నెహ్రా నీ స్వింగ్‌ మరువతరమా

ఆశిష్ నెహ్రా

ఫొటో సోర్స్, Getty Images

18 ఏళ్ల సుదీర్ఘ క్రీడా ప్రస్థానం.. 164 మ్యాచ్‌లు.. 235 వికెట్లు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ నాలుగైదు ఏళ్లు మెరిసి ఆ తర్వాత కనుమరగయ్యే ఈ రోజుల్లో ఈ గణాంకాలు చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తాయి.

ఈ గణాంకాలు మరెవరివో కావు. టీమిండియాలో తనదైన ముద్ర వేసి, రిటైర్మెంట్ ప్రకటించిన ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రావి.

ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో వేలాదిమంది క్రీడాభిమానుల మధ్య నెహ్రా ఆటకు వీడ్కోలు పలికాడు.

బహుశా అంతర్జాతీయ క్రికెట్‌లో ఏ ఫాస్ట్ బౌలర్ కెరీర్ కూడా ఇంత సుదీర్ఘ కాలం కొనసాగి ఉండదేమో!

పొడుగ్గా, సన్నగా ఉండే నెహ్రా 1999లో శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌తో తన అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించాడు.

మొత్తం 120 వన్డేలు ఆడిన నెహ్రా, 157 వికెట్లు పడగొట్టాడు. 27 అంతర్జాతీయ టీ-20 మ్యాచ్‌లలో 34 వికెట్లు తీసుకున్నాడు.

ఆశిష్ నెహ్రా

ఫొటో సోర్స్, Getty Images

10 ఓవర్లు.. 23 పరుగులు.. 6 వికెట్లు

2003లో దక్షిణాఫ్రికాలో జరిగిన ప్రపంచ కప్‌లో భారత్ ఇంగ్లండ్‌తో తలపడుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 250 పరుగులు చేసింది. ఆ మ్యాచ్‌లో భారత్ ఖచ్చితంగా విజయం సాధించి తీరాల్సిన పరిస్థితి.

భారత కెప్టెన్ సౌరభ్ గంగూలీ డర్బన్ ఫాస్ట్ పిచ్‌పై ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసే బౌలర్ కోసం చూస్తున్నాడు.

ఆ సమయంలో ఆశిష్ నెహ్రా జట్టును ఆపద్బాంధవుడిలా ఆదుకున్నాడు. 10 ఓవరల్లో కేవలం 23 పరుగులిచ్చి, 6 వికెట్లు పడగొట్టాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో నెహ్రా అత్యుత్తమ ప్రదర్శన అదే.

నిజానికి బౌలింగ్ చేస్తున్నపుడు నెహ్రాకు గ్రౌండ్‌లోనే వాంతులు అయ్యాయి. అందరూ నెహ్రా తన కోటా ఓవర్లు పూర్తి చేయలేడేమోనని భావించారు.

కానీ నెహ్రా మొండిఘటం. కొన్ని అరటి పళ్లు తిని, బలం పుంజుకుని మళ్లీ గ్రౌండ్‌లోకి వచ్చాడు. భారత్‌కు విజయం చేకూర్చి పెట్టాడు.

ఆశిష్ నెహ్రా

ఫొటో సోర్స్, Getty Images

స్పెషలిస్ట్ బౌలర్

ప్రత్యేకించి డెత్ ఓవర్లలో తక్కువ పరుగులు ఇస్తాడని నెహ్రాకు మంచి పేరుంది. టీమ్ కష్టాల్లో ఉన్నపుడు బౌలింగ్ చేయడం తనకు ఇష్టమని అతను కూడా చాలాసార్లు చెప్పాడు.

యువకుల ఫార్మాట్‌గా పేర్కొనే టీ-20 ఫార్మాట్‌లో నెహ్రా అత్యుత్తమ బౌలర్‌గా ఉద్భవించాడు. 88 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ఆడిన నెహ్రా 106 వికెట్లు పడగొట్టాడు.

ఇవాళ్టి రోజుల్లో దాదాపు క్రికెటర్లంతా సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటున్నారు. కానీ ఈ విషయంలో నెహ్రా కొంచెం భిన్నం.

నెహ్రాకు ట్విటర్ అకౌంట్ ఉన్నా, అతను చివరిగా జులై 15న ట్వీట్ చేసాడు. అది చాలా టైమ్ తినేస్తుందని, అందుకే దానికి దూరంగా ఉంటానని నెహ్రా ఓసారి తెలిపారు.

చాలాసార్లు అతని చేతిలో పాత నోకియా ఫోనే కనిపిస్తుంది.

ఆశిష్ నెహ్రా

ఫొటో సోర్స్, Getty Images

ఫిట్‌నెస్సే ప్రధాన శత్రువు

వన్డే, టీ-20 ఫార్మాట్‌లలో అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన నెహ్రా, టెస్టుల్లో మాత్రం అంత విజయవంతం కాలేదు. కేవలం 17 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన నెహ్రా.. 44 వికెట్లు పడగొట్టాడు.

టెస్టుల్లో అతని వైఫల్యానికి ప్రధాన కారణం ఫిట్‌నెస్. గాయాల కారణంగా అతను టెస్టుల్లో సుదీర్ఘమైన స్పెల్ వేయలేడు. అతను తన చివరి టెస్ట్‌ను 2004లో ఆడాడు.

అభిమానులు, తోటి క్రీడాకారులు ప్రేమగా 'నెహ్రాజీ' అని పిలుచుకునే నెహ్రా స్వింగ్ బౌలింగ్‌ను భారత క్రీడా ప్రేమికులు ఇక చూడలేరు.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)