తెలంగాణ : ప్రభుత్వాన్ని విమర్శించినందుకు కండక్టర్ సస్పెన్షన్

  • పృథ్వీరాజ్
  • బీబీసీ తెలుగు
సస్పెన్షన్ ఉత్తర్వుతో కండక్టర్ సంజీవ్

ఫొటో సోర్స్, Facebook

''గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రిని, కార్మికశాఖ మంత్రిని, రవాణాశాఖ మంత్రిని, టీఎస్‌ఆర్‌టీసీ అధికారులను సోషల్ మీడియా (ఫేస్‌బుక్) ద్వారా మీరు విమర్శించినట్లు ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారణ అయింది. ... ఈ ఆరోపణలు ప్రాతిపదికగా.. టీఎస్ఆర్‌టీసీ ఎంప్లాయీస్ (క్లాసిఫికేషన్), కంట్రోల్ అండ్ అప్పీల్ రెగ్యులేషన్ 1967 లోని 18(ఎ) సెక్షన్ కింద మిమ్మల్ని తక్షణం సస్పెండ్ చేస్తున్నాం...'' - టీఎస్ఆర్‌టీసీ యాజమాన్యం తన ఉద్యోగి అయిన ఓ బస్ కండక్టర్‌కు జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వు సారాంశమిది.

ఫొటో సోర్స్, Sanjeev D

ఆ కండక్టర్ పేరు డి.సంజీవ్. ఎనిమిదేళ్లుగా నిజామాబాద్ డిపో-1లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆర్‌టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా కూడా ఉన్నారు. టీఎస్ ఆర్‌టీసీలో కార్మికుల సమస్యలను ఉటంకిస్తూ యాజమాన్యం అనుసరిస్తున్న విధానాలను విమర్శిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టులు చేస్తున్నారు. ఈ అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ప్రశ్నలు సంధిస్తూ.. ఎన్నికలకు ముందు కేసీఆర్ ఇచ్చిన హామీల అమలు అంశాన్నీ ప్రస్తావిస్తూ పలు పోస్టులు చేశారు.

దీంతో ముఖ్యమంత్రి మీద, టీఎస్‌ఆర్‌టీసీ అధికారుల మీద సోషల్ మీడియాలో విమర్శలు చేశారన్న ఆరోపణలతో అక్టోబర్ 4వ తేదీన ఆయనకు టీఎస్ఆర్‌టీసీ నోటీసు పంపించింది. కరీంనగర్‌లో విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ వద్ద విచారణకు హాజరవ్వాలని నిర్దేశించింది.

ఫొటో సోర్స్, Sanjeev D

వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించలేదు: కండక్టర్

ఆ విచారణకు హాజరైన తాను కార్మికులు, సంస్థ ప్రయోజనాల కోసమే ఆ పోస్టులు చేశానని వివరణ ఇచ్చినట్లు కండక్టర్ సంజీవ్ బీబీసీ ప్రతినిధితో పేర్కొన్నారు.

ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శిస్తూ పోస్టులు పెట్టలేదని ఆయన చెప్తున్నారు. ఆ తర్వాత విధులకు హాజరైన తనను అక్టోబర్ 18వ తేదీ నుంచి విధులకు పంపకుండా డిపోలో 'స్పేర్‌'లో ఉంచి, నిజామాబాద్‌లో విచారణకు హాజరు కావాలని చెప్పారని తెలిపారు.

ఈ విషయమై తనపై ఎవరు ఫిర్యాదు చేశారో తెలియజేయాలని సదరు విచారణాధికారిని కోరగా.. 'మీపై ఈ కేసులో ఎవరూ కంప్లైంట్ చేయలేదు. కానీ ప్రింట్ మీడియాలో మరియు సోషల్ మీడియాలో వచ్చిన వాటి ఆధారంగా నిజామాబాద్-1 డిపో మేనేజర్ నన్ను ఎంక్వైరీ చేయమని ఆదేశించారు' అని ఆ అధికారి రాతపూర్వకంగా పేర్కొన్నట్లు సంజీవ్ చెప్పారు.

అనంతరం.. తనను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు నవంబర్ ఒకటో తేదీన ఉత్తర్వులు అందించారని వివరించారు.

ఫొటో సోర్స్, Facebook

విజిలెన్స్ అంతర్గత నివేదిక ఉంది: డీఎం

అయితే.. కండక్టర్ సంజీవ్ సోషల్ మీడియాలో చేసిన పోస్టుల మీద విజిలెన్స్ విభాగం అందించిన అంతర్గత నివేదిక ఆధారంగా విచారణ, చర్యలు చేపట్టినట్లు నిజామాబాద్-1 డిపో మేనేజర్ ఆనంద్‌ బీబీసీ ప్రతినిధితో పేర్కొన్నారు. సంస్థలో పనిచేసే ఉద్యోగులు సంస్థ ప్రతిష్ఠను దిగజార్చే విధంగా ప్రవర్తించరాదని టీఎస్ఆర్‌టీసీ నిబంధనలు నిర్దేశిస్తున్నాయని.. ఉద్యోగులు తమ ఫిర్యాదులు, సమస్యలను తగిన వేదిక మీద వాటిని ప్రస్తావించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. అయితే ఇది ప్రాథమిక విచారణ మాత్రమేనని, ఇంకా పూర్తి విచారణ జరగాల్సి ఉందని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Facebook

సస్పెన్షన్ అన్యాయం, దుర్మార్గం: సీఐటీయూ

సంజీవ్‌ మీద సస్పెన్షన్ వేటు వేయడం వాక్‌‌స్వాతంత్ర్య హక్కును కాలరాయడమేనని కొన్ని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ''ఆర్‌టీసీ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసినందుకు ఉద్యోగిని సస్పెండ్ చేయడం చాలా అన్యాయం. ఆయన మీద ఎలాంటి ఫిర్యాదూ లేదు. ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఇలా సస్పెండ్ చేయడం దుర్మార్గం'' అని తెలంగాణ రాష్ట్ర సీఐటీయూ కార్యదర్శి పి.భాస్కర్ బీబీసీ ప్రతినిధితో పేర్కొన్నారు. ఈ సస్పెన్షన్‌ను వెంటనే ఉపసంహరించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఫొటో సోర్స్, Facebook

కండక్టర్ సస్పెన్షన్‌ చట్టవిరుద్ధం: న్యాయవాది

''సోషల్ మీడియాలో అభిప్రాయ వ్యక్తీకరణకు ప్రతి వ్యక్తికీ స్వేచ్ఛ ఉంది. సోషల్ మీడియాలో పోస్టులు అభిప్రరాయ వ్యక్తీకరణ కిందకు వస్తాయి కానీ.. ప్రచారం కిందకు రావు. అది శిక్షార్హమైన నేరం కాదు. భావప్రకటనా స్వేచ్ఛ పౌరులందరికీ సమానంగా ఉంటుంది. ఉద్యోగులకూ ఉంటుంది'' హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది ఉబ్బా జైభీమ్‌ రావు పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Facebook

కండక్టర్ సస్పెన్షన్ ఉదంతం మీద ఆయన బీబీసీ ప్రతినిధితో మాట్లాడుతూ.. ''నాకు తెలిసినంత వరకూ సంస్థ 'ప్రతిష్ఠను దిగజార్చటం' అనే అంశానికి సంబంధించి ఆర్‌టీసీ నిబంధనల్లో 'సోషల్ మీడియా' అనే ప్రస్తావన ఉండటానికి అవకాశం లేదు. చట్టంలోనే లేనప్పుడు సోషల్ మీడియాలో విమర్శనాత్మక పోస్టులు అనే ఆరోపణతో సస్పెండ్ చేయడం, క్రమశిక్షణ చర్యలు చేపట్టడం చట్ట విరుద్ధం'' అని వివరించారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)