ప్రెస్ రివ్యూ: నోట్ల రద్దు, జీఎస్టీ... ఇప్పుడు బీటీటీ రానుందా?

  • 8 నవంబర్ 2017
Image copyright Getty Images

కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దుచేసి నేటికి సరిగ్గా ఏడాది పూర్తైంది. దేశ ఆర్థిక రంగ చరిత్రలో ఇదో కీలక నిర్ణయంగా ప్రభుత్వం చెబుతుండగా ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసిన నిర్ణయంగా విపక్షం విమర్శిస్తోంది. నోట్ల రద్దు ద్వారా ఎంత మొత్తం పాతనోట్లు రద్దయ్యాయి? తిరిగి ఎంత మొత్తం బ్యాంకుల్లో జమయ్యాయి? నల్లధనం ఏమేరకు బయటపడింది? సంవత్సరం తర్వాత ఈ అంశంపై విపక్షాలు ఏమంటున్నాయి? వ్యాపారులు, ప్రజలు ఏమనుకుంటున్నారు? వీటన్నింటితో సమగ్రంగా విశ్లేషణనిచ్చింది ఈనాడు. పెద్దనోట్ల రద్దుతో వ్యభిచారం తగ్గిందని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించినట్లు తెలిపింది.

Image copyright Getty Images

బియ్యం రీసైక్లింగ్

తెలంగాణలోని కొందరు దళారులు కొన్ని గ్రామాల్లో రేషన్ బియ్యాన్ని కిలో రూ.8 చొప్పున కొని మహారాష్ట్రలోని వీరూర్‌కి తరలిస్తున్నారు. అక్కడ నుంచి దుకాణదారులకు, వారి నుంచి రైస్ మిల్లులకు చేరుతోంది. అక్కడ వాటిని సన్నబియ్యంగా మార్చి తిరిగి తెలంగాణకు తరలిస్తున్నారు. దీన్ని కిలో రూ.40-50 వరకూ అమ్ముతున్నారు. ఇదంతా పౌరసరఫరాల శాఖ అధికారులకు తెలిసే జరుగుతోందంటూ ఈనాడు తెలంగాణ ఎడిషన్ ఓ కథనాన్ని ప్రచురించింది.

Image copyright Getty Images

నోట్లరద్దు, జీఎస్టీ... ఇప్పుడు బీటీటీ రానుందా?

ఆదాయ పన్ను సహా దేశంలోని అన్ని పన్నులనూ రద్దుచేసి, వాటి స్థానంలో బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ టాక్స్ (బీటీటీ)ను ప్రవేశపెట్టే యోచనలో ప్రధాని మోదీ ఉన్నారని ఆంధ్రజ్యోతి పతాక కథనాన్ని ప్రచురించింది. రానున్న గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మోదీ ప్రయోగించబోయే తర్వాత అస్త్రం ఇదేనని ఆ కథనంలో పేర్కొంది. వచ్చే సాధారణ ఎన్నికల్లోపు ప్రతి పౌరుడికీ కనీస ఆదాయం వచ్చేలా ఓ పథకాన్ని ప్రారంభించనున్నట్లు కూడా అందులో పేర్కొంది.

నిధులున్నా పనులు పూర్తికావు

సీడీపీ కింద ఏటా ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులను ఎమ్మెల్యేలు సరిగా వినియోగించడంలేదనీ, కొందరైతే అసలు ప్రతిపాదనలు కూడా పంపించడం లేదని ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఆమోదించిన పనులపై కూడా సరైన పర్యవేక్షణలేక అమలులో జాప్యం జరుగుతోందని పేర్కొంది. దీంతో ఎమ్మెల్యే నిధుల ద్వారా నియోజకవర్గాల్లో చేపట్టే అభివృద్ధి పనులకు అనుమతులు రాక, వచ్చినా అవి పూర్తి కాక ప్రగతి మందగించిందని తెలిపింది.

Image copyright Getty Images

టీ పొడినీ వదలట్లేదు

విజయవాడ, గుంటూరు కేంద్రంగా నకిలీ టీ పొడి తయారీ జరుగుతోందంటూ సాక్షి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ పతాక కథనాన్ని ప్రచురించింది. వాడిన టీ పొడికి కొన్ని రసాయనాలు, జీడిపిక్కల తయారీలో మిగిలే వ్యర్థాలనూ కలిపి మళ్లీ ప్యాక్ చేస్తున్నారని వెల్లడించింది. టీకొట్టు యజమానులకు కల్తీ పొట్లాలను గుర్తించడంపై అవగాహనలేకపోవడం కూడా దీనికో కారణం. చర్యలను తీసుకోవాల్సిన ఆహార నాణ్యత నియంత్రణ శాఖ అధికారులు సిబ్బంది కొరతతో చేతులెత్తేశారు. ఈ వ్యాపారం విలువ రోజుకు సుమారు రూ.10కోట్ల పైనే ఉంటుందని అంచనా.

Image copyright Getty Images

బిచ్చమెత్తితే జైలుకే!

ఇకపై హైదరాబాద్‌లో రహదారి కూడళ్లలో బిచ్చమెత్తుతూ వాహనచోదకులు, పాదచారులకు ఇబ్బందులు కలిగిస్తే తీసుకెళ్లి జైల్లో పెడతామని పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నిషేధం రెండునెలలపాటు అమల్లో ఉంటుందని తెలిపారు. అంతర్జాతీయ వాణిజ్య సదస్సు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆదేశాల ప్రకారం.. ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తే నెలరోజులు జైలు లేదా రూ.200 జరిమానా లేదా రెండూ విధించే ఆస్కారముంది. దీనిపై సాక్షి తెలంగాణ ఎడిషన్ ఓ కథనాన్ని ప్రచురించింది.

Image copyright Getty Images

ఒక రైతుకు ఒకటే సర్వే నంబర్

జనవరి 26న కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఒక గ్రామంలో ఒక రైతుకు ఎన్ని చోట్ల భూములున్నా వాటన్నింటికీ ఒకటే సర్వే నంబరు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. రైతు సంక్షేమానికే సమగ్ర భూ ప్రక్షాళనను చేపట్టినట్లు వెల్లడించారు. దీన్ని పారదర్శకంగా, ప్రణాళికాబద్ధంగా పూర్తిచేస్తామని చెప్పారు. దీనిపై అసెంబ్లీలో సీఎం చేసిన ప్రసంగాన్ని నమస్తే తెలంగాణ ప్రముఖంగా ప్రచురించింది.

ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)