ప్రెస్ రివ్యూ: 'ప్యారడైజ్ పేపర్స్‌లో వైఎస్ జగన్ పేరు!

పారడైస్ పేపర్స్ జగన్

ఫొటో సోర్స్, facebook

ఫొటో క్యాప్షన్,

పారడైస్ పేపర్స్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరును ఉటంకిస్తూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనాన్ని ప్రచురించింది

ప్రపంచ వ్యాప్తంగా అపర కుబేరుల పన్ను ఎగవేత రహస్యాలను బట్టబయలు చేసిన ప్యారడైజ్‌ పేపర్స్‌లో 180 దేశాలకు సంబంధించిన వివరాలున్నాయి.

ఎక్కువ మంది పేర్లున్న దేశాల పరంగా భారత్ 19వ స్థానంలో నిలిచింది. మన దేశానికి చెందిన 714 మంది పేర్లు ఈ పేపర్లలో ఉన్నాయి.

నందన్ లాల్ ఖేమ స్థాపించిన సన్ గ్రూప్ సంస్థ వివిధ పేర్లతో 118 డొల్ల కంపెనీలు స్థాపించి ఈ జాబితాలో రెండోస్థానంలో నిలిచింది.

అలాగే, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి పేరు కూడా ఇందులో ఉందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఆంగ్లపత్రిక ఒక కథనంలో పేర్కొంది. ఆయనకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై సీబీఐ తాజాగా దాఖలు చేసిన కేసుకు సంబంధించిన వ్యవహారమే ఈ పేపర్లలో ఉందని తెలిపింది.

ఫొటో సోర్స్, kodandaram/Facebook

ఫొటో క్యాప్షన్,

కోదండరాం పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి

తెలంగాణ జేఏసీ రాజకీయ పార్టీ!

"రాజకీయపార్టీని ఏర్పాటు చేయాలంటూ టీ జేఏసీ కీలక నేతలు పలువురు కోదండరాంపై ఒత్తిడి తెచ్చారు. చర్చ పక్కదారి పడుతోందంటూ ఆయన వారిని సముదాయించారు. కానీ, 'కోదండరాం పార్టీ ఏర్పాటు చేసి తీరుతారు. ముసుగులో గుద్దులాటలు వద్దు. ఆయన(కోదండ)ని మీరు (విలేకరులు) ఎన్నిసార్లు అడిగినా సమాధానం చెప్పరు. అంతా సిద్ధమైంది. 3,4 పేర్లను ఇప్పటికే సిద్ధం చేసుకున్నాం. సంక్రాంతి తర్వాత కోదండనే ప్రకటిస్తారు' అని ఆయనకు అత్యంత సన్నిహితుడైన నేత ఒకరు చెప్పినట్లు ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది.

మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో టీ జేఏసీ విసృత స్థాయి సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా పలువురు జిల్లా జేఏసీ నేతలు మాట్లాడుతూ పార్టీ ఏర్పాటు చేయాలంటూ కోదండరాంపై ఒత్తిడి తెచ్చారు. అయితే, కోదండరాం వారిని సముదాయిస్తూ '2018జనవరిలోపు టీ జేఏసీ నిర్మాణాన్ని క్షేత్రస్థాయిలో బలోపేతం చేద్దాం. అనంతరం పార్టీ ఏర్పాటుపై దృష్టి సారిద్దాం' అని చెప్పారు. కాగా, పార్టీని ఏర్పాటు చేయాలంటూ టీ జేఏసీ నేతలు ఒత్తిడి చేసిన విషయం నిజమేనని కోదండరాం అంగీకరించారని ఆంధ్రజ్యోతి ప్రచురించింది.

ఫొటో సోర్స్, janasena/facebook

ఫొటో క్యాప్షన్,

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్

వైసీపీకి జనసేన భయం!

2019 ఎన్నికల బరిలో దిగుతామని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రకటించారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఆయన చీల్చితే మళ్లీ అధికారం తమకు ఎండమావే అవుతుందన్న భయం వైసీపీ నేతలకు పట్టుకుంది. వైసీపీకి జనసేన పెద్ద అవరోధంగా మారిందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయంటూ ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని ప్రచురించింది.

నారాయణ, శ్రీచైతన్య హాస్టళ్లు నరకానికి నకళ్లు

రాష్ట్రంలోని నారాయణ, శ్రీచైతన్య కాలేజీలకు చెందిన హాస్టళ్లలో విద్యార్థులకు నరకం కనిపిస్తోంది. తగిన మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. కంటినిండా నిద్రలేదు. కడుపునిండా తిండి లేదు. కాలేజీ హాస్టళ్లలో సమయపాలన లేదు.. ఆటలు లేవు. కనీసం సెలవు దినాల్లోనూ విరామం ఇవ్వడం లేదని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్టు ప్రత్యేక బృందాలు జరిపిన తనిఖీల్లో బయటపడిందని సాక్షి కథనం ప్రచురించింది.

వారం రోజులు నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థల 146 హాస్టళ్లలో బోర్టు అధికారుల బృందాలు తనిఖీలు చేయగా.. లోపాలు బయటపడినట్లు తెలంగాణ ఇంటర్మీడియట్ కార్యదర్శి అశోక్ వెల్లడించారు. అనుంబంధ గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ కాలేజీలకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. 15 రోజుల సమయం ఇచ్చామని, సమాధానం వచ్చిన తర్వాత చర్యలు చేపడుతామని అన్నారని సాక్షి ప్రచురించింది.

తెలంగాణలో సబ్సిడీ గ్యాస్ భారం రూ.196 కోట్లు

గత 16 నెలల్లో సబ్సిడీ సిలిండర్ ధరను రూ.250.5 పెంచారు. గతంలో రూ. 567.50గా ఉన్న సబ్సిడీ సిలిండర్ ధర ప్రస్తుతం రూ.808కి పెరిగింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలపై గ్యాస్ సిలిండర్ల భారం రూ.196.41 కోట్లకు చేరిందంటే అతిశయోక్తి కాదు అని నవ తెలంగాణ ఒక కథనాన్ని ప్రచురించింది.

తెలంగాణలో ఇండేన్‌కు 35.28 లక్షలు, భారత్ 29.5 లక్షలు, హెచ్‌పీ గ్యాస్‌కు 20.74 లక్షలు చొప్పున మొత్తం 85.52 లక్షల గ్యాస్ వినియోగదారులున్నారని, పెరిగిన సబ్సిడీ భారాన్ని.. గ్యాస్ వినియోగదారుల సంఖ్యను బట్టి ఈ మొత్తాన్ని లెక్కించినట్లు వివరించింది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)