కేటీఆర్: లక్ష కాదు.. లక్షా 12 వేల ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం

KTR

తెలంగాణలో లక్ష కాదు.. మరో 12 వేలు కలిపి.. మొత్తం లక్షా 12 వేల ఉద్యోగాలు ఇస్తామని ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పష్టం చేశారు. పదవీ కాలం పూర్తయ్యేలోపు ఆ ఉద్యోగాలను ఇవ్వకపోతే.. అప్పుడు అడగండని పేర్కొన్నారు.

ఆయన 2017 నవంబర్ 11వ తేదీ శుక్రవారం దిల్లీలోని బీబీసీ కార్యాలయంలో బీబీసీ న్యూస్ తెలుగు ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడారు.

ఈ సందర్భంగా బీబీసీ తెలుగు ప్రతినిధులు అడిగిన ప్రశ్నలతో పాటు ఫేస్‌బుక్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగు ఆడియన్స్ పోస్ట్ చేసిన ప్రశ్నలకు కూడా సమాధానాలిచ్చారు.

తెలంగాణలో ఉద్యోగాల హామీ, ఇతర రాజకీయ, సామాజిక అంశాలపై వచ్చిన ప్రశ్నలపై స్పందించారు.

దాదాపు 40 నిమిషాల పాటు ఈ లైవ్ జరిగింది. ఇందులో కేటీఆర్ ఏ అంశంపై ఏమన్నారో ఆయన మాటల్లోనే..

కేబినెట్‌లో మహిళలకు చోటు లేకపోవడంపై..

రాజకీయ సమీకరణాల వల్ల కొన్నిసార్లు మహిళలకు అవకాశాలు రాకపోవచ్చు. అది లోటే. ఆ లోటును ముఖ్యమంత్రి గారు సవరించుకుంటారేమో చూడాలి.

కేసీఆర్ తయారు చేసిన వేల నాయకుల్లో కోదండరామ్ ఒకరు

కోదండరామ్ వ్యవహారం పెద్ద విషయమని నేను అనుకోను. కేసీఆర్ తయారు చేసిన వందల, వేల నాయకుల్లో ఆయన ఒకరు. అంతేకాని కేసీఆర్‌కు ఆయన సమ ఉజ్జీ కాదు. జయశంకర్ గారు ప్రతిపాదిస్తేనే కోదండ రామ్ గారు జేఏసీ ఛైర్మన్ అయ్యారు.

ప్రజల్లో ఎవరికుండే గుర్తింపు వాళ్లకు ఉంటది. టీఆర్ఎస్ లేకపోతే జేఏసీ ఎక్కడిది? టీఆర్ఎస్ వెనకుండి జేఏసీని నడిపించింది.

2014 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలని కోదండ రామ్ గట్టిగా కోరుకున్నారు. ఆ కోణంలోనే తనకు నచ్చిన వాళ్లకు కాంగ్రెస్‌లో టికెట్లు ఇప్పించుకున్నారు.

చంద్రబాబుది గోబెల్స్ ప్రచారం

ఒక ప్రాంతానికి ఉండే అనుకూలతల వల్ల అక్కడికి పెట్టుబడులు వస్తాయి. అంతే కానీ ఒక వ్యక్తి వల్ల రావు.

హైదరాబాద్‌కు ఐటీని చంద్రబాబు తీసుకొస్తే బెంగళూరుకు ఎవరు తీసుకొచ్చారు?

బెంగళూరు ఇవాళ హైదరాబాద్‌ కంటే ముందు ఉంది. అక్కడ ఏ ముఖ్యమంత్రి పేరూ వినపడటం లేదే? సహజ అనుకూలతల వల్ల హైదరాబాద్ ఐటీ కేంద్రంగా మారింది.

కానీ నావల్లే ఇదంతా అని గోబెల్స్ ప్రచారం చేసుకుంటే ఎట్లా?

హైదరాబాద్‌ను అందరూ వాడుకున్న వాళ్లే. హైదరాబాద్‌కు ఎవరూ చేసింది ఏమీ లేదు. చంద్రబాబు గారు మీడియా మేనేజ్ మెంట్‌లో సిద్ధహస్తులు.

ఆయన ఇంద్రుడు, చంద్రుడు అంటూ మీడియా ప్రచారం చేసింది తప్ప ప్రజలు అనుకోలేదు.

అందుకే 2004లో ఓడించారు. ఆయన ఏ హైటెక్ సిటీ కట్టించానని చెప్పుకుంటున్నారో అది ఉండే శేరిలింగంపల్లిలో కూడా ఆయన పార్టీ ఓడిపోయింది.

ఆందోళనలు ఎక్కడ జరుగుతున్నాయి?

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అసంతృప్త వాతావరణం ఉన్నట్లు ఎక్కడైనా కనిపిస్తోందా? ఆందోళనలు ఎక్కడ జరుగుతున్నాయి? నేను హైదరాబాద్‌లోనే ఉంటున్నా అయినా ఎప్పుడూ ఏమీ వినలేదే. తెలంగాణలో అసంతృప్తి ఉన్నట్లు ఏ ఎన్నికల్లోనైనా కనిపించిందా? ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే ముఖ్యం కానీ మీడియా, ప్రతిపక్షాలు ఏమనుకుంటున్నాయనే దానితో మాకు సంబంధం లేదు.

ఇంటికో ఉద్యోగమని ఎవరన్నారు?

ఇంటికో ఉద్యోగమని ఎవరన్నారు? ఈ మాట మేము అన్నామని ఆధారాలతో సహా నిరూపిస్తే ఇక్కడే నా మంత్రి పదవికి రాజీనామా చేసి పోతా.

తెలుగుదేశం వాళ్లు చెప్పినదాన్ని కాంగ్రెస్ వాళ్లు మాకు ఆపాదిస్తే అది వాళ్ల ఖర్మ.

ఎన్నికల్లో లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. లక్షా 12 వేల ఉద్యోగాలు వస్తున్నాయి. మాకు ఇంకా సమయం ఉంది. మేము దిగిపోయే లోపు ఇవ్వకపోతే అడగండి.

అవసరం లేని ఉద్యోగాలను భర్తీ చేయడం ప్రభుత్వం పని కాదు. 2000 పాఠశాలల్లో 10 మంది కంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. అలాంటప్పుడు ఇష్టారీతిన ఎలా ఉపాధ్యాయులను నియమిస్తాం?

ఇవాళ టీఎస్‌పీఎస్‌సీని ఆదర్శంగా తీసుకోమని యూపీఎస్సీనే చెబుతోంది.

ఇష్టారీతిన ఫేస్‌బుక్‌లో పోస్టులు ఎలా పెడతారు?

ఒక సంస్థలో పని చేసే వాళ్లు ఆ సంస్థకు వ్యతిరేకంగా ప్రచారం ఎలా చేస్తారు? స్వేచ్ఛ ఉంది కదాని ఇష్టారీతిన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌లు ఎలా పెడతారు? ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ దానికే నష్టం కలిగించాలని చూస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే తప్పేంటి? (ఫేస్‌బుక్‌ పోస్ట్ వల్ల కండెక్టర్‌ను సస్పెండ్ చేయడంపై..)

వాస్తుపై నాకు నమ్మకం లేదు

అన్ని విషయాల్లో గుడ్డిగా పోను. దేన్నైనా హేతుబద్ధంగా ఆలోచిస్తాను. దైవం, వాస్తు అనే వాటిపై నాకు నమ్మకం లేదనేది వాస్తవమే. అలాగే ఇతరుల విశ్వాసాలను కూడా గౌరవిస్తాను.

రేవంత్ రెడ్డి వల్ల సముద్రాలు తెలంగాణకు వస్తాయి!

రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం వల్ల అన్ని సముద్రాలు ఉప్పొంగి తెలంగాణకు వస్తాయి (వ్యంగ్యంగా). రేవంతర్ రెడ్డి జాతీయ నాయకుడు అవుతారు. బ్రహ్మాండాలు బద్ధలు అయిపోతాయి. చాలా అద్భుతాలు జరుగుతాయి.

బీజేపీ మాకు పోటీ కాదు

మాకు భారతీయ జనతా పార్టీ పోటీ కాదు. ఇప్పుడున్న సీట్లను అది నిలబెట్టుకుంటేనే గొప్ప. మాకు కాంగ్రెస్సే ప్రధాన ప్రత్యర్థి. ఈసారి కూడా మెజారిటీ సీట్లు మేమే సాధించి ఎవరికీ అందనంత దూరంలో ఉంటాం.

ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్‌లో కానీ మరే ఏ పార్టీలో కానీ కేసీఆర్ గారి చిటికిన వేలుకు సరిపోయే నాయకుడు కూడా లేడు.

వారసత్వ రాజకీయాలు

వారసత్వం అనేది ఎంట్రీ పాస్ లాంటిది. కష్టపడితేనే పైకి వస్తారు. మన సామర్థ్యాన్ని చూసి ప్రజలు ఆదరిస్తారు.

సీఎం కావాలని నేను అనుకోవడం లేదు

మంత్రి అవుతానని నేను అనుకోలేదు. నిజానికి నా స్థాయికి, నా సామర్థ్యానికి ఇదే ఎక్కువ. ముఖ్యమంత్రి అయిపోవాల, ప్రధాన మంత్రి అయిపోవాల అనే పెద్దపెద్ద ఆశలు నాకు లేవు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)