అభిప్రాయం: భారత ఆర్థిక రంగాన్ని దెబ్బతీసిన మోదీ నోట్ల జూదం

  • ప్రవీణ్ చక్రవర్తి
  • బీబీసీ కోసం
నోట్ల రద్దు

సరిగ్గా ఏడాది కిందట దేశంలోని పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్ణయం తీసుకున్నారు. అవినీతి, నల్లధనాన్ని రూపుమాపే చర్యల్లో ఇది భాగమని తెలిపారు.

మరి ఈ వివాదాస్పద నిర్ణయం వల్ల లాభమా? లేక నష్టమా? ఆర్థికవేత్త ప్రవీణ్ చక్రవర్తి విశ్లేషణ.

దేశంలోని 86శాతం నగదు చెలామణి కాకుండా మోదీ రాత్రికిరాత్రే నిర్ణయం తీసుకున్నారు.

పాత రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్తగా రూపొందించిన రూ.500 నోట్లను, నూతనంగా రూ.2,000 నోటును ప్రవేశపెట్టారు.

ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయాన్ని పొరపాటుగా నోట్లరద్దుగా వర్ణించారు. సాంకేతికంగా దీన్ని నోట్లరద్దు అనరు, పునరుద్దరణ అంటారు.

నగదు కష్టాలు

ఈ నిర్ణయం దేశంలోని 100 కోట్ల మందిపై తీవ్ర ప్రభావం చూపింది. 2016లో ప్రకటించిన ఈ నోట్ల రద్దు ఇటీవల కాలంలో ఆర్థిక విధానంపై తీవ్ర ప్రభావం చూపే అతి పెద్ద నిర్ణయంగా నిలిచింది.

ప్రధాని మోదీ నవంబర్ 8న నోట్లు రద్దుపై మాట్లాడుతూ...మూడు ముఖ్యకారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. నల్లధన నిర్మూలనకు, నకిలీనోట్ల ను అరికట్టేందుకు, ఆర్థిక ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకే ఇది ఉపయోగపడుతుందని అన్నారు.

రాత్రి తన నిర్ణయాన్ని ప్రకటించిన ప్రధాని మోదీ మరుసటిరోజే మూడు రోజుల జపాన్ పర్యటనకు వెళ్లారు. ఆయన తిరిగి వచ్చేసరికి దేశంలో నోట్ల కష్టాలు తీవ్రమయ్యాయి.

నోట్ల రద్దు తర్వాత బ్యాంకులు, ఏటీఎంల ముందు ప్రజలు బారులు తీరారు. లక్షలాది మంది ప్రజలు నగదులేకుండానే ఉండిపోయారు. వివాహాలు రద్దు చేసుకున్నారు, చిన్న దుకాణాలు మూతపడ్డాయి, ఆర్థికకార్యకలాపాలు దెబ్బతిన్నాయి. నగదు లభ్యత కష్టమైంది. ఇక హాస్యచతురులు నోట్లరద్దుపై పారడీ కథలు కూడా రాశారు.

95శాతం లావాదేవీలు నగదు రూపంలోనే జరిగే దేశంలో ఒక్కసారిగా నోటక్లు రద్దు చేయడంతో ఇలాంటి విపరీత పరిణామాలు తలెత్తడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.

అంతలోనే స్వరం మార్చిన మోదీ!

ప్రధాని మోదీ జపాన్ పర్యటన నుంచి తిరిగొచ్చిన వెంటనే దేశంలో నెలకొన్న గందరగోళ పరిస్థితిపై ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

డిజిటల్ ఎకానమీ, నగదురహిత లావాదేవీల దిశగా భారత్‌ను నడిపించేందుకే నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు.

జపాన్ పర్యటన అనంతరం మోదీ తన ప్రసంగంలో 'నల్లధనం రద్దు' కంటే మూడు రెట్లు ఎక్కువగా 'నగదురహిత, డిజిటల్' అనే పదాలే ఎక్కువగా వాడారు. ఇక నవంబర్ 8న నోట్లు రద్దు చేస్తూ మాట్లాడిన సందర్భంలో ఒక్కసారి కూడా 'నగదు రహిత, డిజిటల్' అనే పదాలే వాడలేదు.

నోట్లరద్దుతో కొన్నివారాలలోనే లెక్కతేలని సంపద బయటకొస్తుందని, పేదరికంలో మునిగితేలిన దేశాన్ని నగదురహిత ఆర్థికవ్యవస్థగా మార్చే మంత్రదండంగా పనిచేస్తుందని అనుకున్నారు. కానీ, ఈ సాహాసోపేత నిర్ణయం ఆశ్చర్యకరం, హాస్యాస్పదం.

నగదురహిత లావాదేవీల నిర్ణయం భారత్‌లో అత్యంత ముఖ్యమైన ఆర్థిక ప్రాధాన్యతగా ఎలా అయ్యిందో ఎవరికీ అర్థం కాలేదు.

మోదీ తెలిపిన మూడు ముఖ్యకారణాలను విశ్లేషిస్తే ఆ కారణాలు వాస్తవానికి దూరంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.. కేవలం నోట్ల రద్దుతోనే నల్ల ధనం వెనక్కిరాదని ఎన్నో అధ్యయనాల ద్వారా వెల్లడైంది.

భారత్‌లో ఉన్న అక్రమ సంపాదనలో కేవలం 6శాతం కంటే తక్కువ సంపాదన మాత్రమే నగదులో ఉందని ఎన్నో అధ్యయనాలు తెలిపాయి.

అందుకే కేవలం 6శాతం ఉన్న నల్లధనాన్ని అరికట్టేందుకు 90శాతం ఉన్న నగదును రద్దు చేయడం అనేది ఎగిరే పక్షి రెక్కలు కత్తిరించడం లానే ఉంటుంది.

రెండో కారణం పెద్ద నోట్ల రద్దీతో నకిలీ నోట్ల చెలామణికి అడ్డుకట్ట వేయడమనే వాదన కూడా ప్రజలను తప్పుదోవ పట్టించడమే అవుతుంది.

ఎందుకంటే, ప్రస్తుతం చెలామణిలో ఉన్న నకిలీ నోట్లు ప్రస్తుతమున్న నగదులో కేవలం 0.02 శాతం కంటే తక్కువగా ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది.

నకిలీ నోట్ల సమస్య కేవలం భారత్‌లోనే లేదు ఈ సమస్యను ప్రపంచం మొత్తం ఎదుర్కొంటుంది. కాలక్రమేణా నోట్ల డిజైన్‌లో మార్పులు చేస్తూ ఈ సమస్యను ఎంతోకొంత పరిష్కరించొచ్చు.

నోట్ల రద్దుతో ఉగ్రవాదులకు నగదు చెలామణీ నిలిచిపోతుందని తద్వారా తీవ్రవాద కార్యకలాపాలకు ఆర్థికంగా దెబ్బకొట్టొచ్చని మోదీ అన్నారు కానీ అది కూడా అవాస్తమని తేలింది. ఎందుకనే పెద్ద నోట్లతో తీవ్రవాద ఘటనలు పెరిగాయనే వాదనకు ఎటువంటి ఆధారం లేదు.

అంతా అస్పష్టం అసమర్థం!

నోట్ల రద్దుకు సంబంధించి ఆర్థిక సూత్రాలు ఎలా అస్పష్టంగా ఉన్నాయో, నోట్ల రద్దు తర్వత చూపించిన లెక్కలు కూడా అంటే అస్పష్టంగా ఉన్నాయి.

నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మందగించిందని, నిరుద్యోగానికి కారణమయ్యిందని వివిధ సర్వేలు తేల్చిచెప్పాయి.

ఇవి కాక నోట్ల రద్దు భారత జీడీపీపై తీవ్రంగా ప్రభావం చూపింది. ఆర్థిక వ్యవస్థలో కీలక రంగాలను నోట్ల రద్దు తీవ్రంగా దెబ్బతీసింది.

భారత స్థూల విలువ జోడింపు (జీవీఏ) లో సగ భాగంగా పరిగణింపబడే వ్యవసాయం, తయారీ, నిర్మాణం వంటి రంగాలు నోట్ల రద్దుతో కుదేలయ్యాయి. దేశంలో ఉద్యోగాలు సృష్టించడంలో ఈ మూడు రంగాలదే కీలక పాత్ర. జీవీఏను మొత్తం ఉత్పత్తుల విలువ, అందించిన సేవల ఆధారంగా లెక్కిస్తారు.

జీవీఏ గణాంకాలను విశ్లేషిస్తే, ఈ మూడు రంగాలు గత కొన్నేళ్లుగా 8శాతం వృద్ధి రేటుతో ముందుకు వెళుతున్నాయి. ఈ గణాంకాలు నోట్ల రద్దుకు ముందు నమోదయ్యాయి. కానీ నోట్ల రద్దు తర్వాత గణాంకాలను విశ్లేషిస్తే తర్వాతి రెండు త్రైమాసికాల్లో ఈ రేటు 8శాతం నుంచి 4.6 శాతానికి పడిపోయింది.

పెరుగుదలలో ఈ పతనాన్ని విశ్లేషిస్తే నోట్ల రద్దు ఈ మూడు రంగాల్లో ఉత్పత్తిపై తీవ్రంగా ప్రభావం చూపించిందని చెప్పుకోవచ్చు. ఈ ప్రభావం 15 బిలియన్ డాలర్లు అంటే జీడీపీలో 1.5 శాతం వరకూ ఉంటుందని అంచనా. అత్యంత ఎక్కువ ఉపాధి సృష్టించే ఈ మూడు రంగాల్లో నోట్ల రద్దు నిరుద్యోగానికి కారణమయ్యింది.

ఊహించని లాభాలు

పెద్ద నోట్ల రద్దు కొన్ని అనుకోని లాభాలకు కూడా కారణమయ్యింది చెప్పుకోవచ్చు.

బ్యాంకుల్లో కట్టలు కట్టలుగా డిపాజిట్లు వచ్చి పడ్డాయి. ఇది కూడా వడ్డీ రేట్ల తగ్గుదలకు కారణమయ్యింది.

ఋణ భారాన్ని మోస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకులకు రీకాపిటలైజేషన్‌ బాండ్ల ద్వారా కేంద్ర ప్రభుత్వ సహాయానికి కూడా నోట్ల రద్దు కారణమయ్యింది.

నోట్ల రద్దుతో డిజిటల్ లావాదేవీలు కూడా పెరిగాయి. కొందరైతే ఈ పరిమాణం చూసి భారత్ లో నగదు లావాదేవీలు తగ్గుతాయని కూడా అన్నారు.

ఏదేమైనా భారత్‌లో పెద్ద నోట్ల రద్దు లక్ష్యాలు మాత్రం నెరవేరలేదు.

ఈ నిర్ణయం ఆర్ధిక వ్యవస్థలో కోలుకోలేని దెబ్బకు కారణమయ్యింది. ఈ పరిస్థితి నుంచి బయట పడాలంటే చాలాకాలం పట్టే అవకాశముంది.

ఈ నిర్ణయానికి ఖచ్చితమైన కారణాలేమిటో ఇప్పటికీ తెలియడం లేదు.

పెద్ద నోట్ల రద్దు విషయంలో భారత్ ఎదుర్కొన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా మరింత క్రమబద్ధమైన పద్ధతిలో ఆర్ధిక విధానాలను రూపొందించే అవకాశం ఉంది.

(ప్రవీణ్ చక్రవర్తి, ఐడీఎఫ్‌సీ ఇన్‌స్టిట్యూట్ ముంబైకి చెందిన సీనియర్ పరిశోధకులు)

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)