రేవంత్ కాంగ్రెస్‌కు బాహుబలి అవుతారా?

  • జి.ఎస్.రామ్మోహన్
  • బీబీసీ తెలుగు ఎడిటర్
రేవంత్

ఫొటో సోర్స్, FACEBOOK

రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఎడమచేత్తో ఎందుకు స్వీట్ తినిపించారని సోషల్ మీడియాలో చర్చ చాలా నడుస్తోంది. రేవంత్ హస్తాన్ని అందిపుచ్చుకోవడంలోని ప్రాధాన్యం దానికంటే విస్తృతమైనది.

తెలంగాణలో ఇపుడున్న రాజకీయ వాతావరణానికి అద్దం పట్టే ఘటన ఇది. రేపో మాపో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టబోతున్న రాహుల్ గాంధీ మార్కు ఇందులో ఉంది.

తెలంగాణ కాంగ్రెస్‌లో రాబోయే రోజులు ఎంత సందడిగా అలజడిగా ఉండబోతున్నాయో తెలిపే సంకేతాలున్నాయి.

తెలంగాణలో తెలుగుదేశం భవిష్యత్తుకు, ఉనికికి సంబంధించిన ప్రశ్నలున్నాయి. కెసిఆర్ కు ప్రత్యర్థిని వెతుక్కోవాలనే విపక్షాల డెస్పరేట్ ప్రయత్నాలకు సంబంధించిన సంకేతాలున్నాయి.

తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నాటినుంచే కెసిఆర్ పైనా ఆయన కుటుంబంపైనా తీవ్రపదజాలంతో విరుచుకుపడే నేతగా రేవంత్ రెడ్డికి పేరుంది.

ఫొటో సోర్స్, FACEBOOK

అసెంబ్లీలో గవర్నర్‌పై కాగితాలు విసిరేయడం లాంటి పనులు ఎన్ని చేసినా ఆయనకు సమైక్యవాదుల్లో గ్లామర్ సంపాదించి పెట్టింది కెసిఆర్ వ్యతిరేకతే. ముఖ్యంగా ఆ తర్వాత కూడా తెలంగాణలో కెసిఆర్ వ్యతిరేకుల కూడలిగా చెప్పుకోదగిన వారిలో ఆయన ఒకరుగా ఉన్నారు.

ఓటుకు నోటు కేసులో అరెస్టయినా ఆయన దూకుడు పెరిగింది తప్ప తగ్గలేదు. తెలంగాణలో దాదాపు మునిగిపోయిన స్థితిలో ఉన్న నావలాంటి తెలుగుదేశంలో ఉంటే రాజకీయ భవిష్యత్తును బలిచేసుకున్నట్టే అనే భావన ఆయన్ను కాంగ్రెస్ వైపు నెట్టి ఉండొచ్చనేది దాదాపు అంతటా వినిపిస్తున్న మాట.

టీడీపీలో మిగిలిన నాయకులు కూడా పక్కచూపులు చూస్తున్నారని బలమైన సమాచారం. ఆంధ్రా పార్టీ ముద్ర మాత్రమే కాకుండా కమ్మవాళ్ల నాయకత్వంలోని పార్టీగా ముద్ర ఉన్న తెలుగుదేశానికి ఈ పతనం ఊహించనిది ఏమీ కాదు. కాకపోతే ఓటుకు నోటు కేసు తర్వాతి పరిణామాలు దీన్ని వేగవంతం చేశాయి.

''తెలుగుదేశంలో రాజకీయ భవిష్యత్తు శూన్యం కాబట్టి రేవంత్ కాంగ్రెస్‌లో చేరారు. అక్కడ ఆయన సాధించేదేమీ ఉండదు. అందరిలో ఒకరిగా ఉండాల్సిందే'' అనేది సీనియర్ పాత్రికేయులు దేవులపల్లి అమర్ అభిప్రాయం.

ఫొటో సోర్స్, FACEBOOK

ఒక నాయకుడి మీద పనిగట్టుకుని కచ్చగా మాట్లాడుతున్నట్టు తప్ప ప్రభుత్వ విధానాలమీద నిర్మాణాత్మకమైన సునిశితమైన విమర్శ చేస్తున్న నాయకుడిగా రేవంత్ కనిపించరు.

కెసిఆర్ పాలనా పద్ధతుల మీద విమర్శ ఉన్న వారికి కూడా ఇది రుచించే అంశం కాదు. దూకుడు రాజకీయాల్లో ఒకమేరకు పనికొచ్చే అంశమే కావచ్చు. కానీ పెద్ద పాత్ర పోషించాలనుకున్న వారికి కూసింత సంయమనం, పరిణతి అవసరం.

పొడవాటి మీసాలతో వెనుక పొడవాటి తుపాకులు పట్టుకున్న అడ్డపంచె అనుచరులతో ఉన్న రూపం నుంచి ట్రిమ్ మీసాలతో వెనుక సఫారీ గార్డులతో ఉన్న రూపం దాకా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన ప్రయాణం పాపులర్ రాజకీయాల్లో ఎదగాలనుకునేవారికి ఒక పాఠంలా ఉపయోగపడొచ్చు.

అది కేవలం మీసాలకు సంబంధించిన అంశం కాదు. పాపులర్ రాజకీయాల్లో పెద్ద నాయకుడిగా ఎదగడానికి అవసరమైన సొఫిస్టికేషన్‌తో పాటు దూకుడు స్థానంలో స్థిరత్వం సంపాదించుకోవడం అనే ప్రయాణం అది.

ఫొటో సోర్స్, FACEBOOK

తెలంగాణలో కెసిఆర్ కు అసలు ప్రత్యర్థి అన్నదే ప్రస్తుతానికి కనిపించడం లేదు అంటే ప్రతిపక్ష నాయకులు లేరని కాదు. ఉన్నారు. అసెంబ్లీలో విపక్ష నేత జానారెడ్డి ఉన్నారు. కెసిఆర్, ఆయన మంత్రివర్గ సహచరులు జానారెడ్డిని పెద్దమనిషిగా సభ లోపలా బయటా గుర్తిస్తూ గౌరవిస్తూ ఉంటారు. ఎడతెగని గందరగోళపు లింకువాక్యాలకు ప్రసిద్ధి గాంచిన జానారెడ్డి ఈ విషయంలో మాత్రం స్పష్టత ప్రదర్శిస్తూ తన పెద్ద మనిషి తనాన్ని సభలోపలా బయటా చూపిస్తుంటారు. కెసిఆర్ ప్రభుత్వంపైన ఘాటైన విమర్శలు కోరుకునే వారికి ఆయన పద్ధతి రుచించదు.

అసలేమాత్రం దూకుడు లేకపోతే ఇప్పటి రాజకీయాల్లో రాణించడం కష్టం. కాంగ్రెస్లోని ఆయన సహచర నేతలకు ఇది మింగుడుపడక రుసరుసలాడుతూ ఉంటారు. ఆయన్ను మినహాయిస్తే మిగిలిన వారిలో ఎవరికి వారే పెద్దనాయకులు కాబట్టి కాంగ్రెస్లో నాయకులకు కొదవేమీ లేదు. కాకపోతే కెసిఆర్‌కి ప్రత్యర్థి అనిపించుకునే నాయకుడికి మాత్రం కొదవ ఉంది.

ఆ కొరత పూడ్చగలనని రేవంత్, కొంతైనా పూడ్చగలరేమో అని రాహుల్-ఇద్దరూ భావిస్తున్నట్టే కనిపిస్తున్నది. ప్రతి రాష్ట్రంలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే రాహుల్ ఎజెండాలో భాగంగా కూడా చూడొచ్చు. గుజరాత్ లో అల్పేశ్ తర్వాత ఇపుడు తెలంగాణలో రేవంత్ వంతు. బహుశా ఇలాంటి చేరికలను మనం అన్ని రాష్ట్రాల్లోనూ ఎంతో కొంత చూడబోతున్నాం.

ఫొటో సోర్స్, FACEBOOK

వాక్చాతుర్యంలోనూ సామాజిక సమీకరణాలను రాజకీయాలకు అనువుగా ఉపయోగించుకోవడంలోనూ కాకలు తీరిపోయిన కెసిఆర్ ముందు రేవంత్ దూకుడు మంత్రం ఎంతవరకు పనిచేస్తుంది అనేది ప్రశ్న. అలాగే కాంగ్రెస్ లో నేనే కీలకం అని చెప్పుకోవడానికి సాగే నిరంతర రేసులో రేవంత్ ఏ స్థానంలో నిలుస్తారు అనేది మరో ప్రశ్న. రేవంత్ దూకుడుతో ఈ అంతర్గత పోటీ ఏఏ రూపాలు తీసుకుంటుందో ముందు ముందు చూడబోతాం.

''కెసి ఆర్ పై పెద్దగొంతుతో విరుచుకుపడే రెబల్ ముద్ర ఉన్న రాజకీయ నాయకుడిని కాంగ్రెస్ దక్కించుకుంది. ఒక స్థాయిలో ఆ లోటు పూడ్చుకున్నట్టే. కానీ పరిస్థితిలో మౌలిక మార్పు ఉండదు. ఇది గేమ్ ఛేంజర్ ఏమీకాదు'' అనేది నల్సార్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ఫ్రొఫెసర్‌గా పనిచేస్తున్న విశ్లేషకులు హరతీ వాగీశన్ అభిప్రాయం.

తెలుగు రాజకీయాల్లో కులం ప్రస్తావన లేకుండా మాట్లాడుకోవడం కష్టం. తెలంగాణ రాష్ర్ట ఉద్యమం ఆధిపత్యపు సమీకరణాల్లో మార్పులు చేసి వెలమలను అధికారంలోకి తీసుకొచ్చిందనే భావన ఉంది. రాజకీయ ఆధిపత్యం కోల్పోయిన రెడ్డి నాయకులు సమీకృతమవ్వాలని ప్రయత్నిస్తున్నారు. రాజకీయ ఆధిపత్యం కోసం సాగే పోరాటం అది. కొంతవరకు పార్టీలకు అతీతంగా కూడా ఆ ప్రయత్నాలు సాగుతున్నాయి. ఆ సమీకరణ కేంద్రంగా రేవంత్ పనిచేస్తారా అనేది సామాజిక కోణం.

ఫొటో సోర్స్, FACEBOOK

తెలుగుదేశం పార్టీలో ఆయన నాయకత్వస్థానాల్లోకి దూసుకుపోయి గుర్తింపు తెచ్చుకోవడానికి ఇపుడు కాంగ్రెస్‌లో ఉండే పరిస్థితులకు బోలెడంత తేడా ఉంది. కమ్మ కులస్తులకు తెలంగాణలో బలం లేదు కాబట్టి స్థానికంగా బలీయమైన కులాలనుంచి నాయకత్వాన్ని చూపించడం చంద్రబాబుకి అవసరం. కానీ కాంగ్రెస్లో ఇప్పటికే రెడ్ల మధ్య విపరీతమైన పోటీ ఉంది. పార్టీ పరిస్థితి ఓ మోస్తరుగా ఉన్నపుడే ఇంత పోటీ ఉంటే బలపడితే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

అయితే లక్ష్యం ఎలా ఉన్నా దాని రూపాలు విశాలంగా కనిపించేట్టు చూసుకోవడం పాపులర్ రాజకీయాల్లో విస్తృతంగా కనిపించే అంశం. రేవంత్ రాహుల్ దగ్గరకు వెళ్లినపుడు తనతో పాటు సబ్బండ వర్ణాలకు చెందిన ఒక మోస్తరు నాయకులను చాలామందిని తీసుకువెళ్లారు. తనను తాను ఆయా వర్గాల ప్రతినిధిగానే కాకుండా వారిని కాంగ్రెస్ వైపు మళ్లించేవారిగా చూపించుకోవడం ఆయన లక్ష్యంగా కనిపించింది.

తెలంగాణ రెడ్డి నాయకుల్లో లోపల్లోపల సాగుతున్న ప్రయత్నాలను పక్కనబెడితే ఉద్యమంలో తమ ఆట పాటలతో, మండించే మాటలతో కీలక పాత్ర పోషించిన శిబిరం ఒకటున్నది. అది మిలిటెంట్ వామపక్ష శిబిరం. ఓట్ల రాజకీయాల్లో బలహీనంగా ఉన్నా ప్రజా ఉద్యమాల్లో ఇప్పటికీ వారే దీపధారులు- ఎంత బలహీనపడినప్పటికీ. టిఆర్ఎస్ నీరసపడిన ఒకానొక దశలో మిణుకుమిణుకుమంటున్న ఉద్యమాన్ని నిలబెట్టడంలో వారి కృషి చాలా ఉందని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న చాలామంది చెపుతారు.

ఇపుడు కెసిఆర్ పాలనా విధానాలమీద తీవ్ర విమర్శలు చేస్తున్న వాళ్లలో వారు అగ్రభాగంలో ఉన్నారు. ఆ నేపథ్యమున్న నాటి తెలంగాణ జెఎసి కన్వీనర్ కోదండరామ్‌ని ప్రత్యర్థిగా ముందుకు తీసుకురావాలనే ప్రయత్నాలు జరిగాయి. ఆసక్తి -శక్తి, రెంటిలో ఏ తేడాల వల్లనో కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఒకనాటి విప్లవ వాగ్గేయకారుడు గద్దర్ కు ఆసక్తి మెండుగా ఉన్నప్పటికీ ముందూ వెనుకా ఊగిసలాడుతూ ఏ రూపం తీసుకోవాలనే విషయంలో నలుగుతూనే ఉన్నట్టు కనిపిస్తుంది.

పాటలతో జనాన్ని ఆకర్షించడం వేరు, పార్లమెంటరీ ప్రజాస్వామ్య రాజకీయాల్లో జనాన్ని కూడగట్టడం వేరు. రెంటికీ వేర్వేరు విద్యలు అవసరమవుతాయి. ఇటీవల రూపం మార్చుకున్న గద్దర్ సారాంశంలో ఈ రెండో విద్య ఎంతమేరకు వంటబట్టించుకున్నారు అనేది ప్రశ్నార్థకం.

కెసిఆర్: నేనే రాజు - నేనే మంత్రి!

ఇప్పటికైతే తెలంగాణలో కెసిఆర్ తిరుగులేని బలమైన నేతగా కనిపిస్తున్నారు. వ్యూహ చాతుర్యంలోనూ జనాలను ఆకట్టుకునే వాక్పటిమలోనూ పోటీనిచ్చే నాయకులు కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఉద్యమ సందర్భంగా హైదరాబాద్ ఎస్ బీ ఐ ఎదురుగా ఉన్న హాల్లో ఎపిసిఎల్సీ నిర్వహించిన సభలో చేసిన అద్భుతమైన ప్రసంగం ఇపుడాయనకు గుర్తుందా అనే ప్రశ్నలున్నాయి. ఉద్యమంలో చెప్పిన మాటలకు అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన మాటలకు పొంతన లేదనే విమర్శలున్నాయి.

ఇక ఏ ప్రజా ఆందోళనలు తెలంగాణ సాధనలో ఉపయోగపడ్డాయని భావిస్తున్నారో అవే ఆందోళనలకు చిన్న కేంద్రంగా ఉన్న ధర్నాచౌక్ ను కూడా ఆయన సహించలేకపోయారనే వాదనలున్నాయి. ఆందోళనల ఫలితం ఏకరూపమెత్తి అధికారం పొందిన కెసిఆర్ ఎలాంటి ప్రజాందోళనలను ఏమాత్రం సహించలేక పోవడం ఏంటని ప్రజాస్వామిక వాదులు ప్రశ్నిస్తున్నారు. కుటుంబ పాలన గురించి అయితే చెప్పనే అక్కర్లేదు. క్యాబినెట్లో ఒక్క మహిళకు కూడా చోటు కల్పించకపోవడంపై ప్రశ్నలున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఉపాధి కల్పన గురించిన అసంతృప్తి ఇపుడిపుడే పెరుగుతోంది. ఉస్మానియా లాంటి విశ్వవిద్యాలయాల్లో వాతావరణం మారుతోంది. గ్రామీణ రంగాన సాగు- త్రాగునీటి అవసరాలకోసం భారీ ప్రాజెక్టులు చేపట్టిన మాట వాస్తవమే అయినా ఇప్పటికైతే వ్యవసాయ సంక్షోభం తీవ్రంగానే ఉంది. ఆయన చేసిన లేదా చేయని పనుల కంటే కూడా ఆయన వైఖరిపై తీవ్రాతితీవ్రమైన విమర్శలున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ర్ట సమితి అని వాడకుండా పదే పదే ఇక్కడ కెసిఆర్ అని వాడడం అక్కడున్న స్థితికి సంకేతం. ఆయన వైఖరి పూర్తిగా ఫ్యూడల్ యాజమాన్య పద్ధతిలో ఉంటుంది అనే అభియోగం బలంగా ఉంది. సదస్సుల్లోనూ, సమావేశాల్లోనూ అన్నింటా అదే ధోరణి ప్రతిఫలిస్తుంది అనే మాట ఉంది. రాజకీయాల్లో పరిణామాలంటూ వస్తే చాలా వేగంగా వచ్చే మాట వాస్తవమే కానీ ఇప్పటికైతే అది కెసిఆర్ రాజ్యం.

తాను తన పద్ధతిలో నరుక్కువస్తుంటే కుమారుడు కెటిఆర్ యువతను ఆకట్టుకునే ఆధునిక రూపాల్లో ముందుకెడుతున్నారు. పాలనలోని బలహీనతలను సొమ్ము చేసుకోగలిగి జనాన్ని తమవైపు తిప్పుకోగలిగిన నాయకత్వ లేమి ప్రత్యర్థి పార్టీల్లో కనిపిస్తూ ఉంది. రేవంత్ తన పద్ధతులను మార్చుకుని పెద్ద నాయకుడిగా ఎదుగుతారా, లేక ఇంకేదైనా శక్తి ఆ స్థానాన్ని భర్తీ చేస్తుందా అనేది జవాబు చెప్పలేని ప్రశ్న. అది తెలంగాణ పాపులర్ ప్రజాక్షేత్రంలో ఇపుడున్న సంక్లిష్ట స్థితి.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)