మహారాష్ట్ర: పాప వైద్యం కోసం ఆదివాసీ దంపతుల సుదీర్ఘ ప్రయాణం

  • 11 నవంబర్ 2017
రవిత Image copyright Mayuresh Konnur

ఈ చిన్నారికి ఎనిమిదేళ్లు. ఓ ప్రమాదంలో గాయపడిన ఆమెకు కాళ్లు చచ్చుబడిపోయాయి. తమ కూతురికి ఆపరేషన్ చేయించడం కోసం తల్లిదండ్రులు 45 రోజులు ప్రయాణం చేశారు.

ఆ ప్రయాణంలో చాలా భాగం కాలినడకే. సొంత రాష్ట్రంలోనే, ఒక మారుమూల ఆదివాసీ ప్రాంతం నుంచి ముంబయి మహానగరంలోని ఓ ఆసుపత్రికి చేరడానికి వారికి అక్షరాలా 45 రోజులు పట్టింది.

వారు భిల్ ఆదివాసీ సముదాయానికి చెందిన వారు. వారు మాట్లాడే భిలీ భాష బైటివారికి, ఆసుపత్రి సిబ్బందికి అర్థం కాదు.

ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారుతూ చివరికి 45 రోజుల తిరిగితే తప్ప తమ కూతురికి సరైన చికిత్స చేయగల ఆసుపత్రి వారికి లభించలేదు.

రాజా వాల్వి, శాంతి వాల్వి దంపతులిద్దరూ పశువులను మేపుతూ జీవనం గడుపుతారు. ఓ రోజు వారి కూతురు రవిత 25 అడుగుల ఎత్తున్న చెట్టు మీది నుంచి కింద పడిపోయింది.

ఏమైందో వారికి అర్థం కాలేదు. వారికి తమ భాష తప్ప మరో భాష రాదు. చదవడం రాయడం అసలే రాదు.

సెప్టెంబరు నెల ప్రారంభంలో ఈ ఘటన జరిగినప్పటి నుంచీ సరైన వైద్యం కోసం ఆ తల్లిదండ్రులు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. చివరికి రవిత వెన్నుపూసకు గాయమైందని తేలింది.

Image copyright Mayuresh Konnur

అంబులెన్స్ కాదు... 'బాంబులెన్స్'

రవిత తల్లిదండ్రులు మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలోని ఓ గ్రామంలో ఉంటారు. ఈ జిల్లాకు సరైన రవాణా సదుపాయాలేవీ లేవు.

రవిత గాయపడిన తర్వాత ఆసుపత్రికి తరలిద్దామంటే అక్కడికి అంబులెన్స్ రాలేదు. సృహ కోల్పోయిన కుమార్తెను తీసుకెళ్లేందుకు వారు 'బాంబులెన్స్' సహాయం తీసుకున్నారు. ఒక దుప్పటిని రెండు వైపులా రెండు వెదురు బొంగులతో కట్టి జోలెలా చేసి దానిపైనే తీసుకెళ్లారు. దాన్నే బాంబులెన్స్ అంటారు. ఇక్కడ బాంబులెన్సులు సర్వసాధారణం.

అలా తమ చిన్నారిని 30 నిమిషాలు బాంబులెన్స్‌లో మోసుకుంటూ వెళ్లి ఓ జీపులో ఎక్కించారు. ఇక్కడి పల్లెల్లో ప్రజల ప్రయాణాలకు ఈ జీపులే ఆధారం. అలా 11 కిలోమీటర్లు ప్రయాణించి ప్రాథమిక చికిత్స కేంద్రానికి చేరారు.

ఆ ప్రాథమిక చికిత్స కేంద్రంలో డాక్టర్ గాయానికి కట్లు కట్టి మెరుగైన చికిత్స కోసం రవితను నందుర్బార్‌లో ఉన్న సివిల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని సూచించారు. చికిత్స కోసం వారు తిరిగిన ఐదు ఆసుపత్రుల్లో ఇది మొదటి ఆసుపత్రి.

మళ్ళీ బాంబులెన్స్‌లో 80 కిలోమీటర్లు ప్రయాణించారు. ప్రజారోగ్య వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా ఉందో చెప్పేందుకు ఇంతకన్నా వేరే ఉదాహరణ అక్కర్లేదు.

ఒక ఆసుపత్రి తరువాత మరో ఆసుపత్రి

రవితను నందుర్బార్ జిల్లాలో ఉన్న ఆసుపత్రిలో 10 రోజులు ఉంచారు. అయినా ఆమె ఆరోగ్యం మెరుగుపడలేదు. దీంతో అక్కడి నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పినా వినకుండా రవిత తండ్రి కుమార్తెను ఇంటికి తీసుకెళ్లిపోయాడు. ఎందుకంటే వారు చెప్పిన ఆసుపత్రి పక్క రాష్ట్రం గుజరాత్‌లో ఉంది.

"అక్కడికెళ్లాలంటే విసుగు పుట్టింది. ఆ తరువాత ఏం చేయాలో అర్థం కాలేదు" అని రవిత తండ్రి తెలిపారు.

రవిత చేతుల్లో మాత్రమే కదలిక ఉంది. ఆమె అతి కష్టం మీద అన్నం తింటోంది.

ఆ తరువాత 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి రవితను తీసుకెళ్లారు. కానీ రవితకు తాము చికిత్స చేయలేమని డాక్టర్లు తెలిపారు.

అక్కడి నుంచి వారు మరో ఆసుపత్రికి వెళ్లగా వారు ముంబయి తీసుకెళ్లాలని సూచించారు. ఆ ఆసుపత్రిలో ఓ వైద్యుడు అంబులెన్స్ ఏర్పాటు చేసి అవసరాలకోసం కొంత డబ్బు కూడా ఇచ్చారని రవిత తండ్రి తెలిపాడు.

అలా రవిత చివరికి ముంబయిలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్‌కు చేరింది.

కానీ దాంతో వారి సమస్యలు తొలగిపోలేదు. "వారికి మా భాష అర్థం కాదు. వారు మాట్లాడేది మాకు అర్థం కాదు" అని రవిత తండ్రి తెలిపారు.

నాలుగు రోజుల పాటు చికిత్స చేసినా ఆమెలో ఎలాంటి మార్పూ కనిపించకపోవడంతో వారు రవితను తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.

బయటికొచ్చి నందుర్బార్ ఎలా వెళ్ళాలి అని వాళ్లనీ వీళ్లనీ అడిగారు. కానీ వారు మాట్లాడే భాష ఎవరికీ అర్థం కాలేదు.

ఎవరిని అడిగినా వారికి ఏమీ చెప్పలేకపోయారు. చివరికి పోలీసులు అక్కడకు వచ్చారు.

రవిత తండ్రి ఎలాగోలా తన పరిస్థితిని వివరించాడు. పోలీసులు అక్కడి నుంచి వారిని ఓ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆ భాష మాట్లాడే ఓ మహిళా కానిస్టేబుల్ పోలీసులకు దొరికారు.

డాక్టర్లు రవితను గోకుల్ తేజ్ పాల్ (జీటీ) ఆసుపత్రికి తీసుకెళ్లాలనుకున్నారని, అక్కడే రవితకు సరైన చికిత్స అందుతుందని ఆమె వివరించారు.

Image copyright Getty Images

రవిత చెట్టుపైనుంచి కింద పడడంతో ఆమె వెన్నుపూస విరిగిందని, దీంతో ఆమె శరీర దిగువ భాగంలో స్పందన లోపించిందని జీటీ ఆసుపత్రి వైద్యులు బీబీసీతో అన్నారు. రవిత పోషకాహారలోపంతో బాధపడుతున్నందువల్ల వెంటనే ఆమెకు ఆపరేషన్ చేయలేమని వారు తెలిపారు.

చివరికి రవితకు నవంబర్ 3న సర్జరీ చేశారు.

"ఆమె పరిస్థితి వెంటనే మెరుగవుతుందని చెప్పడం కష్టం కానీ ఫిజియోథెరపీతో రవిత ఆరోగ్యం యథాస్థితికి రావొచ్చు" అని ఆసుపత్రి చీఫ్ సూపరింటెండెంట్ డాక్టర్ ముకుంద్ తయాడే బీబీసీతో అన్నారు.

ఆమెను ముందే ముంబయి తీసుకువచ్చి ఉంటే బాగుండేదని ఆయన అన్నారు. ఎందుకంటే నందుర్బార్, ధులే వంటి ప్రాంతాల్లో న్యూరోసర్జన్లు ఉండరని, వెన్నెముక గాయాలకు అక్కడి వైద్యులు చికిత్స చేయలేరని ఆయన తెలిపారు.

ఆమె చెట్టుపై నుంచి కింద పడినప్పుడే ఆమె వెన్నెముక విరిగిందని, వెంటనే చికిత్స చేసి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని వారు తెలిపారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ముఖ్యమైన కథనాలు

#FIFA2018: 20 ఏళ్ల తర్వాత కప్పుగొట్టిన ఫ్రాన్స్

మీ పిల్లలను ఏ భాషలో చదివిస్తారు? మాతృభాషలోనా.. లేక ఇంగ్లిష్‌లోనా

ప్రెస్ రివ్యూ: కత్తి మహేశ్‌, పరిపూర్ణానందలను ఎందుకు బహిష్కరించామంటే.. గవర్నర్‌కు కేసీఆర్ వివరణ

ఇతను సంగీతంతో ఆటిజాన్ని జయించాడు, వారానికి ఓ భాష నేర్చుకుంటున్నాడు

హైదరాబాద్ రోహింజ్యాలు: ఆధార్ కార్డులు ఎందుకు, ఎలా పొందుతున్నారంటే..

#FIFA2018: పది ఫొటోల్లో ఫుట్‌బాల్ ప్రపంచ కప్ ఫైనల్ హైలైట్స్, రికార్డులు, అవార్డులు

ట్విటర్‌ ఫేక్ ఖాతాల ప్రక్షాళన: తెలుగు ప్రముఖుల ఫాలోవర్లలో అసలెందరో, నకిలీలెందరో తెలుసుకోండి

‘అందరికీ చెడ్డ రోజులుంటాయి’.. ధోనీ ‘డిఫెన్స్’కి కోహ్లీ సమర్థన