ముందు మనిషిని, తర్వాతే డాక్టర్ని: డోలీ మోసిన ఒడిశా డాక్టర్

  • ప్రవీణ్ కాసం
  • బీబీసీ తెలుగు
డోలీ మోస్తున్న డాక్టర్ ఓంకార్ హోతా

ఫొటో సోర్స్, Omkar/Debi Maity

ఫొటో క్యాప్షన్,

డోలీ మోస్తున్న డాక్టర్ ఓంకార్ హోతా

ఒడిశాలోని పప్పులూరు అనే మారుమూల గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలలో పని చేసే ఓంకార్ హోతా అనే డాక్టర్ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు.

మల్కన్‌గిరి జిల్లాలోని పప్పులూరు మావోయిస్టుల ప్రాబల్యం బాగా ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది. ఇక్కడ రోడ్లు, కమ్యూనికేషన్ సౌకర్యాలు దాదాపు లేవని చెప్పొచ్చు.

డాక్టర్ ఓంకార్ పప్పులూరులో గత 8 నెలలుగా పని చేస్తున్నారు. అంతకు ముందు ఆయన బొలాంగీర్ జిల్లాలో పని చేసేవారు.

పప్పులూరుకు దాదాపు 12 కి.మీ. దూరంలో ఉన్న సరిగట్ట అనే ఆదివాసీ గ్రామంలో ఓ నిండు గర్భిణీ కాన్పు కోసం ఇబ్బంది పడుతోందని శుక్రవారం నాడు ఒక విలేకరి అందించిన సమాచారంతో డాక్టర్ ఓంకార్ అక్కడికి చేరుకొని ఆ మహిళకు పురుడు పోశారు.

అంతేకాదు, విపరీతమైన రక్తస్రావంతో ఆమె పరిస్థితి విషమించగా ఆమెను మోసుకొని వైద్య కేంద్రానికి చేర్చేందుకు స్వయంగా డోలీ మోశారు.

అసలా రోజు ఏం జరిగిందో వివరంగా తెలుసుకోవడం కోసం డాక్టర్ ఓంకార్‌నూ, అతడికి సహాయంగా వచ్చిన స్థానిక జర్నలిస్టు దేబీ మెయిటీ.. ఇద్దరితో బీబీసీ మాట్లాడింది. పూర్తి వివరాలు వారి మాటల్లోనే..

ఫొటో సోర్స్, Omkar/Debi Maity

ఫొటో క్యాప్షన్,

ప్రసవవేదన పడుతోన్న మహిళను ఆరోగ్యకేంద్రానికి తరలించేందుకు డాక్టర్ ఓంకార్ సిద్దమయ్యారు.

'నెలకు ఆరేడు సార్లు ఇలాంటి పరిస్థితులే ఎదురవుతుంటాయి'

"ఆ రోజు నేను విధుల్లో ఉండగా స్థానిక జర్నలిస్టు దేబీ మెయిటీ నుంచి ఫోన్ వచ్చింది. సరిగట్ట గ్రామంలో ఓ మహిళ ప్రసవ వేదన పడుతోందని ఆయన చెప్పారు. మోటర్ సైకిల్ మీద వస్తున్నా, అక్కడికి వెళ్దాం సిద్ధంగా ఉండండి అని అన్నారు.

సరిగట్ట గ్రామం కుర్మనూరు పంచాయతీ కిందకు వస్తుంది. చిత్రకొండ బ్లాక్‌లో ఉన్న ఆ ఊరికి సరైన దారి కూడా లేదు. దాదాపు 12 కిలోమీటర్ల తోవలో అనేక వాగులు, వంకలూ దాటాల్సి ఉంటుంది.

జర్నలిస్టు మోటారు సైకిల్ మీదే నేను బయలుదేరాను. అనేక చోట్ల దిగుతూ, ఎక్కుతూ ఇబ్బందిగా అక్కడికి చేరుకున్నాం. ప్రసవవేదన పడుతోన్న సుభమా మర్సె (30) ఆరోగ్య పరిస్థితి అప్పటికే విషమంగా మారింది.

నిజానికి ఆమెది సిజేరియన్ చేయాల్సిన పరిస్థితి. కానీ, అక్కడ ఆపరేషన్ చేసే అవకాశం ఏ మాత్రం లేదు. దీంతో రిస్కు తీసుకొని ఆ పూరిగుడిసెలోనే పురుడు పోశా.

ఆమెకు బాబు పుట్టాడు. బాబు ఆరోగ్యంగానే ఉన్నాడు.

అయితే ప్రసవం సమయంలో సుభమాకు బాగా రక్తస్రావం అయింది. బీపీ 75/ 44 కు పడిపోయింది. ఆమెకు వెంటనే వైద్యం అందకపోతే ప్రాణాలకు ప్రమాదం.

దీంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లాలనుకున్నా. కానీ, ఊళ్లో ఎవరూ ఆమెకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు.

ఆమె కొండరెడ్ల తెగకు చెందిన మహిళ. వారి ఆచారం ప్రకారం ప్రసవ సమయంలో ఎవరూ గర్భిణులకు సహాయం చేయొద్దు. వారం రోజుల పాటు భర్తతో సహా ఎవరూ ఆమెను చూడడానికి, తాకడానికి కూడా వీలులేదు.

తల్లీబిడ్డలను ఆ ఊరు నుంచి పప్పులూరు ఆస్పత్రికి వరకు తీసుకెళ్లేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎవరిని సహాయం అడిగినా మాట్లాడకుండా తలా ఓ దిక్కు పారిపోయారు.

చివరకు డబ్బులిస్తామంటే ఒక వ్యక్తి ముందుకొచ్చాడు. దాంతో ఆమె భర్త, ఆ వ్యక్తి... ఇద్దరూ డోలీ మీద మోసుకొని అక్కడి నుంచి బయలు దేరాం.

తోవలో వాళ్లిద్దరూ అలసిపోయి, భుజాలు మొద్దుబారడంతో, నేనూ, విలేకరి దేబీ ఇద్దరం కూడా డోలీని కాస్త దూరం మోశాం.

ఎలాగో కష్టపడి వారిని ఆరోగ్య కేంద్రానికి చేర్చాం. వెంటనే సెలైన్ ఎక్కించి ఆమెకు చికిత్స ప్రారంభించా. నా పై వైద్య అధికారులకు ఫోన్ ద్వారా విషయం తెలియజేశాను.

24 గంటల తర్వాత ఆమె పరిస్థితి కొద్దిగా మెరుగైంది. ప్రస్తుతం ఆమె బలహీనంగానే ఉన్నా ప్రాణాపాయం మాత్రం లేదు. పిల్లాడు బాగానే ఉన్నాడు.

ఆమెకు ఇది మూడో కాన్పు. ఇదివరకు ఆమెకు ఇద్దరు పిల్లలు పుట్టగా ఒకరు చనిపోయారు.

ఇదంతా మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతం. ఇక్కడ సరైన రోడ్లు, వసతి సౌకర్యాలు ఏవీ లేవు. నాకు ఉండటానికి కూడా వసతి సౌకర్యం కూడా లేదు. ఆరోగ్య కేంద్రంలోనే నా మకాం.

ఆస్పత్రిలో నర్సులు లేరు. సహాయ సిబ్బంది కూడా ఉండరు. అంబులెన్స్ సౌకర్యం లేదు.

ఇలా డోలీ మోసుకుంటూ రోగులను నా ఆస్పత్రికి తీసుకురావడం కొత్తేమీ కాదు. నెలలో 6, 7 సార్లు నాకిలాంటి పరిస్థితే ఎదురవుతుంది. అలాంటి సందర్భాల్లో నేను డాక్టర్ కంటే ముందు ఒక మనిషిని అని గుర్తు చేసుకుంటా."

ఫొటో సోర్స్, Omkar/Debi Maity

ఫొటో క్యాప్షన్,

సరిగట్ట గ్రామస్తులతో కలసి డోలీ మోస్తున్న జర్నలిస్టు దేబీ మెయిటీ

'నేనూ డోలీ మోశాను'

"నా పేరు దేబీ మెయిటీ. స్థానిక న్యూస్7 టీవీ చానెల్‌లో జర్నలిస్టుగా పనిచేస్తున్నా. శుక్రవారంనాడు సరిగట్టలో ఓ మహిళ ప్రసవవేదన పడుతోందని నాకు ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే పప్పులూరులో ఉండే డాక్టర్ ఓంకార్‌కు ఫోన్ చేశాను.

అయితే ఫోన్ సిగ్నల్స్ సరిగా లేకపోవడంతో చేసేది లేక కాల్ కనెక్ట్ కాలేదు. వెంటనే మోటారు సైకిల్ పై డాక్టర్ దగ్గరికి బయల్దేరాను.

తోవలో ప్రయత్నించగా సిగ్నల్ దొరికింది. దాంతో డాక్టర్‌కు విషయం చెప్పాను. ఆయన అక్కడికి వెళ్లడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు.

నేను పప్పులూరు చేరుకొని డాక్టర్ ఓంకార్‌ను నా బైక్ మీద సరిగట్టకు తీసుకెళ్లా. చాలా కష్టపడి సరిగట్టకు చేరుకున్నాం. డాక్టర్ ఆమెకు కాన్పు చేశారు.

అయితే ఆమెకు చికిత్స అవసరం. పప్పులూరు తీసుకెళ్లాలంటే మోసుకెళ్లాల్సిందే. మరో సౌకర్యం లేదు.

కానీ సహాయం చేయడానికి ఎవరూ ముందుకురాలేదు. భర్త మాత్రమే ముందుకొచ్చాడు.

డబ్బులిస్తామంటే మరో వ్యక్తి సిద్ధపడ్డాడు. డోలీలో ఆమెను మోసుకుంటూ పప్పులూరు వైద్యకేంద్రానికి తీసుకొచ్చాం.

డాక్టర్ కూడా డోలీ మోశారు. వారు అలసిపోయినప్పుడు నేను డోలీ మోశాను."

సోషల్ మీడియాలో స్పందించిన మంత్రి

ఈ ఘటనపై పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఫేస్‌బుక్‌లో స్పందించారు. యువ డాక్టర్ తీరుకు సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు.

'ఒడిశా కొత్త ముఖచిత్రం అతను. ఒడిశా గర్వపడేలా చేశారు. అందరూ ఇదే నిబద్దతతో పనిచేయాలి' అని అన్నారు.

ఒడిశా ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఒక పత్రికా ప్రకటనలో డాక్టర్ ఓంకార్ చూపిన మానవత్వాన్ని ప్రశంసిస్తూ అభినందనలు తెలిపింది.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)