వులర్ సరస్సును కాపాడుతున్న బిలాల్ అహ్మద్
ఇతను 17 ఏళ్ల బిలాల్. పేద పిల్లాడు. కానీ ఆసియాలోనే అతి పెద్ద మంచినీటి సరస్సు ‘వులర్’ను రక్షిస్తున్నాడు. దీంతో ఇతన్ని స్వచ్ఛభారత్‌కు అంబాసిడర్‌గా నియమించారు.
ఇతను ఆ సరస్సును ఎలా రక్షిస్తున్నాడో బీబీసీ ప్రతినిధి అమీర్ పీర్జాదా రూపొందించిన పై వీడియోలో చూడొచ్చు.
బిలాల్ అహ్మద్ తండ్రి మేకలు మేపుతూ వులర్ సరస్సులో పేరుకు పోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరుకుంటూ జీవనం సాగించేవారు. క్యాన్సర్‌తో మరణించిన తండ్రి బిలాల్‌కి వదిలి వెళ్లిన ఆస్తి ఒక చెక్క పడవ మాత్రమే.
అంతరించిపోతున్న సరస్సు
ఆసియాలోనే అతి పెద్ద మంచి నీటి సరస్సుగా పేరుగాంచిన వులర్ హిమాలయ పర్వతాల మధ్య ఉంది. ఈ సరస్సు శ్రీనగర్‌కు 40 కి.మీ. దూరంలో భారత పాలిత జమ్ము కాశ్మీర్ ప్రాంతంలో నెలకొని ఉంది.
వెట్లాండ్స్ ఇంటర్నేషనల్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ అంచనా ప్రకారం 1911 నుంచి ఇప్పటి వరకు ఈ సరస్సు విస్తీర్ణం దాదాపు 45 శాతం తగ్గిపోయింది.
భారతదేశం రాంసర్ అంతర్జాతీయ జలసంరక్షణ ఒప్పందంపై 1990 లో సంతకం చేసినప్పటికీ, చేపట్టిన చర్యలు మాత్రం నామమాత్రమే అని పర్యావరణ పరిరక్షకులు చెబుతారు.
ఎనిమిదేళ్ల బిలాల్ తండ్రి మరణంతో చదువును వదిలిపెట్టాల్సి వచ్చింది. అప్పటి నుంచి వులర్ సరస్సే అతని జీవనాధారం.
సమన్వయంతో జీవనం
బిలాల్ జీవనోపాధికై ప్రతి రోజూ సరస్సులోకి వెళ్లి 100 నుంచి 200 ప్లాస్టిక్ బాటిళ్లను సేకరిస్తూ రోజుకి సుమారు 150 రూపాయలు సంపాదిస్తాడు. తనతోపాటు మరికొందరు స్నేహితులకు కూడా ఈ పని నేర్పాడు.
"ఈ పని నేను డబ్బులు సంపాదించడం కోసం మాత్రమే చేయలేదు. ఇందులో వేరే ప్రయోజనం కూడా ఉంది. సరస్సు శుభ్రంగా ఉంటేనే ఈ నీటిని మేము తాగడానికి ఉపయోగించుకోవచ్చు" అంటాడు బిలాల్.
బాండిపొరాలో ఒక స్థానిక ఫిలిం మేకర్ తయారు చేసిన డాక్యుమెంటరీ బిలాల్ని ఒక్కసారిగా కాశ్మీర్లో ప్రముఖ వ్యక్తిగా మార్చివేసింది.
శ్రీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ బిలాల్ని 'క్లీన్ ఇండియా' అంబాసిడర్ గా నియమించింది. ఇతనికి ప్రతి నెలా ప్రభుత్వం నుంచి 8,000 రూపాయిలు లభిస్తాయి. దీనితో బిలాల్ తన చదువును మళ్లీ ప్రారంభించాడు.
వులర్ సరస్సును ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలంటే, ముందుగా ఆ సరస్సును శుభ్రం చేయాలి. కానీ శ్రీనగర్ నుంచి ట్రక్కులతో వచ్చే చెత్తతో సరస్సు మొత్తం నిండిపోతోందని 17 సంవత్సరాల బిలాల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
సరస్సు మధ్యలో తేలుతున్న ఓ గుర్రం కళేబరం, నాచు... ఇదీ ఆ సరస్సు ప్రస్తుత పరిస్థితి.
ప్రభుత్వ చర్యలు
వంట చెరకు కోసం సరస్సు చుట్టూ మొక్కలు నాటాలని 1947 లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరస్సు అంతరించిపోవడానికి కారణమైందని వులర్ సరస్సు సంరక్షణ, నిర్వహణ అధికారి (డబ్ల్యూసీఎంఏ) నిస్సార్ అహ్మద్ అంటారు.
సరస్సు సంరక్షణకు మేము గత 5 సంవత్సరాలుగా పని చేస్తున్నాం. శీతాకాలంలో పూడికతీత పరికరాలు పని చేయని కారణంగా కేవలం 1 చదరపు కిలోమీటర్లో మాత్రమే పూడికను తొలగించగలుగుతున్నామని ఆయన చెప్పారు.
సంవత్సరం పొడవునా ఈపని చేయగలిగే పరికరాలను కొనేందుకు ప్రయత్నిస్తున్నామని, దీంతో చుట్టూ పెరుగుతున్న వంట చెరకును కూడా నరికేందుకు వీలవుతుందని ఆయన అన్నారు.
కానీ, ఈ విషయం పై షేర్ ఏ కశ్మీర్ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీకి చెందిన డాక్టర్ ఖుర్షీద్ అహ్మద్ సందేహాలు వ్యక్తం చేశారు. సరస్సు చుట్టూ పెరిగిన వృక్షాలని తొలగిస్తామని చాలా మంది చెబుతున్నారు కానీ, నిజానికి ఏ పనీ జరగలేదని అయన అన్నారు.
కేవలం సరస్సు నిర్వహణను మాత్రమే చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందని పేర్కొన్నారు. శాస్త్రీయంగా పరిశోధన చేయకుండా, ఏ సరస్సునూ పునరుద్ధరించలేమని ఆయన అభిప్రాయపడ్డారు. సరస్సులో ఉన్న జీవ జాలం, పక్షులు, చేపలు వంటి వాటిని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుందని ఖుర్షీద్ చెప్పారు.
సరస్సు పునరుద్ధరణ
ఈ సరస్సును జీవనాధారంగా చేసుకుని సుమారు 30 వేల మంది నివసిస్తున్నారు. ఇక్కడ ఉండే మత్స్యకారులకు ఈ సరస్సు పరిస్థితి చిరపరిచితమే! స్నోట్రౌట్, కార్ప్ అనబడే పంజాబీ రకం చేపలు ఇక్కడ ఎక్కువగా లభిస్తాయి.
ఈ చెరువులో చాలా సంవత్సరాలు అబ్దుల్ రహ్మాన్ మల్లా చేపలు పట్టారు. ఇతనికి గతంలో సరస్సు ఎలా ఉండేదో బాగా తెలుసు. కాని పొద్దుటి నుంచి వేటాడినా కనీసం 10 రూపాయిలు కూడా సంపాదించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇతను ఇక్కడే ఒంటరిగా జీవనం సాగిస్తాడు. ఇతని భార్య మరణించింది. కుమార్తెలు పెళ్లి చేసుకొని వెళ్లిపోయారు. 42 సంవత్సరాల అబ్దుల్ రషీద్ కూడా సరస్సు సంరక్షణకు ప్రభుత్వం చేపట్టే చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సరస్సును బాగా తవ్వాలని ఆయన అంటారు.
వంట చెరకు కోసుకోవడానికి, నీటిలో పండే చెస్ట్నట్ ని పండించుకోవడానికి, గడ్డి కోసం మహిళలు ఇక్కడకు వస్తారని ఆయన తెలిపారు.
ఇది చాలా పెద్ద సరస్సు అని, రోజురోజుకూ అంతరించిపోతోందని 40 సంవత్సరాల హజ్రా బేగం గుర్తు చేసుకుంది.
పురుషులు ఇక్కడకు తమ పశువులను మేపడానికి తీసుకు వస్తారు.
ఇక్కడి నుంచి ఇసుకను తవ్వి లారీలలోకి ఎక్కిస్తారు కొందరు. ఈ పని చేస్తూ గులాం మొహిద్దీన్ మతంజీ రోజుకు 400 రూపాయిలు సంపాదిస్తాడు.
గతంలో ఇక్కడ నాణ్యమైన ఇసుక లభించేదని, ఇపుడు మట్టితో కలిసిపోయిందని ఆయన చెబుతారు.
మేము ఈ సరస్సును శుభ్రంగా చూడాలనుకుంటున్నాం. ఎందుకంటే మా జీవితాలు ఈ సరస్సు పైనే ఆధారపడి ఉన్నాయి.
తన చదువును కొనసాగించాలని, భావి తరాలకి ఈ సరస్సు ఉపయోగపడాలని బిలాల్ ఆశిస్తున్నాడు.
‘‘ఈ సరస్సును పరిశుభ్రంగా చూడటామే నా జీవిత లక్ష్యం.. ఇన్షా అల్లాహ్! నా కల త్వరగా నెరవేరాలి." అని ప్రార్థిస్తున్నాడు బిలాల్.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)