ఎడిటర్స్ కామెంట్: వందేళ్ల రష్యా అక్టోబర్ విప్లవం తెలుగు సమాజానికి ఏం చేసింది?

  • జి.ఎస్.రామ్మోహన్
  • ఎడిటర్, బీబీసీ తెలుగు
ప్రజలకు అభివాదం చేస్తున్న లెనిన్

ఫొటో సోర్స్, Getty Images

బౌద్ధికంగానూ భౌతికంగానూ రష్యన్ విప్లవ ప్రభావాలు తెలుగునేలపై బలంగా ఉన్నాయి. ఇవాళ వెనక్కు తిరిగి చూస్తే ఆ ప్రభావాలు సంక్లిష్టంగా కనిపిస్తాయి. తొలినాళ్లలో అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమానికి దిక్సూచిగా ఉన్న కొమింటర్న్ పథ నిర్దేశం దగ్గర్నుంచి ఆ తర్వాత రష్యా ప్రయోజనాలే తమ ప్రయోజనాలుగా భావించి తీసుకున్న నిర్ణయాల దాకా చర్చ ఇప్పటికే చాలా నడిచింది.

పార్టీ ప్రోగ్రామ్‌లో మిలిటెంట్ పోరాటరూపాలను ప్రకటించుకున్నప్పటికీ దానికి తగ్గట్టు ఆచరణ లేదని భావించి సిపిఎం నుంచి ఎంఎల్ శిబిరం విడిపోయిన పరిస్థితుల నుంచి 1920ల్లో నాటి అత్యంత వెనుకబడిన చైనా సమాజానికి అన్వయిస్తూ మావో రూపొందించిన నాలుగు వర్గాల ఐక్య సంఘటనను నేటి భారతదేశానికి అన్వయించే పద్ధతి గురించిన లోటుపాట్లదాకా చాలా చర్చ సంస్థల లోపలా బయటా నడుస్తున్నది.

రష్యా కేంద్రకంగా జరిగిన అనేకానేక పరిణామాలు తెలుగునేలను అందులోనూ ముఖ్యంగా తెలంగాణను ప్రభావితం చేయడంలో ముఖ్యపాత్ర పోషించాయి. తెలంగాణ సాయుధ పోరాటనిర్వహణలోనూ దాని ముగింపులోనూ రష్యన్ల ప్రభావం ఉన్నది. విరమణకు ముందు రష్యా వెళ్లి స్టాలిన్ సలహాను తలదాల్చి వచ్చిన నలుగురు బృందంలో చండ్ర రాజేశ్వరరావు, మాకినేని బసవపున్నయ్య ఉన్నారు.

ఇవ్వాల్టిదాకా సాగిన పరిణామాలన్నింటినీ చూస్తే భారత కమ్యూనిస్టు పార్టీ తాష్కెంట్లో ఎంఎన్ రాయ్ నేతృత్వంలో 1920లో పుట్టింది అని భావించే సిపిఎం దగ్గర్నుంచి 1925లో కాన్పూర్లో ఆరంభమైందే కమ్యూనిస్టు పార్టీ అని చెప్పే సిపిఐ దగ్గర్నుంచి తాష్కెంట్లోనే పుట్టినా 69లో నక్సల్బరీ పరిణామాలతో ఊపిరిపోసుకున్నదే అసలు సిసలైన కమ్యూనిస్టు ఉద్యమం అని భావించే మార్క్సిస్టు లెనినిస్టు శిబిరం దాకా అందరూ ప్రాధమికంగా అక్టోబర్ రెవల్యూషన్తో ప్రభావితమైనవారే.

ఫొటో సోర్స్, Getty Images

మార్క్సిస్టు పార్టీ, ఎంఎల్ పార్టీలు చైనా లైన్ నుంచి తమకు నచ్చిన పాయలను స్వీకరించినప్పటికీ ప్రాధమికమైన ఉత్తేజమైతే అక్టోబర్ రెవల్యూషన్ అందించిందే. నోరులేని వాళ్లకు గొంతునివ్వడం దగ్గర్నుంచి వెట్టిచాకిరీ నిర్మూలన దగ్గర్నుంచి క్రూరమైన భూస్వామ్యపు మెడలు వంచడం దగ్గర్నుంచి తెలుగునేలపై కమ్యూనిస్టు ఉద్యమం చేసిన కృషి ఫలితాలు చాలానే ఉన్నాయి. మత విద్వేషాలకు వ్యతిరేకంగా, కులమౌఢ్యాలకు వ్యతిరేకంగా భావజాల పరంగానూ భౌతికంగానూ అవి చేసిన కృషి ఎవరూ కాదనలేనిది.

మొత్తంగా ఆధిపత్యాన్ని బహిరంగంగా ఒక విలువగా అహంకారంగా ప్రదర్శించుకునే వాతావరణాన్ని అవి బలంగా ఎదుర్కోగలిగాయి. సమానత్వ భావాన్ని ఎంతో కొంత పెంచగలిగాయి. ఇవాళ ఎంత బలహీనంగా కనిపించినప్పటికీ, రష్యన్ విప్లవంతో ఉత్తేజం పొందిన ఆ శ్రేణులే కాకుండా మొత్తంగా ఆ భావజాలమే సంక్షోభం ఎదుర్కొంటున్నప్పటికీ, డైనోసార్స్ అనే జోక్స్ ప్రచారంలో ఉన్నప్పటికీ చరిత్ర అయితే విస్మరించలేనిది.

50లు- ఆశల పల్లకిలో ఎర్రజెండా

తెలుగునేలమీద యాభైల మధ్యభాగం దాకా కమ్యూనిస్టు ఉద్యమం బలంగానే ఉండింది. 52 ఎన్నికల్లో ఇటు నైజాం రాష్ర్టంలో భాగమైన తెలంగాణలోనూ మద్రాస్ రాష్ర్టంలోని తెలుగు ప్రాంతాల్లోనూ కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్తో పోటాపోటీగా సీట్లు సాధించింది. 55లో జరిగిన ఆంధ్ర రాష్ర్ట ఎన్నికలైతే చెప్పనక్కర్లేదు. అధికారంలోకి రావడం ఖాయమన్న నమ్మకం కమ్యూనిస్టుల్లో ఉండింది. ఆ పెద్దమనుషుల రోజుల్లో కూడా ప్రచారం విషపూరితంగా సాగింది. కమ్యూనిస్టులు విజయంసాధించలేదు. తర్వాత కోలుకున్నది లేదు. అరవైల్లో ప్రధాన ప్రత్యర్ధి పాత్రను కూడా కోల్పోయారు. నెమ్మదినెమ్మదిగా ఒక్కో కంచుకోటను కోల్పోతూ ఇవాళ చివరిగా ఖమ్మం అయినా కాపాడుకోలరా అనే పరిస్థితిలో ఉన్నారు.

ఓట్లు, సీట్లు అనే లెక్కల నుంచి పక్కకు తొంగిచూస్తే బౌద్ధిక రంగంలో రష్యన్ విప్లవ ప్రభావం లోతైనది. ప్రగతి, రాదుగ, ప్రోగ్రెసివ్ పబ్లిషర్స్ సంస్థలు చదువుకున్న పురోగామి వర్గాల్లో ఇంటింటి పేర్లుగా మారిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు భావజాల వ్యాప్తిమీద దృష్టి మాత్రమే కాకుండా వనరులు కూడా భారీగా వెచ్చించింది రష్యా. అత్యత్తమ నాణ్యత కలిగిన పుస్తకాలు అతి చౌకగా అందించేవాళ్లు.గోర్కీ, టాల్ స్టాయ్,దోస్తవిస్కీ తెలుగు రచయితలేమో అన్నంతగా ప్రాచుర్యం పొందారు. బాలసాహిత్యం గురించి చెప్పనే అక్కర్లేదు.

ఫొటో సోర్స్, Getty Images

తెలుగు నేల నుంచి విద్యావంతులైన యువతను తీసుకెళ్లి శిక్షణ ఇచ్చే కార్యక్రమం కూడా ముమ్మరంగా సాగింది. ఉప్పల లక్ష్మణరావు లాంటి రచయితలు అక్కడే సెటిలయ్యారు కూడా. 1943లో ఇప్టా ఏర్పాటు తర్వాత తెలుగు నాట ప్రజానాట్యమండలి, అభ్యుదయ రచయతల సంఘం ఏర్పడి కమ్యూనిస్టు భావజాలపు వ్యాప్తికి కృషి చేశాయి. అప్పటికే గర్జించు రష్యా, గాండ్రించు రష్యా, పర్జన్యశంఖం పూరించు రష్యా అని రెండో ప్రపంచయుద్ధంలో సంకీర్ణ సేనలకు మద్దతుగా ఇక్కడినుంచి అక్షర శంఖారావం ఊదిన శ్రీ శ్రీ అరసం నాయకుడయ్యారు.

కొడవటిగంటి కుటుంబరావు, కెవి రమణారెడ్డి లాంటి వాళ్లు ఆయనతో పాటుగా అరసం కాడిమోసేవారు. ఐదవ దశకంలో ప్రజానాట్యమండలి కళాకారులు సినిమావైపు చూడడం ఆరంభమైంది. 55 ఎన్నికల్లో ఓటమి తర్వాత తీవ్రమైంది. సినిమాలతో ప్రజాభిప్రాయాన్ని కమ్యూనిస్టు ఉద్యమం వైపు మలవడం అనే మిషతో మొదలైన ఆ ప్రయాణం ఒకవైపే సాగింది. తిరిగి వెనక్కు చూసింది లేదు. రోజులు మారాయి దగ్గర్నుంచి బీదలపాట్లు దాకా అనేకానేక సామాజిక చైతన్యం కలిగించే సినిమాలను నిర్మించినప్పటికీ సినిమా మార్కెట్ అభ్యదయపు ఆకాంక్షను డామినేట్ చేసింది. తర్వాత చిత్రమే మారిపోయింది.

సాహిత్యంలో అయితే అభ్యుదయ సాహిత్యం దాదాపు తిరుగులేని ఆధిపత్యం చెలాయించిందని చెప్పొచ్చు. ఎక్కడో అపారమైన నైపుణ్యం కలిగిన విశ్వనాధ లాంటి ఒకరిద్దరిని తప్ప పురోగామి భావజాలం లేని రచయితలను అస్సలు సీరియెస్ రచయితలుగా గుర్తించే స్థితే లేకుండా పోయింది. ఆ ట్రెండ్ మారినా ఇవ్వాల్టికీ అలాంటి స్థితి కొంతవరకు ఉన్నది స్థూలంగా! ఏది పురోగామి భావజాలం అనే విషయంలో ఛాయా భేదాలు ఉన్నప్పటికీ! కాకపోతే ఫోకస్ రష్యా నుంచి చైనాకు మారాక, కమ్యూనిస్టు పార్టీ విడిపోయాక , అంతకంటే ముఖ్యంగా మిలిటెంట్ వామపక్ష రాజకీయాల ప్రవేశం తర్వాత, అస్తిత్వ రాజకీయాల తర్వాత దాని రూపాలు మారాయి.

70లు- మిలిటెంట్ ఉద్యమం

కొత్త మిలిటెంట్ రాజకీయాల దానితో పాటే జననాట్యమండలి, విరసం రంగప్రవేశం చేశాయి. 60ల ఆఖర్లో సిపిఎం నుంచి విడిపోయి ఎంఎల్ శిబిరం పురుడుపోసుకున్నాక తెలుగునేల అందులో కీలకపాత్ర పోషించింది. కొండపల్లి సీతారామయ్య లాంటి వారి నేతృత్వంలో మధ్యతరగతి యువత పెద్దయెత్తునే కదిలింది. అంతకుముందు అరసంలో అగ్రభాగాన ఉన్న శ్రీశ్రీ, కొకు, రమణారెడ్డి విరసం పతాకాన్ని నెత్తికెత్తుకున్నారు. అనేక రకాలుగా 70ల ఆరంభం నుంచి ఈ మార్పులు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. . చైనా దాన్నే వసంతమేఘ ఘర్జనగా వర్ణించింది.

ఫొటో సోర్స్, Getty Images

అదే ఉపమానాన్ని ఆ శిబిరం ఇప్పటికీ ప్రచారంలో వాడుతూ ఉంటుంది. తెలంగాణలో భూస్వాములకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఈ ఉద్యమం అక్కడ ధిక్కార సంస్కృతికి ప్రతీకగా నిలిచింది. అయితే ఈ ప్రయాణంలో జరిగిన రక్తపాతంపై అనుసరించిన పద్ధతులపై విమర్శలయితే ఉన్నాయి. నాటి రణోత్సాహం అలాంటిది. మూడో ప్రపంచయుద్ధం వస్తుందని 75 కల్లా విప్లవం విజయవంతమవుతుందని చారుమజుందార్ తన డాక్యుమెంట్ లో విశ్వాసం ప్రకటించేదాకా వెళ్లింది పరిస్థితి. అయితే గ్రామీణ సమాజం పట్టణ సమాజంగా రూపాంతరం చెందుతున్న కొద్దీ, ఉత్పత్తి సంబంధాలు మారుతున్న కొద్దీ వారి ప్రయాణం మందగించింది. 90ల్లో ఆయా ఉద్యమ శ్రేణుల్లోని క్రీమ్ అస్తిత్వ వాద రాజకీయాల వైపు ప్రయాణం చేసిన తీరు ఒక ప్రతీక అయితే, చాలా మిలిటెంట్గా పనిచేసిన శక్తుల్లో కొందరు విముక్తి నుంచి సేవా మార్గం పట్టడం మరో ముఖ్యమైన సంకేతం. ఒక్క ముక్కలో ఎంఎల్ ఉద్యమ పంథాతో ఎమోషనల్ కనెక్షన్ కోల్పోయిన శక్తులు పెద్దయెత్తున వేరే మార్గాన్ని ఎంచుకున్న పరిణామం మనం 90ల్లో చూస్తాం. విద్యార్థి లోకంతో పాటు మధ్యతరగతిలో మద్దతు తగ్గిపోయింది. మారిన కాలపు పరిస్థితుల్లో వారు అవలంబిస్తున్న పద్ధతులే కాకుండా మొత్తంగా సాయుధ మార్గమే బలమైన ప్రశ్నలనెదుర్కొంటోంది. ఆయా శ్రేణుల్లో కూడా దోసెడు రక్తం పోసి పిడికెడు తింటిమిరా అనే ఆలోచన తాత్వికార్థంలో పెరుగుతూ వస్తున్నది. కొద్ది అరణ్య ప్రాంతానికే ఎందుకు పరిమితమయ్యామో ఆలోచించుకోవాల్సి ఉంది అని ప్రధాన ఎంఎల్ శిబిరపు నాయకుల్లో ఒకరైన కోబాడ్ గాంధీ ఇపిడబ్ల్యులో రాసి ఉన్నారు.

సోవియెట్ పతనం-ఆత్మ విమర్శా కాలం

సోవియెట్ పతనం ప్రభావం ప్రపంచ వామపక్ష ఉద్యమం మీద ఉన్నట్టుగానే ఇక్కడా ఉంది కానీ అదే కీలకమైన అంశం కాదు. అయితే దుస్సాహసంగానూ, లేదంటే కొన్ని సీట్ల కోసం ఏ పార్టీతో నైనా పొత్తుపెట్టుకునే బలహీనత తోనూ రెండు వైపులా ఏదో ఒక కొసకు వెళ్లడం తప్ప భారత కమ్యూనిస్టు ఉద్యమానికి సరైన దిశా దశా లేకుండా పోయిందనే మాట ఆయా శిబిరాలను దగ్గరిగా చూసిన విమర్శకుల నుంచి ఎదురవుతూ ఉంటుంది. ఇరవయ్యవ శతాబ్దిలో జరిగిన ప్రయోగాలు, ముఖ్యంగా రష్యన్ విప్లవం నుంచి తీసుకోవాల్సిన పాఠాలు, గుణపాఠాలపై మార్క్సిస్టు శిబిరాల్లో తీవ్రమైన చర్చే సాగుతున్నది. ఇటీవల అలాంటి సాహిత్యం పెరుగుతున్నది.

ఫొటో సోర్స్, Getty Images

రష్యాలో జెండా మారిన తర్వాత తూర్పు యూరప్ పరిణామాల తర్వాత ఇంకో రకమైన సైద్ధాంతిక చర్చ ప్రపంచమంతటా ఊపందుకుంది. అది మార్క్సిజపు మౌలిక భావనలకు సంబంధించింది. చారిత్రక భౌతిక వాదం, వాన్ గార్డ్ పాత్ర వంటి మౌలిక భావనలే నేడు సవాల్ ఎదుర్కొంటున్నాయి. చారిత్రక భౌతిక వాదం గతాన్ని అధ్యయనం చేయడానికి పనికి వచ్చినంతగా భవిష్యత్ ను రూపొందించుకోవడానికి పనికి వస్తుందా అనే ప్రశ్న ఉన్నది. అయితే సామాజిక పరిణామ గతిలో వందేళ్లు నూటాయాభై యేళ్లు స్వల్ప కాలమని అప్పుడే తొందర పడి తీర్పులిచ్చేయరాదని చెప్పే ఆశావాదులు కూడా ఉన్నారు.

అలాగే అడ్వాన్స్డ్ కాపిటలిస్ట్ కంట్రీస్లో తొలుత సోషలిస్టు విప్లవాలు విజయవంతం అవుతాయన్న మార్క్స్ అంచనా తప్పిన విషయాన్ని గుర్తుచేసేవారు పెరిగిపోయారు. వెనుకబడిన రాజరికపు ఫ్యూడల్ సమాజాల్లోనే విప్లవాలు విజయవంతమవడంలో పనిచేసిన జాతీయ విముక్తి అంశాన్ని గుర్తుచేసుకుంటున్నారు. తెలుగునేలమీద కూడా రష్యన్ విప్లవం ప్రభావంతో మొదలైన ఉద్యమాల ఒత్తిడి ప్రభుత్వాలపై ఉండడం వల్ల ఆయా సమాజాలు తొందరగా ఆధునీకరణలోకి పెట్టుబడిదారి దశలోకి ప్రయాణించేలా చేశాయని, ఒకసారి అక్కడ ఆధునిక రూపాలు ప్రవేశించగానే ఉద్యమం అక్కడ బలహీనపడడం ఆనవాయితీగా మారిందని విశ్లేషణలున్నాయి. స్థూలంగా తెలంగాణ ఉదాహరణని తీసుకున్నా అక్కడ భూస్వామ్యం ఆధిపత్యం ఆ రూపంలో ముగిసిపోయి కాలువల వ్యవసాయంతో పాటు రోడ్లు- పెన్షన్లతో పాటు ఉత్పత్తి సంబంధాల్లో మార్పులు రాగానే అక్కడ వామపక్ష శ్రేణులు బలహీనపడిన తీరును గుర్తుచేస్తున్నారు.

మొత్తంగానే ప్రపంచంలో ఎక్కడా ఇంతవరకూ పెట్టుబడిదారీ సమాజాలను(అలనాడు సంధిదశలో ఉండిన రష్యన్ సమాజాన్ని పెట్టుబడిదారి అనుకోలేం) సోషలిజం ఓడించిన దాఖలాలు అంతగా లేవనే విషయాన్ని గుర్తుచేసుకుంటూ ఇంతవరకూ జరిగిన చరిత్రను రీవిజిట్ చేసే అధ్యయనాలు తెలుగునాట విస్తృతంగా సాగుతున్నాయి. అందులో రష్యన్ విప్లవాన్ని పునర్ దర్శించే ప్రయత్నాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)