సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్: సింధూపై సైనాదే గెలుపు

  • 8 నవంబర్ 2017
సింధు-సైనా Image copyright Getty Images
చిత్రం శీర్షిక సైనా - సింధు ఇప్పటిదాకా మూడుసార్లు అంతర్జాతీయ టోర్నీల్లో తలపడ్డారు

సైనా - సింధు.. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఇద్దరూ ఇద్దరే. ఒకరు ఒలింపిక్స్‌లో భారత్‌‌కి తొలి బ్యాడ్మింటన్ పతకాన్ని అందించారు. మరొకరు అదే వేదికపై దేశానికి తొలి రజతాన్ని రుచి చూపించారు. ఒకరిని ‘బ్యాడ్మింటన్ క్వీన్ ఆఫ్ ఇండియా’ అని అభిమానులు పిలిస్తే, మరొకర్ని ‘యువ సంచలనం’గా అభివర్ణిస్తారు.

ఈ ఇద్దరూ కోర్టులో ఎదురెదురుగా ఎప్పుడు తలపడతారా అని చాలామంది బ్యాడ్మింటన్ అభిమానులు ఎదురు చూస్తుంటారు. బుధవారం జరిగిన అలాంటి ఆసక్తికర మ్యాచ్‌కి నాగ్‌పూర్ వేదికైంది. సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో సైనా నెహ్వాల్, పీవీ సింధుల ప్రదర్శన అభిమానులకు ఉత్సాహంతో పాటు ఉత్కంఠనూ పంచింది.

చివరిదాకా నువ్వా నేనా అన్నట్టు సాగిన ఆ ఫైనల్లో విజయం సైనానే వరించినా, అసలు సిసలు వినోదం మాత్రం క్రీడాభిమానులకు దక్కింది. 20-20, 22-22, 24-24, 25-25... సైనా సింధుల మధ్య పోటీ ఎంత తీవ్రంగా సాగిందో చెప్పడానికి రెండో సెట్లోని ఈ గణాంకాలే సాక్ష్యం. హోరా హోరీగా సాగిన ఈ పోరులో 21-17, 27-25 పాయింట్ల తేడాతో చివరికి సైనా టైటిల్ గెలుచుకుంది.

Image copyright Getty Images

ఫేస్ టు ఫేస్

ఇప్పటి దాకా భారీ టోర్నీల్లో భారత స్టార్ షట్లర్లు సైనా-సింధు కేవలం మూడు సార్లే తలపడ్డారు. అందులో మంగళవారం దాకా 1-1 విజయాలతో ఇద్దరూ సమంగా ఉన్నా, బుధవారం సాధించిన విజయంతో సైనా 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

తొలిసారి వీళ్లిద్దరూ 2014లో సయ్యద్ మోదీ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ టోర్నీ ఫైనల్లో పోటీపడ్డారు. అందులో సైనా 21-14, 21-17 తేడాతో విజయాన్ని అందుకుంది. దాదాపు పదిహేను నెలల ఎదురుచూపుల తరవాత సైనా సాధించిన టైటిల్ అది.

Image copyright Getty Images

మూడేళ్ల తరవాత 2017లో రెండోసారి ఆ ఇద్దరూ ఇండియా ఓపెన్ సిరీస్‌లో తలపడ్డారు. ఈసారి సింధు ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని గెలుచుకున్న ఉత్సాహంతో ఉంటే, సైనా మోకాలి సర్జరీ తరవాత కొంత విరామం తీసుకొని కోర్టులోకి అడుగుపెట్టింది. అప్పుడు జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సింధు 21-16, 22-20 పాయింట్ల తేడాతో సైనాను ఓడించింది.

ముచ్చటగా మూడోసారి బుధవారం జరిగిన సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ విజయంతో సింధుపై విజయాల ఆధిక్యాన్ని సైనా 2-1‌కి పెంచుకుంది.

Image copyright Getty Images

ఈ టోర్నీకి ముందు సైనా (2006,2007), సింధూ(2011, 2013) చెరో రెండుసార్లు సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నారు. పోటీ పడ్డ రెండు సార్లూ ఇద్దరు ఫైనల్స్‌లో విజేతలుగా నిలిచి టైటిల్ గెలుచుకున్నారు. తొలిసారి ఇద్దరూ కలిసి పాల్గొన్న ఈ టోర్నీలో మాత్రం విజయం సైనా వైపే మొగ్గింది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)