ఇన్నారెడ్డి: అనాథలకు తండ్రిగా స్థిరపడ్డ మాజీ నక్సలైట్‌

  • బళ్ల సతీశ్
  • బీబీసీ ప్రతినిధి
వీడియో క్యాప్షన్,

చర్చి ఫాదర్ కావాలనుకుని.. నక్సలైట్‌గా మారి.. అనాథలకు తండ్రిగా స్థిరపడ్డ ఇన్నారెడ్డి

‘మా ఇల్లు ఆదరణ' ఒక అనాథాశ్ర‌మం. కానీ ఇందులో ఎక్కడా ఆ పేరు రాసి ఉండదు. ఇక్కడ ఉండేవారెవరికీ అలా అనిపించదు కూడా. ఎందుకంటే.. ఇది అనాథలకు సొంతిల్లు కావాలని ఇన్నారెడ్డి ఆ పేరు పెట్టారు.

అంతేకాదు అక్క‌డ పిల్ల‌లంద‌రూ ఇన్నారెడ్డినీ, ఆయ‌న భార్య పుష్ప‌రాణినీ మ‌మ్మీ, డాడీ అనే పిలుస్తారు. ఇన్నారెడ్డి దంప‌తులు కూడా అనాథాల‌తో పాటూ అదే ఆశ్రమంలో ఉంటూ పిల్ల‌ల బాగోగులు చూస్తారు. 2006లో 32 మంది పిల్ల‌ల‌తో మొద‌లైన ఈ ఆశ్ర‌మం ఇప్పుడు 220 మందిని త‌న‌ ఒడిలో చేర్చుకుని ఆద‌రిస్తోంది.

"మీరు ఎక్క‌డికి వెళ్తారు అంటే ఇంటికి అని చెబుతాం. మ‌న ఇంటికి వెళ్ల‌డం అనేది ఒక అద్భుత‌మైన భావ‌న. ఈ పిల్ల‌ల‌కు ఆ లోటు ఉండ‌కూడ‌ద‌నే ఆశ్ర‌మానికి మా ఇల్లు అనే పేరు పెట్టాం'' అని వివరిస్తారు ఇన్నారెడ్డి. ''వీరిలో కొంత‌మందికి వారి త‌ల్లితండ్రులు, ఇంటి పేరు తెలుసు. కొంద‌రికి తెలీదు. రికార్డుల్లో స‌మ‌స్య‌లు రాకుండా ఉండ‌డం కోసం దాదాపు 40 మందికి నా ఇంటి పేరే పెట్టాను. వారికి భ‌విష్య‌త్తులో మంచి అవ‌కాశాలు రావ‌డం కోసం షెడ్యూల్డు కులంగా గుర్తింపు ఇప్పిస్తున్నాను" అని ఆయన వెల్లడించారు.

ఫొటో సోర్స్, Maa Illu Prajadharana Ashramam/Facebook

వయసుతో సంబంధంలేదు..

ఇక్క‌డ ఉండ‌డానికి వ‌య‌సుతో సంబంధం లేదు. ఏదో ఒక ఆధారం దొరికే వ‌ర‌కూ ఇక్క‌డ‌ ఉండొచ్చు. త‌ల్లీతండ్రీ ఇద్ద‌రూ చ‌నిపోయి, చూసుకునే దిక్కులేని పిల్ల‌లు, రైల్వే స్టేష‌న్లు, బ‌స్టాండ్ల‌లో దొరికే పిల్ల‌లు.. ఇలా చాలా మంది ఈ ఆశ్ర‌మంలో క‌నిపిస్తారు. త‌ల్లిదండ్రుల్లో ఎవ‌రో ఒక‌రు బ‌తికున్నా వివిధ కార‌ణాల‌తో రోడ్డున ప‌డ్డ‌వారికి కూడా ఇక్కడ ఆశ్రయం లభిస్తుంది. ఆశ్ర‌మంలో అడుగుపెట్టిన రోజు నుంచీ వారి బాగోగులు ఆయ‌నే చూస్తారు.

ఇక్క‌డ ఉన్న వారంతా స్థానిక ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చ‌దువుతారు. కాలేజీ ఫీజులు ఎంతైనా స‌రే ఇన్నారెడ్డి భ‌రిస్తారు. వాళ్లు ఎంత వ‌ర‌కూ చ‌దువుతాం అంటే అంత వ‌ర‌కూ చ‌దివిస్తారు. పిల్ల‌ల సంఖ్య పెర‌గ‌డంతో త‌న ప్రాంగణంలోనే ఒక ప్రైవేటు ఇంట‌ర్ కాలేజీ ఏర్పాటు చేయించారు ఇన్నారెడ్డి. అందులో బ‌య‌టి పిల్ల‌లూ వ‌చ్చి చ‌దువుతారు. కాలేజీకి క్లాసు రూములు ఇచ్చినందుకు బదులుగా ఆశ్ర‌మంలోని పిల్ల‌లకు ఉచిత ఇంటర్ విద్య అందించేలా ఒప్పందం చేసుకున్నారు. ఇక ఇంజినీరింగ్, ఫార్మ‌సీ, రెగ్యుల‌ర్ డిగ్రీలు చ‌దివే వాళ్లూ ఇక్కడున్నారు. వారిలో కొంద‌రు హైద‌రాబాద్‌లో ఉండి చ‌దువుకుంటున్నారు. ఇలా ఆశ్ర‌మం నుంచి వ‌చ్చిన వారు ఉండేందుకు హైద‌రాబాద్‌లో ఏర్పాట్లు చేశారు ఇన్నారెడ్డి.

ఫొటో సోర్స్, Maa Illu Prajadharana Ashramam/Facebook

అనాథ‌ల గుర్తింపు కోసం పోరాటం..

అనాథ‌ల కోసం ఇన్నారెడ్డి అరుదైన పోరాటం చేస్తున్నారు. భార‌త‌దేశంలోని అనాథ‌లంద‌రికీ మేలు చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ప్ర‌స్తుతం అనాథ‌ల‌కు గుర్తింపు ఎలా ఇవ్వాల‌నే విష‌యంలో భార‌త‌దేశంలో స‌రైన చ‌ట్టాలు లేవు.

ప్ర‌భుత్వ ప్ర‌యోజ‌నాలు లభించాలంటే.. వారికి త‌ల్లిదండ్రుల పేర్లు తెలియ‌క‌పోవ‌డం, కులం తెలియ‌క‌పోవ‌డం, వ‌య‌సు గుర్తించ‌డానికి పుట్టిన రోజు తెలియ‌క‌పోవ‌డం పెద్ద స‌మస్య‌గా ఉన్నాయి. దీంతో అనాథ‌ల‌కు గుర్తింపు ఇవ్వాలంటూ 2008 నుంచీ చ‌ట్ట ప‌రంగా పోరాడుతున్నారు. ఇన్నారెడ్డి పోరాటానికి స్పందించిన ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం 2008లో జీఓ నంబ‌రు 34, 47ల‌ను విడుద‌ల చేసింది.

జీఓలు, మార్గదర్శకాల అమలు శూన్యం..

ఉమ్మ‌డి ఏపీలోని జీఓల ప్ర‌కారం అనాథ‌ల‌ను కుల‌ర‌హితులు (క్యాస్ట్‌లెస్)గా గుర్తించాల్సి ఉంది. అయితే వారి చ‌దువుకు ఉప‌యోగ‌క‌రంగా ఉండేందుకు మాత్రం ఎస్సీల‌కు వ‌చ్చే అన్ని ర‌కాల సౌక‌ర్యాలూ అనాథ‌ల‌కు ఇవ్వాల‌ని అప్పటి ఏపీ ప్ర‌భుత్వం ఆదేశించింది. కానీ వాటిని ఎవ‌రూ అమ‌లు చేయ‌డం లేదు. అనాథ‌ల కోసం ప్ర‌త్యేక చ‌ట్టం చేయాల‌ని యూపీఏ ప్ర‌భుత్వంతో సంప్ర‌దింపులు జ‌రిపారు ఇన్నారెడ్డి. అంతేకాదు సుప్రీంకోర్టులో ఒక కేసు కూడా వేశారాయ‌న‌. సుప్రీంకోర్టు ఆ కేసులో కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాలు ఇచ్చినా అవి అమలు కావ‌డం లేదంటున్నారు ఇన్నారెడ్డి. తాజాగా అనాథల‌కు బీసీ హోదా ఇవ్వాల‌న్న తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌తిపాద‌న‌ను కూడా ఇన్నారెడ్డి వ్య‌తిరేకిస్తున్నారు.

ఫొటో సోర్స్, Maa Illu Prajadharana Ashramam/Facebook

చర్చి ఫాదర్ కావాలనుకుని న‌క్స‌లైట్‌గా మారి..

గాదె ఇన్నారెడ్డి ప్ర‌స్థానంలో చాలా మలుపులున్నాయి. ఆయన రోమ‌న్ కేథ‌లిక్ కుటుంబ‌లో పుట్టారు. పెద్ద‌య్యాక చ‌ర్చి ఫాద‌ర్‌ కావాలనుకున్నారు. స్కూల్ రోజుల వ‌ర‌కూ ఇన్నారెడ్డి క‌ల ఇదే. కానీ పాఠ‌శాల, కాలేజీ చ‌దువు ఆయన కలను మార్చేసింది. ఆయన చదివిన స్కూల్లోనే వామ‌ప‌క్ష దిగ్గ‌జాలు కొండ‌ప‌ల్లి సీతారామ‌య్య‌, స‌త్య‌మూర్తి పాఠాలు చెప్పేవారు. కాలేజీలో మ‌రో వామ‌ప‌క్ష ర‌చ‌యిత వ‌ర‌వ‌ర‌రావు పాఠాలు చెప్పేవారు. వారి ప్రభావంతో ఇన్నారెడ్డి ఆసక్తి వామ‌ప‌క్ష రాజ‌కీయాల వైపు మళ్లింది. క్రైస్త‌వ మిష‌న‌రీల కంటే స‌మాజం కోసం పోరాడ‌టమే మంచిద‌ని భావించారు. రాడిక‌ల్ స్టూడెంట్స్ యూనియ‌న్ (ఆర్‌ఎస్‌యూ)లో చురుగ్గా ప‌నిచేశారు. పీపుల్స్ వార్ గ్రూపులో ఉంటూ అతివాద వామ‌ప‌క్ష రాజ‌కీయాల్లో చురుగ్గా వ్య‌వ‌హరించారు. పార్టీ త‌ర‌ఫున తెలంగాణ‌, రాయ‌ల‌సీమ‌ల్లో బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. ఒక ప్ర‌మాదంలో త‌న కుడి చెయ్యి పోగొట్టుకున్నారు. వ‌రంగ‌ల్‌లో ఉంటూ పార్టీ త‌ర‌ఫున ప‌నిచేసేవారు.

ఫొటో సోర్స్, Maa Illu Prajadharana Ashramam/Facebook

ప్రాంతీయ అసమానతలపై ఉద్యమాలు..

1979 నుంచి 1994 వ‌ర‌కూ వామ‌ప‌క్ష రాజ‌కీయాల్లో ఉన్న ఇన్నారెడ్డి ఆ త‌రువాత ప్రాంతీయ అస‌మాన‌త‌ల‌పై పోరాటం ప్రారంభించారు. తాను తెలంగాణ ప్రాంతానికి చెందినప్ప‌టికీ రాయ‌ల‌సీమ ఎలా న‌ష్ట‌పోతుందో గుర్తించి రాయ‌ల‌సీమ విమోచ‌న పోరాటంలో పాల్గొన్నారు. త‌రువాత తెలంగాణపై దృష్టిపెట్టారు. 'ద‌గాప‌డ్డ తెలంగాణ' పేరుతో 1996 లోనే ఒక పుస్త‌కం ప్ర‌చురించారు. చివ‌రి ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మం మొద‌లుపెట్టిన వారిలో ఇన్నారెడ్డి ఒక‌రు. 2001లో ప్ర‌స్తుత తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌రరావుతో క‌లిసి టీఆర్‌ఎస్ పార్టీ వ్య‌వ‌స్థాప‌క బృందంలో ఉన్నారు. ఆ త‌రువాత టీఆర్‌ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి, తెలంగాణ రాష్ట్ర పార్టీ ప్రారంభించారు.

జైలు జీవితంలో అధ్యయనం..

తెలంగాణ పోరాటంలో చురుగ్గా ఉన్న స‌మ‌యంలోనే 2005లో హైద‌రాబాద్ బాంబు పేలుళ్ళ‌లో అనుమానితుడిగా ఇన్నారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. 2006 ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కూ చర్ల‌ప‌ల్లి జైల్లో ఉన్నారు ఇన్నారెడ్డి. జైల్లో ఉన్న‌న్ని రోజులూ పుస్త‌కాలు చ‌ద‌వ‌డంలోనే కాలం గ‌డిపారాయ‌న‌. ఆ పుస్త‌కాలు ఆయ‌న‌లో చాలా మార్పు తీసుకువ‌చ్చాయి. రాజ‌కీయాల నుంచి సామాజిక సేవ‌కు మ‌ళ్లించాయి. రాజ‌కీయ స‌మ‌స్య‌ల‌ను అంద‌రూ నెత్తికెత్తుకుంటారు. కానీ ఏ ఆధార‌మూ లేని అభాగ్యుల సంగ‌తెవ‌రు చూస్తార‌ని ఆలోచించిన ఇన్నారెడ్డి.. జైలు నుంచి విడుద‌లయిన తర్వాత త‌న ద‌గ్గ‌రున్న అతి కొద్ది డ‌బ్బుతో త‌న ప‌క్క ఊర్లో కొంత స్థ‌లం కొని అనాథాశ్ర‌మం ప్రారంభించారు.

ఫొటో సోర్స్, Maa Illu Prajadharana Ashramam/Facebook

ఈ ఆశ్రమ నిర్వహణే సంతృప్తినిస్తోంది..

"నేను చ‌ర్చి ఫాద‌ర్ అవ్వాల‌నుకున్నా. తర్వాత ఆర్‌ఎస్‌యూలో, పీపుల్స్ వార్‌లో ప‌నిచేశా. రాయ‌ల‌సీమ హ‌క్కుల గురించీ, ప్ర‌త్యేక తెలంగాణ గురించీ పోరాడాను. కానీ అన్నిటికంటే ఈ ఆశ్ర‌మ నిర్వ‌హ‌ణ నాకు ఎక్కువ సంతృప్తినిచ్చింది. ఎందుకంటే నేను ఇక్క‌డ వ్య‌క్తి నిర్మాణం చేస్తున్నాను" అంటారు ఇన్నారెడ్డి.

ప్ర‌స్తుతం ఈ ఆశ్ర‌మం దాత‌ల స‌హాయంతో న‌డుస్తోంది. నిధుల విష‌యంలో ఇన్నారెడ్డి పార‌ద‌ర్శ‌కంగా ఉంటారు. త‌న గురించి తెలియ‌ని వారి ద‌గ్గ‌రా, కొత్త వారి దగ్గరా డ‌బ్బు రూపంలో కాకుండా, పిల్ల‌ల‌కు అవ‌స‌ర‌మ‌య్యే వ‌స్తు రూపంలో స‌హ‌కారం తీసుకుంటారు. "నాకు సేవ చేసే అవ‌కాశం ఇచ్చిన పిల్ల‌ల‌కు, అందుకు స‌హ‌క‌రిస్తున్న దాత‌ల‌కు ఎప్పుడూ కృత‌జ్ఞుడిని" అని ఇన్నారెడ్డి చెప్పారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)