ప్రెస్ రివ్యూ: అబ్బాయిల ఎదురు కట్నం

ఉద్యోగులు అరగంట, గంట ఆలస్యంగా వచ్చినా పట్టించుకోము: చంద్రబాబు

చంద్రబాబు నాయుడు

ఫొటో సోర్స్, AndhraPradeshCM/facebook

"ఉద్యోగుల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. నేను గతంలోలాగా కాదు. ప్రస్తుతం ఉద్యోగులపై ఎలాంటి ఒత్తిడి పెట్టకుండా వారి సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నాను" అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారని సాక్షి పత్రిక కథనం పేర్కొంది.

ఈ- ఆఫీస్ ద్వారా ఉద్యోగులు ఎక్కడ్నుంచైనా పనిచేసే సౌలభ్యముంది, కాబట్టి కార్యాలయానికి అరగంట, గంట ఆలస్యంగా వచ్చినా పట్టించుకోబోమని తిరుపతిలో చంద్రబాబు స్పష్టం చేశారు.

ఎదురు కట్నం ఇస్తున్న అబ్బాయిలు

ఫొటో సోర్స్, Getty Images

తెలుగు రాష్ట్రాల్లో పెళ్లికాని ప్రసాదులు పెరిగిపోతున్నారు. అమ్మాయిలు దొరక్క కులాంతర వివాహాలు చేసుకుంటున్నారు. రైతులు, పురోహితులకు కల్యాణయోగం కష్టంగా మారింది.

కట్నం కోసం డిమాండ్లు.. లాంఛనాల కోసం అలగడాలు అన్నీ పోయి.. "అమ్మాయి తరఫువారు ఏమడిగినా ఇస్తాం. పిల్లనిస్తే చాలు, అదే పదివేలు" అని అబ్బాయి తరఫువారు సర్దుకుపోయే కాలం వచ్చేసింది. అంటూ ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రచురించింది.

ఆత్మలకూ 'ఉపాధి'

ఏపీలో ఉపాధి హామీ పథకం అమలులో అక్రమాలు పెచ్చుమీరాయంటూ సాక్షి ఓ కథనాన్ని ప్రచురించింది.

"తెలుగుదేశం పార్టీ పాలనలో ఆత్మలకు ప్రాణమొస్తోంది. ఉపాధి హామీ పథకంలో ఆ ఆత్మలు పనిచేస్తూ బిల్లులు కూడా తీసుకుంటున్నాయి’’ అంటూ 2013లో మరణించిన పశ్చిమ గోదావరి జిల్లావాసి పాముల గంగరాజు ఈ ఏడాది 48 రోజులు పనిచేసినట్టు స్థానిక టీడీపీ నేతలు, అధికారులు కుమ్మక్కై బిల్లులు తీసుకున్నారని పేర్కొంది.

అమరావతిలో స్టార్ హోటళ్ల నిర్మాణానికి క్యూ

ఫొటో సోర్స్, APgovt

నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో స్టార్ హోటళ్లను ఏర్పాటు చేసేందుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలు క్యూ కడుతున్నాయి.

2020కల్లా అమరావతిలో 1200 అధునాతన హోటల్ గదులు అందుబాటులోకి వస్తాయని సీఆర్‌డీఏ అంచనా వేస్తోంది.

హోటళ్ల నిర్మాణానికి వీలుగా కొన్ని నిబంధనల్లో సవరణలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. అందుకు ప్రభుత్వం అంగీకరిస్తే మరిన్ని ప్రముఖ సంస్థలు ముందుకొచ్చే అవకాశం ఉందని సీఆర్‌డీఏ భావిస్తోందని ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది.

రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం: కేటీఆర్

తెలంగాణలో రైతులు ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా నూతన ఫుడ్ ప్రాసెసింగ్ విధానాన్ని తీసుకొస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు.

ఈ విధానం ద్వారా రాష్ట్రానికి సుమారు రూ.20వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని, దాంతో 1.25లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు దొరుకుతాయని వెల్లడించారు.

శనివారం దిల్లీలో జరిగిన వరల్డ్ ఫుడ్ ఇండియా-2017లో రూ.1250 కోట్ల విలువైన 9 అవగాహన ఒప్పందాలను తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకుందని నమస్తే తెలంగాణ కథనం పేర్కొంది.

కృష్ణాపై వాదోపవాదాలు!

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు రెండు రాష్ట్రాల నీటి పారుదల శాఖ అధికారుల మధ్య వాగ్వివాదానికి వేదికగా నిలిచింది.

నీటి పంపిణీ మినహా మిగిలిన అనేక అంశాలపై తీవ్రస్థాయిలో వాదోపవాదాలు, చర్చలు జరిగినా పలు అంశాలపై తుది నిర్ణయానికి రాలేదు.

నీటి వినియోగంపై విస్తృతంగా చర్చించిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు 66 శాతం, తెలంగాణకు 34 శాతం కేటాయిస్తూ నిర్ణయం జరిగిందని ఈనాడు కథనం వెల్లడించింది.

దీని ప్రకారం ఏపీకి 215 టీఎంసీలు, తెలంగాణకు 115 టీఎంసీల జలాలు వస్తాయని అంచనా.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)