అమెరికా: టెక్సాస్ చర్చిలో కాల్పులు, 26 మంది మృతి

టెక్సాస్ కాల్పులు

ఫొటో సోర్స్, MAX MASSEY/ KSAT 12/via REUTERS

ఫొటో క్యాప్షన్,

ఈ చర్చి వద్దే కాల్పుల ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు

అమెరికాలోని టెక్సాస్‌ సమీప ప్రాంతంలోని ఓ చర్చి వద్ద గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరపడంతో 26 మంది మృతి చెందారు.

టెక్సాస్‌లోని చిన్నపట్టణం విల్సన్ కంట్రీలోని సుదెర్‌ల్యాండ్‌లో ఉన్న ఫస్ట్ బాప్టిస్ట్ చర్చిలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

స్థానిక కాలమాన ప్రకారం 11.30 గంటలకు చర్చిలోకి ప్రవేశించిన ఆగంతకుడు అక్కడే కాల్పులు ప్రారంభించాడు. ఈ ఘటన తర్వాత అతను కూడా చనిపోయాడు.

ఈ ఘటనలో 26 మంది మృతిచెందారని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబ్బొట్ తెలిపారు. టెక్సాస్ చరిత్రలోనే ఇది దారుణమైన సంఘటనగా పేర్కొన్నారు.

చనిపోయినవారి వయసు 5 నుంచి 72 ఏళ్ల వరకు ఉంటుందని టెక్సాస్ ప్రజా రక్షణ ప్రాంతీయ డైరెక్టర్ ఫ్రీమన్ మార్టిన్ తెలిపారు. గాయపడిన 20 మందిని ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. అనుమానితుడికి 20 ఏళ్లు ఉండొచ్చని, పూర్తిగా నలుపురంగు దుస్తులు, ముసుగు వేసుకొని తుపాకీతో చర్చిలో ప్రవేశించాడని మార్టిన్ వెల్లడించారు.

అనుమానితుడు కాల్పులు జరిపి పారిపోతున్నప్పుడు స్థానికుడొకరు అతడ్ని వెంబడించి తుపాకీని లాక్కొన్నట్లు తెలుస్తోంది.

"స్థానికుడు వెంటాడుతున్న క్రమంలోనే అనుమానితుడు వేగంగా కారు నడుపుతూ గుడలుపే కంట్రీ లైన్‌లో ప్రమాదానికి గురయ్యాడు. కారులో అనుమానితుడి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. అయితే అతను కాల్పుల వల్ల మరణిచాడా ఇతర కారణాల వల్ల అనేది తెలియరాలేదు" అని మార్టిన్ తెలిపారు.

కాల్పులు జరిపింది డెవిన్ పి కెల్లే (26) అని అమెరికా మీడియా పేర్కొంది. కానీ, పోలీసులు మాత్రం ఇప్పటి వరకు ఎవరి పేరు వెల్లడించలేదు.

తన మనవరాలు అనబెల్లే (14) కూడా కాల్పుల్లో చనిపోయిందని ఫస్ట్ బాప్టిస్టు చర్చి ఫాదర్ ఫ్రాంక్ పొమెరోయ్ ఏబీసీ న్యూస్‌తో చెప్పారు.

"కాల్పుల మోత మాకు వినిపించింది. మేం చర్చికి 50 గజాల దూరంలోనే ఉంటాం" అని ప్రత్యక్షసాక్షి కారీ మాటుల్లా చెప్పారు. "ఇది చాలా చిన్న ప్రాంతం, అందుకే ఇక్కడేంజరిగిందో అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు" అని అన్నారు.

శాన్ అంటొనో పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుదెర్‌ల్యాండ్ స్ర్పింగ్.. 500 మంది ఉండే చిన్నప్రాంతం.

కాగా, కాల్పులు జరిపిన వ్యక్తి ఉద్దేశం ఏంటో ఇంకా తెలియరాలేదని ఎఫ్‌బీఐ అధికారులు తెలిపారు.

'పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం'

టెక్సాస్ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఆసియా పర్యటనలో ఉన్న ఆయన "జపాన్ నుంచి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నా" అంటూ ట్వీట్ చేశారు.

నెల రోజుల కిందట లాస్ వేగాస్‌లోని సంగీత కచేరీలో ఇలానే ఒకరు కాల్పులకు తెగబడటంతో 56 మంది చనిపోయిన విషయం తెలిసిందే.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)