స్వాతి లక్రా: మహిళలు ధైర్యంగా ముందుకువస్తే నేరాల్నినియంత్రించవచ్చు

స్వాతి లక్రా

ఫొటో సోర్స్, AFP

వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు ఫిర్యాదులు చేయడానికి ముందుకు వస్తే అవసరమైతే పీడీ చట్టం ప్రయోగించైనా సరే కఠిన శిక్షలు పడేలా చేస్తామంటున్నారు షీ టీమ్స్ చీఫ్, అదనపు పోలీస్ కమిషనర్ స్వాతి లక్రా.

భారతదేశంలో తొలిసారి తెలంగాణలో ప్రారంభమైన 'షీ టీమ్స్' పోలీస్ విభాగం ఇటీవలే మూడేళ్లు పూర్తిచేసుకుంది.

మహిళల భద్రత, రక్షణ చర్యలకోసమే ఏర్పాటైన ఈ బృందం పనితీరు, సవాళ్లు, లక్ష్యాలు వంటి వాటిపై బీబీసీ న్యూస్ తెలుగు ప్రతినిధి బళ్ల సతీశ్‌తో స్వాతి లక్రా ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడారు.

ఫాలోవర్స్ అడిగిన ప్రశ్నలకు, సందేహాలకు సమాధానాలిచ్చారు.

సంఘటన జరుగుతున్నప్పుడే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడం... దాన్ని వీడియో రికార్డ్ చేసి, నిందితులను కోర్టుముందు హాజరు పరచడం... ఇదే షీ టీమ్స్ ప్రథమ కర్తవ్యమని ఆమె వెల్లడించారు.

దీనికోసం తమ బృందంలో అందరిదగ్గరా సీసీ కెమెరాలున్నాయని, వాటి సాయంతో నేరాలను రికార్డ్ చేస్తామని చెప్పారు.

నేరాలను అదుపు చేయడానికి సాంకేతికను పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటున్నామన్నారు. కేవలం బహిరంగ ప్రదేశాల్లోనే కాదు, సోషల్ మీడియాలో వేధింపులపై కూడా ఈ షీ టీమ్స్ చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

షీ టీమ్స్ ఏర్పాటు తర్వాత 20 శాతం వరకూ నేరాల్లో తగ్గుదల కనిపించిందని, సీసీ కెమెరాల ద్వారా చాలా వరకూ నేరాలను అరికట్టగలుగుతున్నామని ఆమె వెల్లడించారు.

షీ టీమ్స్ పోలీసు వ్యవస్థలోని ఓ ప్రత్యేక విభాగమైనప్పటికీ అందరితో సమన్వయం చేసుకుని పనిచేస్తామని స్వాతి లక్రా అన్నారు.

తమపై జరుగుతున్న వేధింపులపై మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయగలిగే పరిస్థితి వస్తే మేం మరింత కఠినంగా వ్యవహరిస్తామని ఆమె స్పష్టం చేశారు. పిల్లలపై జరిగే వేధింపులపై కూడా పోస్కో చట్టం ఉపయోగించి చర్యలు తీసుకోగలుగుతామని ఆమె తెలిపారు.

శిక్షించడం తమ లక్ష్యం కాదని, నిందితుల్లో మార్పు తీసుకురావడంపైనే తాము ఎక్కువగా దృష్టి పెడుతున్నామని చెప్పారు. దీనికోసం నిందితుల కుటుంబ సభ్యులను కూడా పిలిపించి అందరికీ నిపుణులతో కౌన్సెలింగ్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.

కాలేజీలకు కూడా వెళ్లి విద్యార్థుల్లో మహిళల భద్రతపై అవగాహన కల్పిస్తున్నామని స్వాతి లక్రా చెప్పారు.

సోషల్ మీడియాలో వేధింపులకు పాల్పడేవారు విదేశాల్లో ఉన్నా పట్టుకోవడం కొద్దిగా ఆలస్యం కావచ్చేమో కానీ కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.

"ఈ మూడేళ్లలో ఎన్నో కేసులు చూశాం. ఏది ప్రత్యేకం, ఏది ముఖ్యం అంటే... అన్నీ ముఖ్యమే, ప్రతి కేసూ ప్రత్యేకమే. బాధితుల కోణంలోనుంచి చూస్తే ఇది అర్థమవుతుంది.

మహిళగా తోటి మహిళల భద్రత, రక్షణ కోసం పనిచేయడం ఎంతో తృప్తినిస్తోంది" అని స్వాతి లక్రా అన్నారు.

ఇబ్బంది ఎదురైనా లేదా ఏదైనా నేరాన్ని చూసినా 9490616555 నెంబర్‌కి వాట్సాప్ మెస్సేజ్ పంపించవచ్చన్నారు. కానీ అత్యవసర సమయంలో మాత్రం 100 కి ఫోన్ చేయమని సూచించారు.

మహిళలు కూడా జూడో, కరాటే లాంటివి నేర్చుకోనవసరం లేదు, కానీ కొన్ని స్వీయ రక్షణ పద్ధతులపై మాత్రం అవగాహన పెంచుకోవాలని ఆమె సూచించారు.

స్వాతి లక్రా ఫేస్‌బుక్ లైవ్ పూర్తి వీడియోని చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయిండి

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)