అభిప్రాయం: ప్రశ్నలతో ‘నిర్భయ’లపై మళ్లీ మళ్లీ అత్యాచారం
- దివ్య ఆర్య
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, Getty Images
డిసెంబర్ నెల మళ్లీ వస్తోంది. ఐదేళ్లు గడిచిపోతున్నాయి. కదిలే బస్సులో నిర్భయపై సామూహిక అత్యాచారం జరిగాక అనేక చట్టాలు వచ్చాయి.
నిర్భయ సంఘటన జరిగి ఐదేళ్లయితే, ఫర్హా సంఘటన జరిగి ఏడాది కావస్తోంది.
కాలేజి నుంచి సైకిల్‌పై ఇంటికి తిరిగి వస్తున్న ఫర్హాపై సామూహిక అత్యాచారం జరిగింది.
ఆ కుర్రాళ్లు ఆమె ఇంటికి పొరుగునే ఉండేవాళ్లు. వాళ్లు ఆమెను సమీపంలోని పొలాల్లోకి లాక్కెళ్లారు. ఆమె అరిస్తే బెదిరించడానికి వాళ్ల చేతిలో యాసిడ్ బాటిల్ ఉంది.
మొదట ఆ కుర్రాళ్లు ఒక్కొక్కళ్లుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత చెరుకుగడను ఉపయోగించారు.
బాధ భరించలేక ఆమె అరిస్తే, ముఖంపై యాసిడ్ పోశారు.
ఆమె ప్రాణాలతో బయటపడింది కానీ.. ఇప్పటికీ భయంతో వణుకుతోంది.
ఫొటో సోర్స్, Getty Images
చట్టాలు చేసినా ప్రయోజనం శూన్యం
ఫర్హా న్యాయం కోసం పోరాడుతోంది. కానీ ఆ న్యాయపోరాటంలో ఆమె మళ్లీ మళ్లీ అత్యాచారానికి గురవుతోంది.
నిర్భయ అత్యాచారం తర్వాత లైంగిక అత్యాచారాలపై పార్లమెంట్లో చట్టాలు చేయడంతో పరిస్థితి మారుతుందని భావించారు.
ఇప్పుడు లైంగిక హింస జరిగిన సందర్భంలో పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం తప్పనిసరి. అలా చేయకుంటే వాళ్లకు రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు.
కానీ పోలీసులు ఫర్హా అత్యాచారంపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయలేదు, దోషులకు ఎలాంటి శిక్షా పడలేదు.
కాలిపోయిన ముఖం, చెదిరిన దుస్తులతో ఆమె పోలీస్ స్టేషన్‌కు వెళ్లినపుడు జరిగిన అత్యాచారం గురించి పోలీసులు మళ్లీ మళ్లీ ప్రశ్నించారు.
ఆ కుర్రాళ్లు ఆధిపత్య కులాలవాళ్లు. అందువల్ల వాళ్ల కుటుంబసభ్యులు, పోలీసులు ఆమే దోషి అన్నట్లు మాట్లాడారు. ప్రశ్నలతో అవమానించారు.
ఫొటో సోర్స్, Getty Images
అవమానకరమైన ‘టూ ఫింగర్ టెస్ట్’
స్వచ్ఛంద సంస్థలు, 'హ్యూమన్ రైట్స్ వాచ్' అత్యాచారానికి గురైన 21 మంది మహిళలతో మాట్లాడగా, న్యాయసహాయం విషయంలో ఎదురవుతున్న ఆటంకాలను వారు వివరించారు.
'అత్యాచారానికి గురైన మహిళలను పోలీస్ స్టేషన్లలో సమాధానాలు చెప్పలేని ప్రశ్నలు అడుగుతున్నారు. వాళ్లు కనుక ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వారైతే కనీసం ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయడం లేదు' అని నివేదికలు పేర్కొంటున్నాయి.
ఓటమిని అంగీకరించని ఫర్హా.. స్థానిక కోర్టుకు వెళ్లి ఫిర్యాదు చేసింది. కోర్టు నిందితులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
కానీ ఆ ఆదేశాలను అమలు చేయడానికి కూడా పోలీసులకు 5 నెలలు పట్టింది.
పోలీస్ స్టేషన్‌కు వెళ్లడానికి ముందు ఫర్హా అత్యాచారం జరిగినట్లు సాక్ష్యం కోసం వైద్య పరీక్షలకు ఆసుపత్రికి వెళ్లింది.
కుర్రాళ్లు, చెరుకుగడ, ఆ తర్వాత డాక్టర్ చేతులు.. ఆమె జననాంగంలోకి వెళ్లాయి.
ఈ 'టూ ఫింగర్ టెస్ట్' తర్వాత డాక్టర్ 'ఆమె జననాంగం చాలా విచ్చుకుని ఉంది. ఆమె తప్పకుండా సెక్స్‌కు అలవాటు పడినట్లు కనిపిస్తోంది' అన్నారు.
యాసిడ్ ఆమె ముఖాన్ని కాలిస్తే డాక్టర్ మాటలు ఆమె మనసును కాల్చేశాయి.
ఫొటో సోర్స్, Getty Images
మహిళల జననాంగంలోకి వేళ్లను చొప్పించి పరీక్షించే 'టూ ఫింగర్ టెస్ట్' చాలా అవమానకరమైనది.
2014లో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆ అమానుష పరీక్షను నిషేధించాలని సూచించింది.
దాంతోపాటు లైంగిక అత్యాచారాలకు గురైన మహిళలకు ఎలా వైద్య పరీక్షలు నిర్వహించాలి అన్నదానిపై మార్గదర్శకాలు జారీ చేసింది.
కానీ 'ఆరోగ్యం' రాష్ట్రం పరిధిలోని అంశం. అందువల్ల 2014 మార్గదర్శకాలకు చట్టబద్ధత లేదు.
హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదిక ప్రకారం కేవలం 9 రాష్ట్రాలు మాత్రమే ఈ మార్గదర్శకాలను అంగీకరించాయి. అయితే అక్కడ కూడా వాటిని పాటించడం లేదు.
మొదట ఆసుపత్రి, తర్వాత పోలీసులు. కానీ ఆ హింస అక్కడితో ఆగిపోలేదు.
ఫొటో సోర్స్, Getty Images
నిధులు ఇచ్చారు.. ఖర్చు చేయడం మరిచారు
పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు అవుతున్న రేప్‌ల సంఖ్య 2012లో 24,923 ఉండగా, 2015లో అవి 34,651కి పెరిగాయి. ఇంకా పెరుగుతూనే ఉన్నాయి.
2013లో కేంద్ర ప్రభుత్వం లైంగిక అత్యాచారానికి గురైన మహిళల సంరక్షణ, పునరావాసం కోసం 'నిర్భయ నిధి'ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత నాలుగేళ్లలో దానికి మరో రూ.3,000 కోట్లను జత చేసింది.
అయితే ఆ నిధిలో చాలా భాగాన్ని ఖర్చు చేయలేదని హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదిక పేర్కొంది.
ఈ నిధితో అత్యాచార బాధితుల కోసం 'వన్ స్టాప్ సెంటర్'ను నెలకొల్పాలి.
అక్కడ బాధితులకు పోలీసుల సహాయం, న్యాయసహాయం, చికిత్సాపరమైన సహాయం, కౌన్సెలింగ్ వంటివి ఒకే చోట లభిస్తాయి.
ప్రభుత్వ లెక్కల ప్రకారం నేటి వరకు అలాంటి కేంద్రాలు 151 ఉన్నాయి. కానీ ఇవేవీ ఫర్హా ఉంటున్న ప్రదేశానికి దగ్గరలో లేవు.
ఆమె ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినా, ఆమెకు ఎలాంటి న్యాయసహాయం అందలేదు.
ఫొటో సోర్స్, Getty Images
మహిళలపై హింసకు వ్యతిరేకంగా నిరసన
మహిళలు, బాలలపై జరిగే హింసపై విచారణ కోసం కేంద్ర ప్రభుత్వం 524 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసింది. కానీ అవి ఎలా పని చేస్తున్నాయన్న దానిపై ఎలాంటి సమాచారమూ లేదు.
ఫర్హా కేసు ఫాస్ట్ ట్రాక్ కాదు కదా, మామూలు కోర్టులో కూడా విచారణకు రాలేదు.
ఆమె ఓటమిని అంగీకరించలేదు. అలాగని ఆమె 'నిర్భయ'గా కూడా ఉండలేకపోతున్నారు. ఆసుపత్రి సిబ్బంది, పోలీసుల తర్వాత ఇప్పుడు మరోసారి కోర్టులో ఏమేం ఎదుర్కోవాల్సి ఉందో అన్న భయం ఆమెను వెంటాడుతోంది.
(బాధితురాలి పేరు మార్చాం)
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)