ప్రెస్ రివ్యూ: 'రాజ్యసభకు యనమల'

ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు

ఫొటో సోర్స్, facebook/yanamala

ఫొటో క్యాప్షన్,

ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు

"ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు త్వరలో రాజ్యసభకు వెళ్లనున్నారు. ఆర్థిక మంత్రిగా రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘ సేవలందించిన ఆయన గత కొంతకాలంగా రాజ్యసభకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతుండడంతో వాటిల్లో ఒకదానిని యనమలకు కేటాయించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిసింది.’’ అంటూ ప్రజాశక్తి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.

యనమల స్థానంలో ఆయన కుమార్తె రాష్ట్ర రాజకీయాల్లోకి రానున్నారని వివరించింది.

ఫొటో సోర్స్, facebook/telangana cmo

ఫొటో క్యాప్షన్,

తెలంగాణ సీఎం కేసీఆర్

'ఏ పార్టీ వారు భూ కబ్జాలకు పాల్పడ్డారో తెలుసు'

"ఏ పార్టీ వారు భూ కబ్జాలకు పాల్పడ్డారనేది తెలుసు. అసైన్డ్‌ భూములపై సభాసంఘం త్వరలో తేల్చబోతోంది. అందరి చరిత్రలూ సభలో పెడదాం'' అని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. 'భూ దస్త్రాల ప్రక్షాళన' అంశంపై సోమవారం శాసనసభలో జరిగిన చర్చలో కాంగ్రెస్‌ సభ్యుడు భట్టివిక్రమార్క మాట్లాడుతూ పేదల నుంచి అసైన్డ్‌ భూములు ప్రభుత్వం వెనక్కు తీసుకుంటుందని ఆరోపించిన సందర్భంలో సీఎం జోక్యం చేసుకుని సమాధానమిచ్చారు. ఈ మేరకు ఈనాడు తెలంగాణ ఎడిషన్‌లో ఓ వార్త ప్రచురించింది.

ఫొటో సోర్స్, facebook/chandrababunaidu

ఫొటో క్యాప్షన్,

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు

'జగన్‌ నిద్రలో కూడా సీఎం సీటు గురించే పలవరిస్తుంటారు'

"జగన్‌ నిద్రలో కూడా సీఎం సీటు గురించే పలవరిస్తుంటారు. ఆయన ధ్యాస నిరంతరం దానిపైనే. తాను సీఎం కావాలని కోరుతూ ప్రార్ధనలు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చిన నాయకుడు దేశంలో ఈయనొక్కరే. ఇటువంటి ప్రతిపక్ష నేత దొరకడం మనకు అదృష్టమో... దురదృష్టమో అర్థం కావడం లేదు' అని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు.

సోమవారం సచివాలయంలో ఆయన అధ్యక్షతన అసెంబ్లీ వ్యూహరచన కమిటీ సమావేశం జరిగింది. ఇందులో జగన్‌ పాదయాత్ర ప్రస్తావన వచ్చింది. దీనిపై పార్టీ నేతలు ఎక్కువగా మాట్లాడవద్దని చంద్రబాబు సూచించారు. దాని బదులు జగన్‌ వ్యవహార శైలి... ప్రవర్తన గురించి మాట్లాడాలని సలహా ఇచ్చారు. వైసీపీ అత్యంత నేర ప్రవృత్తి కలిగిన పార్టీ. నంద్యాల ఉప ఎన్నిక సమయంలో ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకున్నారు. ప్రజలు తగిన తీర్పు ఇచ్చారు. అయినా వారిలో మార్పు రాలేదు. వారి కర్మ.. మనమేం చేస్తాం' అని ఆయన అన్నారు. ఓటుకు నోటు కేసుతో తనకేం సంబంధమని ప్రశ్నించారు.

'అది మన రాష్ట్రం ఎన్నిక కాదు.అదేదో నా ఎన్నిక అయినట్లు మాట్లాడుతున్నారు. దానిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు" అని చంద్రబాబు అన్నారు. ఈ మేరకు ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్‌లో పేర్కొంది.

ఫొటో క్యాప్షన్,

సుప్రీంకోర్టు

'ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబుకు పాత్ర'

"ఓటుకు కోట్లు కేసు'లో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో చంద్రబాబు పాత్ర ఉన్నా తెలంగాణ ఏసీబీ అందుకు తగిన సాక్ష్యాధారాలు సేకరించడంలో విఫలమవడమే కాకుండా తదుపరి దర్యాప్తును ఆపేసిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టుకు ఓ ప్రజాహిత వ్యాజ్యంలో నివేదించారు.

కేసులో అత్యంత ప్రభావశీలురు నిందితులుగా ఉన్నందున దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని దాఖలు చేసిన ఈ రిట్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.

అని సాక్షి' దినపత్రిక ఓ వార్త ప్రచురించింది.

'వర్గీకరణకు సంపూర్ణ మద్దతు'

"ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ఉందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు. వర్గీకరణ అంశంపై ప్రధాని నరేంద్రమోదీ సమయం తీసుకుని అఖిలపక్షంతో వెళ్లి ఆయనను కలుస్తామని తెలిపారు. ఈ మేరకు ప్రధాని సమయం కోరుతూ ప్రతిపక్షాల నాయకుల సంతకాలతో ఒకటి రెండ్రోజుల్లో లేఖ రాస్తామని చెప్పారు.

ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్రంలోని అన్ని రాజకీయపక్షాలు ఏకాభిప్రాయంతో మద్దతు ఇస్తున్నాయన్న సీఎం.. ఈ సమస్య పరిష్కారానికి ఒక మంచి ముగింపు లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు.

ఈ విషయంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని చెప్పారు. వర్గీకరణపై ఎలాంటి అపోహలు లేవని సీఎం స్పష్టంచేశారు. సుప్రీంకోర్టు అభ్యంతరంవల్ల కొంత ఆలస్యం జరుగుతున్నదని వివరించారు" అని నమస్తే తెలంగాణ దినపత్రిక పేర్కొంది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)