నల్లమల అడవుల్లో కట్టెలబండి.. పేదలకు బతుకు బండి

  • డి.ఎల్. నరసింహ
  • బీబీసీ తెలుగు కోసం
రైలు బండి కాదు బతుకు బండి

(గమనిక: ఈ కథనం 2017 నవంబరు 5న ప్రచురితమైంది. అప్పుడు చదవని వారికోసం..)

ఇది ఏపీలోని నల్లమల అభయారణ్యం. నిరుపేదలకు ఇదే జీవనాధారం. సమీప గ్రామాల ప్రజలు అడవి తల్లిని నమ్ముకునే బతుకు బండిని లాగిస్తున్నారు.

వీరిలో కొందరికి అడవికెళ్లి కట్టెలు కొట్టి తేవడమే వీళ్ల జీవనాధారం. కట్టెలను పట్టణాలకు తీసుకెళ్లి అమ్ముకుని, వచ్చిన డబ్బులతో పొట్టపోసుకుంటారు. అడవికి వెళ్లకుంటే పస్తులు తప్పవు.

ఒకప్పుడు చాలా మంది ఈ పనితోనే పొట్టపోసుకునే వారు. రైలు బండ్లన్నీ కట్టెలు తీసుకెళ్లే పేద జనాలతో నిండిపోయేవి.

అయితే అటవీ అధికారులు కట్టడి చేయడంతో ఇప్పుడు కొద్ది మందే ఈ 'వృత్తి'లో ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది వృద్ధులు, మహిళలు. ఇది తప్ప మరో పని తమకు తెలియదని వారంటారు.

వీడియో క్యాప్షన్,

నిరుపేదల బతుకు బండి ఇది!

కట్టెలు పట్టణాలకు తరలించేందుకు వీళ్లకు సొంత వాహనాలు లేవు. అడవి మధ్యలోంచి వెళ్లే ప్యాసెంజర్ రైళ్లే వీరికి 'సరుకు' రవాణా వాహనాలు.

గుంటూరు, నంద్యాల మీదుగా ప్రయాణించే రైళ్లు నల్లమల అభయారణ్యం నుంచి వెళ్తుంటాయి. ఈ మార్గంలో దిగువమెట్టు, చలమ, గాజులపల్లి రైల్వేస్టేషన్లు దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్నాయి.

ఇక్కడ నివసించే వారికి వంట చెరుకు, వెదుర్ల అమ్మకమే ప్రధాన జీవనాధారం. అడవి నుంచి వీటిని తెచ్చుకుని, రైళ్లలో పట్టణానికి తీసుకెళ్లి అక్కడ అమ్ముకుంటారు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ డబ్బులతో పాటు కట్టెలమ్మగా వచ్చిన డబ్బులతో బతుకు బండిని లాగిస్తున్నారు.

వీరందరి జీవనోపాధికి ప్యాసింజర్ రైళ్లు బాసటగా నిలుస్తున్నాయి. ఈ మార్గంలోని రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల కంటే కట్టెల కోసం వచ్చేవారే ఎక్కువగా కనిపిస్తారు.

కట్టెలు, వెదురు మోపులతో ప్రయాణికులకు ఇబ్బందిగానే ఉంటుంది. కానీ పేదల కష్టాలు చూసి సర్దుకుపోతుంటారు.

అడవి నుంచి కట్టెలు తెచ్చుకొని వాటిని అమ్ముకునే వరకు ఎంతో ప్రయాసపడాల్సి ఉంటుందని వీరు చెబుతున్నారు. ఓవైపు అడవి జంతువుల భయం.. మరోవైపు ఫారెస్ట్ అధికారుల భయం నిత్యం వెంటాడతాయని చెబుతున్నారు. అడవిలో చెట్లు కొట్టకూడదని తెలిసినా కుటుంబ షోషణకు తప్పటం లేదంటున్నారు వీళ్లు.

అయితే వీళ్లు అమ్మడానికి తీసుకెళ్లేది రాలిపడిన ఎండు కర్రలే కాబట్టి అటవీ అధికారులు చూసీ చూడనట్టు ఉంటున్నారు. గతంతో పోలిస్తే జనాల్లో ఈ అలవాటు చాలా వరకు తగ్గిందనీ, చాలా కొద్ది మంది మాత్రమే ఇంకా దీనినే ఉపాధిగా చేసుకొని జీవనం గడుపుతున్నారని అటవీ అధికారులంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)