రూ.6.5 లక్షల విస్కీ: 139 ఏళ్లనాటిది కాదు 40 ఏళ్ల నాటిదే!

మెకెలాన్ విస్కీ బాటిల్

కొన్ని రోజుల క్రితం ఝాంగ్ వియ్ అనే ఓ చైనా కుర్రాడు దాదాపు 6.5లక్షల రూపాయలు పెట్టి స్కాట్లాండ్‌లో ఓ పెగ్గు విస్కీ కొన్నాడు. దాదాపు 140 ఏళ్ల చరిత్రున్న ఆ విస్కీని తాగడం అదృష్టం అనుకున్నాడు. కానీ చాలా రోజులకు కానీ తెలీలేదు, ఆ విస్కీ కేవలం నలభై ఏళ్ల క్రితం నాటిదని.

చైనాలో అత్యధిక సంపాదన ఉన్న ఆన్‌లైన్ రచయితల్లో ఝాంగ్ వియ్ ఒకరు. కొన్ని రోజుల క్రితం తన బామ్మతో కలిసి ఝాంగ్ స్కాట్లాండ్ పర్యటనకు వెళ్లాడు. అక్కడ 'వాల్దాస్' అనే హోటల్‌కి వెళ్లినప్పుడు 'మెకెలాన్' పేరుతో ఉన్న విస్కీ బాటిల్ అతడి కంట పడింది. హోటల్ వాళ్లని అడిగితే అది అమ్మకానికి కాదని చెప్పారు.

ఆ విస్కీ 139ఏళ్ల నాటిదని తెలీడంతో ఎలాగైనా దాన్ని రుచి చూడాలని ఝాంగ్ అనుకున్నాడు. దాంతో హోటల్ వాళ్లు దాదాపు రూ.6.5లక్షల రూపాయలు తీసుకొని ఒక పెగ్గుని ఝాంగ్‌కి అమ్మారు. దాంతో అత్యంత ఖరీదైన విస్కీ పెగ్గుగా అది వార్తల్లో నిలిచింది.

ఫొటో క్యాప్షన్,

కొన్న చాలా రోజులకు తెలిసింది ఆ విస్కీ నకిలీదని

ఎంతో చరిత్రున్న విస్కీని తాగుతున్నట్టు భావించిన ఝాంగ్ ఆ ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ 'దీని వయసు మా బామ్మ వాళ్ల బామ్మ వయసు కంటే ఎక్కువ' అంటూ సంతోషంగా చెప్పాడు. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు.

పత్రికల్లో ఆ బాటిల్ ఫొటోని చూసిన కొందరు విస్కీ ఇండస్ట్రీ నిపుణులకు అది అంత పాతది కాదేమోనన్న అనుమానం వచ్చింది. అదే విషయాన్ని హోటల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు.

వెంటనే స్పందించిన హోటల్ మేనేజర్ ఆ విస్కీని పరీక్షల కోసం పంపించారు. కార్బన్ డేటింగ్ పరీక్షలు నిర్వహించిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నిపుణులు దాన్ని 1970-72 మధ్య తయారు చేసుంటారని తేల్చారు. ఆర్‌డబ్ల్యు101 అనే మరో సంస్థ కూడా అదే విషయాన్ని రూఢీ చేయడంతో హోటల్ యాజమాన్యం తన తప్పు తెలుసుకుంది.

ఝాంగ్‌కి నేరుగా విషయం చెప్పాలనుకున్న హోటల్ మేనేజర్ నేరుగా చైనా వెళ్లాడు. తమ హోటల్ చేసిన పొరబాటుని ఝాంగ్‌కి చెప్పడంతో పాటు, అతని నుంచి తీసుకున్న మొత్తం డబ్బుని తిరిగిచ్చేయడం విశేషం.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)