర్ తో నాకు గొడవ వచ్చింది. ఎందుకంటే నేను అతని ప్రపోజల్‌ను తోసి పుచ్చాను. అతని అహం దెబ్బ తింది. ఒక నిర్మాత భార్యే నన్ను తన భర్త అడుగుతున్న వాటికి ఒప్పుకోవచ్చు కదా, మాట వినవచ్చు కదా అని , రమ్మని బుజ్జగించేది. ఇది చాలా జుగుప్సాకర విషయం.

మీరు తిరస్కరించడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు?

నేను 8 - 9 సినిమాలు వదిలి పెట్టాల్సి వచ్చింది. టాలెంటే కావాలంటే ఎవరితోనైనా రాయించుకుంటాం. నీకు అవకాశం ఇస్తే మాకేమిటి అని అడిగేవారే ఎక్కువ.

ఈ సమస్య ఎలా ఎదుర్కొన్నారు?

నాది చిన్నప్పటి నుంచి ఎదురు తిరిగే మనస్తత్వం. ధైర్యంగా ఉండేదాన్ని. కాని ఇక్కడ చాలా భయపడ్డాను, ఎందుకంటే ఇక్కడ అందరికీ ధన బలం, రాజకీయ బలం, మనుషుల బలగం ఉంటాయి. వారితో పోటీ పడటం కష్టం. ఒకసారి ప్రాణానికి ముప్పు ఉంటుందేమో అని భయపడ్డాను.

ఇక్కడ సెంటిమెంట్‌లకు ప్రాధాన్యం ఇస్తారు. ఒకరికి విజయం వస్తే ఎక్కడెక్కడినుంచైనా వచ్చి చుట్టూ చేరుతారు. కానీ ఒక్క ఓటమి దగ్గరి వారిని కూడా దూరం చేసేస్తుంది.

విజయం వచ్చాక ఇటువంటి ఒత్తిళ్లు బాగా తగ్గుతాయి.

మీకు ఎందుకు ఈ విషయం చెప్పాలనిపించింది

నేను ఎందుకు గొంతు విప్పి మాట్లాడుతున్నానంటే, మాట్లాడితే కాస్తయినా ఇటువంటి సమస్యలను తగ్గించవచ్చని నా అభిప్రాయం. లేదా ఈ వేధింపుల సమస్య కొనసాగుతూనే ఉంటుంది.

పక్కవాళ్ళు ఏమనుకుంటారో అనే భయంతో చాలా మంది మాట్లాడరు. కానీ మౌనంగా ఉండటం వలన సమస్య తీరదు.

అమ్మాయి అంటే ఇలానే ఉండాలి. లేదా అమ్మాయినే వేలెత్తి చూపిస్తుంది. ఏ సమస్య అయినా సినిమాలలో కూడా హీరో వచ్చే పరిష్కరిస్తాడు. అమ్మాయి రహస్యాలు దాచుకుని, ఒక సహన మూర్తి లా ఉండాలనే సమాజం భావిస్తుంది. ఇది తరతరాలుగా నాటుకుపోయింది.

ముఖ్యంగా కెరీర్ పోతుందనే భయంతోనే నోరు విప్పి మాట్లాడరు.

మా ఫేస్‌బుక్ పేజీ లైవ్‌ నోటిఫికేషన్ కోసం బీబీసీ న్యూస్ తెలుగు పేజీని లైక్ చేయండి.

#METOO అంటే..

#మీటూ క్యాంపెయిన్ ద్వారా షేర్ చేసుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం. చాలా భయపెడతారు. కానీ ఎవ్వరి సలహాలు వినకుండా మనం మంచి అనుకున్న పని చేయాలి అని నా ఉద్దేశ్యం. మాట్లాడితేనే కెరీర్ లో కూడా ముందుకు దూసుకుపోగలం.

• హాలీవుడ్ ప్రొడ్యూసర్ హార్వే వైన్ స్టీన్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల నేపధ్యంలో #మీటూ కాంపెయిన్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

• సోషల్ మీడియాలో అనేక మంది మహిళలు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు తమ గొంతు విప్పి తమకు జరిగిన అన్యాయాన్ని బహిరంగంగా చెబుతున్నారు.

• మీటూ క్యాంపెయిన్‌ని తరన బర్క్ అనే ఉద్యమ కర్త 10 సంవత్సరాల క్రితమే ప్రారంభించారు. లైంగిక వేధింపులు, హింస,దోపిడీ కి గురైన మహిళల సమస్యలను 'అర్ధం చేసుకుని సాధికారత' కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ ప్రచారం ప్రారంభం అయ్యింది.

• బీబీసీ రేడియో లైవ్ నిర్వహించిన కామ్ రెస్ పోల్ సర్వేలో లైంగిక వేధింపులకు గురైన వారిలో 63 % మహిళలు 79% మంది పురుషులు తమకు జరిగే అన్యాయాన్ని బయట పెట్టరని తేలింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)