ఫేక్ న్యూస్: 2017 'వర్డ్ ఆఫ్ ది ఇయర్'

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

'ఫేక్ న్యూస్'... ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించిన పదం ఇదేనని అంతర్జాతీయ డిక్షనరీ ప్రచురణ సంస్థ 'కొలిన్స్' ప్రకటించింది.

ట్విటర్‌నీ, వార్తల్లో హెడ్ లైన్లనీ ఈ ఏడాది ఆ పదం ఒక ఊపు ఊపేసిందనీ, అందుకే దాన్ని 'వర్డ్ ఆఫ్ ది ఇయర్'గా ఎంపిక చేశామనీ ఆ సంస్థ చెబుతోంది. మొత్తంగా ఆ పదం వినియోగం 365శాతం మేర పెరిగిందట.

వార్తల్లో, సోషల్ మీడియా పోస్టుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తావన వచ్చినప్పుడు 'ఫేక్ న్యూస్' అన్న పదాన్ని ఎక్కువగా ఉపయోగించారు. రాజకీయాలకే సంబంధించిన మరో రెండు పదాలు.. 'ఆంటిఫా', 'ఎకో చాంబర్'‌లకు కూడా ఎక్కువగా ఉపయోగించిన పదాల జాబితాలో చోటు దక్కింది.

సోషల్ నెట్‌వర్కింగ్ ఆప్ 'ఇన్‌స్టాగ్రామ్'కు సంక్షిప్త రూపమైన 'ఇన్‌స్టా', ఈ ఏడాది విపరీతంగా ప్రచారంలోకి వచ్చిన 'ఫిడ్జెట్ స్పిన్నర్'లు కూడా కొలిన్స్ జాబితాలో ఉన్నాయి. కానీ అవేవీ 'ఫేక్ న్యూస్'‌ని దాటలేకపోయాయి.

'న్యూస్ రిపోర్ట్ పేరుతో సంచలన, తప్పుడు సమాచారాన్ని అందించడమే ఫేక్ న్యూస్' అని 'కొలిన్స్' నిర్వచించింది. ఈ పదానికి వచ్చే ఏడాది విడుదలయ్యే కొలిన్స్ డిక్షనరీలో చోటు దక్కనుంది.

ట్రంప్, థెరిసా మే, జెరెమీ కార్బిన్ లాంటి రాజకీయ నేతలు 'ఫేక్ న్యూస్' పదాన్ని ఎక్కువగా ఉపయోగించిన వాళ్లలో ఉన్నారు.

గడిచిన నాలుగేళ్లలో కొలిన్స్ 'వర్డ్ ఆఫ్ ది ఇయర్'గా ఎంపికైనవి ఇవే

2016 - బ్రెక్సిట్: 'యూరోపియన్ యూనియన్ నుంచి యూకే నిష్ర్కమణ'.

2015 - బింజ్ వాచ్: విరామం లేకుండా ఎక్కువ టీవీ కార్యక్రమాలను వీక్షించడం.

2014 - ఫొటోబాంబ్: ఫొటో దిగే సమయంలో మధ్యలో అడ్డుపడి దాన్ని చెడగొట్టడం.

2013 - గీక్: కంప్యూటర్ల రంగంలో ఎక్కువ నైపుణ్యం, ఆసక్తి ఉన్న వ్యక్తి.

‘గిగ్ ఎకానమీ’, ‘జెండర్ ఫ్లూయిడ్’, ‘కఫింగ్ సీసన్’ లాంటి పదాలకు కూడా ఎక్కువ మంది ఉపయోగించిన పదాల జాబితాలో చోటు దక్కింది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)