ప్రెస్ రివ్యూ: ఇంటికో ఉద్యోగం అసాధ్యం అన్న ఈటెల

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ

ఫొటో సోర్స్, UniversityofHyderabad/Facebook

వివక్షకు నిరసనగా హెచ్‌సీయూలో మరోసారి వెలివాడ వెలిసింది. విద్యార్థి సంఘాల ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన లూనావత్ నరేష్ గెలుపుని అధికారికంగా ప్రకటించకపోవడం వర్సిటీలో ఆందోళనలకు దారి తీసింది.

ఫలితాలను తారుమారు చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆరోపిస్తోంది. దీనిని నిరసిస్తూ రెండు రోజులుగా గిరిజన విద్యార్థులు వెలివాడలో నిరాహారదీక్షకు ఉపక్రమించినట్లు సాక్షి కథనం పేర్కొంది.

ట్రైబల్‌ స్టూడెంట్స్ అసోసియేషన్‌కు చెందిన నరేష్ ఏబీవీపీ అభ్యర్థిపై 264 ఓట్ల తేడాతో వైస్ ప్రెసిడెంట్‌గా గెలుపొందారు. అయితే, పోటీ చేయటానికి అభ్యర్థికి 75 శాతం హాజరు తప్పనిసరి అని, నరేష్‌కు అది లేదంటూ ఏబీవీపీ అధ్యక్షుడు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలోనే యూనివర్శిటీ ఈ ఎన్నికను ప్రకటించలేదని తెలుస్తోంది. కానీ, తనకు 75 శాతం హాజరు ఉందని, ఈ మేరకు పోటీకి ముందే తనకు యూనివర్శిటీ ధ‌ృవీకరణ పత్రం ఇచ్చిందని నరేష్ చెబుతున్నారు. ఈ వ్యవహారంపై కమిటీతో విచారణ జరిపిస్తామని యూనివర్శిటీ తెలియజేస్తోందని ఈ కథనం వివరించింది.

ఫొటో సోర్స్, AndhraPradeshCM/facebook

‘వినాయకుడిలా కాదు.. కుమారస్వామిలా కష్టపడాలి’

వినాయకుడిలాగా చుట్టూ తిరిగితే కాదని, కుమారస్వామిలాగా కష్టపడాలని పలువురు ఎమ్మెల్యేలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. అమరావతిలో జరిగిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కొందరు ఎమ్మెల్యేలు వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరు కాకపోవడంతో, వాళ్లంతా బిజీగా ఉన్నారేమో.. అడిగానని చెప్పండి అంటూ జోకులు వేశారు.

ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి కాస్త ఒళ్లు వంచాలని సూచించారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఇంటింటికీ తిరుగుతూ సచివాలయానికి రాకపోవడంతో చాలా ప్రశాంతంగా ఉందని బాబు అన్నట్లు ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images

‘ఇదే అత్యంత చెత్త సచివాలయం’

హైదరాబాద్‌లో ఉన్నంత చెత్త సచివాలయం దేశంలో ఎక్కడా లేదని తెలంగాణ సీం కేసీఆర్ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త సచివాలయాన్ని నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. నిధులు వృధా చేస్తున్నారన్న విపక్షాల విమర్శలను కేసీఆర్ కొట్టిపారేశారు.

ఏపీలో నిర్మాణ ఆకృతులను ప్రస్తావిస్తూ.. మనమూ అలాంటివి నిర్మించుకోవద్దా అని ప్రశ్నించారు. కొంతమంది పరధి దాటి ఆలోచించలేరంటూ కేసీఆర్ విపక్ష నేతలకు చురకలు వేశారని ఈనాడు కథనం పేర్కొంది.

ఫొటో సోర్స్, Govt of Telangana

‘ఇంటికో ఉద్యోగం అసాధ్యం’

ఇంటికో ఉద్యోగం అసాధ్యమని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో, ప్రస్తుతం 1.2 లక్షల ఖాళీలు ఉన్నాయని, వాటి భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అయితే కొత్త రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయనే ఆశతోనే యువత ఉద్యమంలో పాల్గొందని ప్రతిపక్ష నేత షబ్బీర్ ఆలీ అన్నారు. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో విఫలమైందని ఆరోపిస్తూ సభ నుంచి వాకౌట్ చేసినట్లు మనతెలంగాణ కథనం పేర్కొంది.

పోలవరం పనులకు రాష్ట్ర ప్రభుత్వ చెల్లింపులు

పోలవరం పనులను వేగవంతం చేసేందుకు రూ.1000 కోట్ల విలువైన పనులను కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. అనుకున్న సమయానికి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి దేవినేని ఉమ తెలిపారు.

సీఎం చంద్రబాబు నాగ్‌పూర్‌లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ప్రత్యేకంగా కలిసి, కొత్త టెండర్లకు అనుమతి తీసుకున్నారని వివరించారు. కోర్టులో కేసులు వేసి పనులను అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని దేవినేని ఆరోపించినట్లు ఆంధ్రప్రభ కథనం పేర్కొంది.

ఫొటో సోర్స్, MANJUNATH KIRAN

ఫొటో క్యాప్షన్,

సిద్ధరామయ్య

‘కర్ణాటకలో కన్నడ తప్పనిసరి’

కర్ణాటకలో ఉండాలంటే కన్నడ నేర్చుకోవాల్సిందే అని ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య అన్నారు. కర్ణాటక ఆవిర్భావ దినోత్సవంలో మాట్లాడుతూ, ప్రాథమిక పాఠశాలల్లో మాతృభాషలోనే బోధన జరగాలని సూచించారు.

దీనిపై ప్రధానికి రెండుసార్లు లేఖలు కూడా రాసినా, ప్రతిస్పందన లేదన్నారు. కర్ణాటకలో ఉంటున్న వారు తాము కన్నడం నేర్చుకోవడంతో పాటు వారి పిల్లలకూ నేర్పించాలని సిద్ధరామయ్య అన్నట్లు నమస్తే తెలంగాణ కథనం పేర్కొంది.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)